ఉక్కుకు దిక్కు గా మారుతారా…?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కావడం ఆంధ్రులు ఎవరికీ ఇష్టం లేదు. ప్రత్యేకించి విశాఖవాసులకు అది బలమైన సెంటిమెంట్. ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేట్ పరం [more]
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కావడం ఆంధ్రులు ఎవరికీ ఇష్టం లేదు. ప్రత్యేకించి విశాఖవాసులకు అది బలమైన సెంటిమెంట్. ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేట్ పరం [more]
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కావడం ఆంధ్రులు ఎవరికీ ఇష్టం లేదు. ప్రత్యేకించి విశాఖవాసులకు అది బలమైన సెంటిమెంట్. ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించిన నాడే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఆయన ఆ తరువాత ఉక్కు ఉద్యమాన్ని చేపడతామని కూడా చెప్పుకొచ్చారు. ఇపుడు ఉక్కు ఉద్యమాన్ని ఏపీవ్యాప్తంగా విస్తరించడానికి గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నాట్లుగా తెలుస్తోంది.
తిరుపతి వేదికగా ….
తిరుపతి పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి ఉమ్మడి అభ్యర్ధిని బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టాలని గంటా శ్రీనివాసరావు ప్రతిపాదిస్తున్నారు. ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కావడాన్ని వ్యతిరేకిస్తున్నందువల్ల కేంద్రానికి తెలిసే విధంగా చెప్పాలంటే అన్ని పార్టీలు ఒక్కటి కావాలని గంటా శ్రీనివాసరావు పిలుపు ఇస్తున్నారు. అంటే అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కూడా కలసి ఒక్కరే అభ్యర్ధిని ఆమోదించాలన్నమాట.
అయ్యే పనేనా …?
ఇక తిరుపతిలో ఉమడి అభ్యర్ధిని బీజేపీకి వ్యతిరేకంగా పెట్టడం అంటే జరిగే పనేనా అన్న చర్చ అయితే వస్తోంది. గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ టెక్నికల్ గా టీడీపీకి చెందిన వారే. ఆయన ఏదైనా చేస్తే దాని వెనక చంద్రబాబు ఉన్నారు అన్న భావన కూడా కలిగే అవకాశం ఉంది. మరో వైపు చూస్తే తమ సొంత సీటు తిరుపతిని దక్కించుకోవడానికి వైసీపీ ఉప ఎన్నికల బరిలోకి దిగడం ఖాయం. పైగా ఏపీలో బలంగా ఉన్న వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది కూడా. అందువల్ల గంటా శ్రీనివాసరావు ప్రతిపాదించే ఇలాంటి ఉమ్మడి వేదికలకు వైసీపీ దూరంగానే ఉంటుంది అంటున్నారు.
అజెండా అదే….
ఏపీలో టీడీపీ వైసీపీని గట్టిగా ఎదుర్కోలేకపోతోంది. మిగిలిన పార్టీలు చూస్తే అంగుష్టమాత్రంగా ఉన్నాయి. వైసీపీలోకి వెళ్లడానికి గతంలో ట్రై చేసిన గంటా శ్రీనివాసరావు ఇపుడు ఎందుకో ఆ ఆలోచన విరమించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో తాను సొంతంగా ఎదగాలని ఆయన అనుకుంటున్నారుట. దానికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆయన ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు అని చెబుతున్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్ ఏపీవ్యాప్తంగా ఉన్నందువల్ల దాన్ని రాజేసి తాను రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకోవడానికి గంటా చూస్తున్నారు అంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు ఇపుడు ఏపీలో రాజకీయ రిఫరీగా మారదలచుకున్నారా లేక తన వైపే రాజకీయ ఫోకస్ ఉండేలా చూసుకుంటున్నారా అన్నది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు నోరు బాగా విప్పుతున్నారు అంటే ఆ వెనక చాలానే ఆలోచనలు ఉన్నాయనుకోవాలి.