గంటా చివరి ప్రయత్నాలు ?

ఎందుకో గంటా శ్రీనివాసరావు రాజకీయం ఈసారి సాఫీగా సాగడంలేదు. ఆయన వస్తాను అంటే గేట్లు తెరచి మరీ రాజమార్గాన పార్టీలోకి ఆహ్వానించే పొలిటికల్ సీన్ నే ఇంతదాకా [more]

Update: 2020-09-08 06:30 GMT

ఎందుకో గంటా శ్రీనివాసరావు రాజకీయం ఈసారి సాఫీగా సాగడంలేదు. ఆయన వస్తాను అంటే గేట్లు తెరచి మరీ రాజమార్గాన పార్టీలోకి ఆహ్వానించే పొలిటికల్ సీన్ నే ఇంతదాకా అంతా చూశారు, గంటాకు కూడా అదే అనుభవం. కానీ వైసీపీలో చేరాలన్న ఆయన కోరిక మాత్రం రెండేళ్ళుగా తీరడంలేదు. ఎన్నికల ముందు విశ్వప్రయత్నం చేస్తే శిష్యుడు అవంతి శ్రీనివాస్ చెప్పాపెట్టకుండా ముందే జంప్ చేసి పెద్ద దెబ్బకొట్టాడు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత నుంచి వల వేస్తున్నా కూడా వైసీపీ చేప చిక్కడంలేదు. దాంతో మరి ఇపుడు గంటా శ్రీనివాసరావు లాస్ట్ చాన్స్ అంటున్నారుట.

ఆయనతోనే …?

గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు అతి పెద్ద బ్రేక్ ఎంపీ విజయసాయిరెడ్డి అని అందరికీ తెలిసిందే. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు, అంతే కాదు, ఆయన కుటుంబ సభ్యుడి కంటే కూడా ఎక్కువ. ఆ సంగతి మరచి గంటా శ్రీనివాసరావు సజ్జల రామక్రిష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణల ద్వారా జగన్ ప్రసన్నం చేసుకున్నారు. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం మొత్తం సీన్ రివర్స్ చేశారు. దాంతో గంటా శ్రీనివాసరావు గమ్మున ఉన్నారు. ఇక గంటాను పార్టీలో తీసుకురావద్దు అని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పినా జగన్ పెద్దగా పట్టించుకోరు అంటారు.

గ్యాప్ తొలగేలా…?

ఇక గంటా శ్రీనివాసరావు రాజకీయ మంత్రాంగానికి మరో మారు పదును పెడుతున్నారట‌. ఆయన ఈసారి నేరుగా విజయసాయిరెడ్డినే ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని టాక్. మొదట్లో ఈ ఇద్దరి మధ్యన రిలేషన్స్ బాగానే ఉండేవని అంటారు. గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకువచ్చే పనిని విజయసాయిరెడ్డి తలకెత్తుకున్నారని చెబుతారు. అయితే గంటా సన్నిహితులు విజయసాయిరెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి ట్రోల్ చేశారని అంటారు. పైగా కుల సమీకరణలు బయటకు తెచ్చి గంటా బొత్సతో దోస్తీ చేయడం వంటి పరిణామాల వల్ల తనకే చివరకు ఎసరు వస్తుందని భావించి సాయిరెడ్డి గంటా శ్రీనివాసరావును అడ్డుకున్నారని అంటారు. ఇపుడు గంటా విజయసాయిరెడ్డినే మంచి చేసుకోవాలనుకున్నా ఆయన ఇంత జరిగాకా ఓకే అంటారా అన్న చర్చ కూడా ఉంది.

సెట్ చేయాలనే …?

గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి తానే డెడ్ లైన్ పెట్టుకున్నారని అంటున్నారు. అదేంటి అంటే ఈ ఏడాది చివరలోగా చేరితే వైసీపీలో చేరాలని, లేకపోతే బీజేపీలోకి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. తొంబై శాతం గంటా శ్రీనివాసరావు మనసు వైసీపీ మీదనే ఉందని టాక్. దానికి రాజకీయ కారణాలతో పాటు ఇతర కారణాలు కూడా ముడిపడిఉన్నాయని చెబుతున్నారు. గత అయిదేళ్ళలో గంటా అనుచరులు జరిపిన భూదందాలు వంటివి కూడా ఈ చేరికకు ప్రేరేపిస్తున్నాయని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి మెత్తబడితేనే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరడానికి లైన్ క్లియర్ అవుతుందని అంటున్నారు. జగన్ తాను చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నా కూడా విజయసాయిరెడ్డి చెబితేనే అంటూ కండిషన్ పెట్టారని టాక్. మొత్తానికి టీడీపీకి దెబ్బకొట్టి గంటా శ్రీనివాసరావును ఇటువైపు తేవాలని జగన్ కి ఉంది, కానీ విజయసాయిరెడ్డి ఎస్ అంటేనే ఏదైనా జరిగేది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News