పవన్ వైపు గంటా పయనం.. నిజమేనట

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎవరు ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు. అందునా ఏపీ రాజకీయాలను పూర్తిగా ఔపాసన పట్టేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారి గురించి [more]

Update: 2021-04-12 13:30 GMT

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎవరు ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు. అందునా ఏపీ రాజకీయాలను పూర్తిగా ఔపాసన పట్టేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారి గురించి వేరే చెప్పాలా. ఆయన చూపు ఇపుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పడింది అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ని తెగ కలవరిస్తున్నారు గంటా శ్రీనివాసరావు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కంటే కూడా ఎక్కువ పవన్ ఊసే చెబుతున్నారు. ఆయన విశాఖ స్టీల్ ఉద్యమంలోకి వస్తే ఒక్కసారిగా పొలిటికల్ హీరో అయిపోతారు అని కూడా అంటున్నారు.

సడెన్ గా ఎందుకిలా…?

గంటా శ్రీనివాసరావు ఏ స్టెప్ తీసుకున్నా కూడా దాని వెనకా చాలా కారణాలు ఉంటాయి. ఆయన టీడీపీ ఓడాక సైలెంట్ గా ఉన్నది కూడా వర్తమాన రాజకీయాలను గమనించడానికే. ఏపీలో టీడీపీ ఒంటరిగా గెలవదు అని కూడా ఆయన అంచనా వేసుకున్నారు అంటున్నారు. అందుకే ఇపుడు జనసేన గురించి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు అన్నది ఒక విశ్లేషణ. పైగా గంటా శ్రీనివాసరావుకు మెగా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ప్రజారాజ్యం పార్టీకి ఉత్తరాంధ్రా జిల్లాల్లో పెద్ద దిక్కుగా నాడు గంటా శ్రీనివాసరావు ఉన్న సంగతి తెలిసిందే.

కాంబో సెట్ చేస్తారా ?

పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్ అని గంటా శ్రీనివాసరావుకు తెలుసు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన వేరేగా పోటీ చేయడంతో టీడీపీ నుంచి గంటా బరిలోకి దిగిపోయారు. ఇక 2024 నాటికి ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతాయని గంటా శ్రీనివాసరావు ఊహిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలని కూడా ఆశిస్తున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో రెండు పార్టీలు కలసి విజయం సాధిస్తాయి అని ఆయన నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ ని బీజేపీ నుంచి వేరు పడి అయినా విశాఖ స్టీల్ పోరాటానికి రమ్మని పదే పదే పిలుస్తున్నారు.

విశాఖ ఎంపీగా…?

ఇక గంటా శ్రీనివాసరావు విశాఖ ఎంపీగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారు అంటున్నారు. టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడితే మళ్ళీ ఉత్తరాంధ్రాలో టీడీపీకి మంచి రోజులు వస్తాయని కూడా గంటా శ్రీనివాసరావు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరచూ మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతున్నారని కూడా ప్రచారం అయితే సాగుతోంది. చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్ ని ఈ వైపుగా రప్పించాలి అన్నదే గంటా శ్రీనివాసరావు స్ట్రాటజీలా ఉంది. మొత్తానికి గంటా టీడీపీ గట్టు దాటకుండానే అటు వైపు నుంచి రాజకీయాన్ని నరుక్కురావాలనుకుంటున్నారు. మరి వర్కౌట్ అయితే అటు పవన్ వద్ద ఇటు బాబు వద్ద కూడా ఆయనకు మంచి మార్కులే పడతాయి. పొలిటికల్ గా కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది.

Tags:    

Similar News