అంత బ్యాలెన్స్ అయితే ఎలా శీనూ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి చిత్రంగా ఉంది. ఆయన ఉన్న పార్టీకి జగన్ అంటే జన్మ వైరం. అది ఎంత స్థాయిలో ఉంటుందో రాజకీయం తెలిసిన [more]

Update: 2020-12-02 05:00 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి చిత్రంగా ఉంది. ఆయన ఉన్న పార్టీకి జగన్ అంటే జన్మ వైరం. అది ఎంత స్థాయిలో ఉంటుందో రాజకీయం తెలిసిన వారికి ఎరుకే. మరి ఆ పార్టీలో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం పెనవేసుకున్న గంటా జగన్ గురించి పొగిడితే మండేది కచ్చితంగా చంద్రబాబుకే. ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు తాజా అసెంబ్లీ సమవేశాలకు హాజరు కాలేదు. ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా తిరుపతి దేవుడి సేవలో ఉన్నారు. ఒక వైపు అసెంబ్లీలో వైసీపీ టీడీపీ ఢీ అంటే ఢీ అని ఫైటింగ్ సీన్ క్రియేట్ చేస్తూంటే గంటా శ్రీనివాసరావు మాత్రం ప్రశాంతంగా దైవ సన్నిధిలో గడిపేశారు.

మంచి చేసే సీఎం….

జగన్ కి ప్రజలకు ఏదో మంచి చేద్దామని తపన ఉందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. జగన్ తపన అంతా అందరూ బాగుండాలని ఉంటుందని కూడా చెబుతున్నారు. నిజంగా ఇది జగన్ కి అతి అరుదైన కితాబే. మామూలుగా గంటా ఈ మాట అంటే వేరు. ఆయన ఇపుడు టీడీపీ శాసనసభ్యుడు. అంతే కాదు, ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అటువంటి ఆయన ప్రత్యర్ధి పార్టీగా ఉన్న వైసీపీని జగన్ ని పొగడడం అంటే వింతా విడ్డూరమే. అంతేకాదు, విశాఖలో భూ దందాల గుట్టుని జగన్ వెలికి తీస్తున్నారు. గంటా శ్రీనివాసరావుకు చెందిన భూముల మీద కూడా అధికారులు దాడులు చేస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అయినా సరే జగన్ మంచి చేసే సీఎం అంటున్నారు అంటే అందులో పరమార్ధాలు వెతకాల్సిందే.

అనుభవం ఉన్న నేత అట….

ఇక చంద్రబాబుని కూడా గంటా శ్రీనివాసరావు తక్కువ చేయడంలేదు. ఆయన రాజకీయంగా అనుభవం ఉన్న నేత అంటూ పొగిడారు. అసెంబ్లీలో చంద్రబాబు వంటి అనుభవం కలిగిన వారు ఉండడం మంచి పరిణామం అని కూడా అంటున్నారు. ఇంత చెప్పిన గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం తాను హాజరు కావడంలేదు. ఆయన ఎందుకో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అలాగని వైసీపీకి దగ్గరగా కూడా ఉండడంలేదు. కానీ తన పుట్టిన రోజున మాత్రం జగన్, చంద్రబాబు ఇద్దరూ కలసి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించడం విశేషం.

రిఫరీగా మారి….

ఆటల్లో తలపండిన వారు రిఫరీగా ఉంటారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకున్న వారు కూడా అధికార పక్షం ప్రతిపక్షం కలసి మెలసి పనిచేయాలని సుద్దులు చెబుతూంటారు. గంటా శ్రీనివాసరావు అయితే రాజకీయంగా రిటైర్ అవలేదు. మరి ఆయన మాత్రం ఏపీ ప్రగతి కోసం జగన్, బాబు పనిచేయాలని సూచించడం బట్టి చూస్తూంటే తాను ఏ పార్టీకి చెందని సభ్యుడిని అని చెప్పాలనుకుంటున్నారా. లేక ప్రజల తరఫున నిలిచి ఒక తటస్థుడిగా మాట్లాడాలనుకుంటున్నారా అన్నది విశ్లేషించుకోవాల్సిందే. మొత్తానికి గంటా శ్రీనివాసరావు మాత్రం ఎవరికీ చెడ్డ కాకుండా అలాగనీ ఎవరి వైపున‌కూ మొగ్గకుండా బాగానే పొలిటికల్ బాలన్స్ పాటిస్తున్నారు అనుకోవాలి.

Tags:    

Similar News