బెట్టు చేస్తున్న గంటా.. గట్టు దిగని బాబు ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన రాజకీయం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఊరు వచ్చినా విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలకలేదు. ఇది రెండవసారి. గత [more]

Update: 2021-01-10 13:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన రాజకీయం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఊరు వచ్చినా విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలకలేదు. ఇది రెండవసారి. గత ఏడాది బాబు వచ్చినపుడు కూడా గంటా శ్రీనివాసరావు విశాఖలోనే ఉండి కనీసం ముఖం చూపించలేదు. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరంటే ఇద్దరు మాత్రమే బాబుకు తాజా పర్యటనలో వెల్ కం చెప్పారంటేనే అర్ధం చేసుకోవాలి పసుపు పార్టీ విలాసం విశాఖలో ఎలా ఉందో అన్నది.

అలక బూనారా..?

గంటా శ్రీనివాసరావు కంటే పెద్ద లీడర్ విశాఖలో లేడు అని గట్టిగా చెప్పవచ్చు. అర్ధబలం, అంగ బలం గట్టిగా ఉన్న గంటా వంటి నేతను పక్కన పెట్టడం అంటే అది టీడీపీకి ఆత్మహత్యా సదృశ్యమే. కానీ బాబు గంటా శ్రీనివాసరావుకు కనీసం ఏ ఒక్క పార్టీ పదవి ఇవ్వలేదు. విపక్షంలోకి వచ్చిన మొదట్లో గంటా శ్రీనివాసరావు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని కోరుకున్నారు. బాబు దాన్ని తీసుకెళ్ళి పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు. కనీసం ఉప సభా నాయకుడిగా అయినా నియమించలేదు. ఇక పార్టీ పదవులు చాలా పెద్ద ఎత్తున పంచినా కూడా గంటాను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. రెండు దశాబ్దాలకు పైబడి రాజకీయం చేస్తున్న గంటాను పొలిట్ బ్యూరోలోకి తీసుకోలేదు. దాంతో మండిపోతున్న గంటా ముఖం చాటేస్తున్నారు అంటున్నారు.

బాబు ద్వారా పిలుపొస్తేనే తప్ప…

ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావుకు ఇప్పటికిప్పుడు పెద్దగా బయటకు వచ్చి రచ్చ చేయాల్సిన అవసరం లేదు. తాను ఏ పార్టీలో ఉన్నా గెలిచే స్థోమతను సంపాదించుకున్నారు. జిల్లావ్యాప్తంగా అభిమానులను పెద్ద సంఖ్యలో కలిగి ఉన్న గంటా టీడీపీలో అలా టెక్నికల్ గా కొనసాగుతున్నారు. బాబు నుంచి పిలుపు వస్తేనే తప్ప స్పందించకూడదని గంటా శ్రీనివాసరావు డిసైడ్ అయ్యరని టాక్ నడుస్తోంది. బాబుకు గంటా అవసరం భవిష్యత్తులో తప్పనిసరిగా ఉందని అంటున్నారు. విశాఖ సిటీలో పార్టీని నడిపించే సీన్ ఎవరికీ లేదు. దాంతో గంటా శ్రీనివాసరావు తో ఇవాళ కాకపోయినా ఎపుడైనా బాబు మాట్లాడుతారు అంటున్నారు. అదే జరిగిన నాడు గంటా తాను చెప్పాలనుకున్నది చెబుతారు అంటున్నారు.

అన్ని ఆప్షన్లూ ఓపెన్….?

ఇక గంటా శ్రీనివాసరావు చాలా తెలివైన నాయకుడు. టీడీపీలో ఉన్నారా అంటే ఉన్నట్లే ఉన్నారు. అలాగనీ యాక్టివ్ గా లేరు. ఏపీ రాజకీయాలు ఇంకా అయోమయంగానే ఉన్నాయి. టీడీపీ పుంజుకుంది అన్న సూచనలు ఇప్పటికైతే లేవు. దాంతో గంటా శ్రీనివాసరావు మరి కొన్నాళ్ళు సైలెంట్ గానే ఉంటూ అన్నీ గమనించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. తాజాగా మీడియాతో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను పార్టీ మారితే తప్పకుండా అందరికీ చెప్పే వెళ్తాను అని భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతే తప్ప పార్టీ మారను అని మాత్రం ఎక్కడా అనలేదు. దాంతో టీడీపీ శ్రేణుల్లో అదే డైలమా కంటిన్యూ అవుతోంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావు సరైన టైం కోసమే ఎదురుచూస్తున్నారు. బహుశా ఈ ఏడాది జరిగే తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికల ఫలితాల తరువాత ఆయన స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అంటున్నారు.

Tags:    

Similar News