కులం.. మతం…ముసుగు అన్ని చోట్ల ఫ్లాయిడ్ లే?

రాంబాబు యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసుకోగానే ఉద్యోగం వెదుక్కుంటూ ఢిల్లీ బయల్దేరాడు. క్లాస్ రూమ్ లో విన్న పాఠాలు, సీనియర్ల అనుభవాలు వినివిని తాను కూడా వాళ్ళలాగే [more]

Update: 2020-06-10 16:30 GMT

రాంబాబు యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసుకోగానే ఉద్యోగం వెదుక్కుంటూ ఢిల్లీ బయల్దేరాడు. క్లాస్ రూమ్ లో విన్న పాఠాలు, సీనియర్ల అనుభవాలు వినివిని తాను కూడా వాళ్ళలాగే పెద్ద జర్నలిస్ట్ అయిపోవాలని కలలు కనేవాడు. చూస్తుండగానే పరీక్షలు అయిపోయాయి. పట్టా చేతికి వచ్చింది. ఉద్యోగం ఎలాగో అర్థం కాలేదు. అప్పటి దాకా క్లాస్ రూములో కథలకు, బయట పరిస్థితికి ఉన్న తేడా అర్థం అయ్యింది. ఎవరిని కలవలో తెలీక కింద మీద పడినా, ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని, మిత్రుల సాయంతో ఏదొక ఉద్యోగం చూసుకోవాల్సిందే అనుకుని ఢిల్లీ బండి ఎక్కేశాడు. వారం పది రోజులు మిత్రులను కలిసి ఉద్యోగ యత్నాలు చేసినా ఫలించలేదు.

మిత్రుల ద్వారా పరిచయమై….

చివరకు మిత్రుల ద్వారా పరిచయమైన ఒకాయనకి తన పరిస్థితి చెప్పుకున్నాడు. కుర్రాడి చదివిన చదువు, అతని పరిస్థితి చూసి జాలి పడిన ఆయన ఫలానా చోట సుబ్బయ్య అనే ఆయన్ని కలవమని సలహా ఇచ్చాడు. .సుబ్బయ్య పనిచేసే చోట మీడియా వాళ్లు చాలామంది ఉంటారనే ఆలోచనతో ఆ సలహా ఇచ్చాడు. సుబ్బయ్య మాటతో కిందా మీద పడుతూ ఆ అడ్రస్ పట్టుకుని వెళ్లిన రాంబాబ., సుబ్బయ్యని కలిసి నమస్కారం పెట్టాడు. పాల బుగ్గలు, నూనూగు మీసాలతో ఉన్న కుర్రాడి గురించి అప్పటికే ఓ ఫోన్ రావడంతో సుబ్బయ్య కూడా సానుకూలంగానే స్పందించాడు. ఊరు కానీ ఊళ్ళో లేత కుర్రాడు ఎలా బతుకుతాడని జాలి పడ్డాడు. “నిజానికి రాంబాబు ఎంత అమాయకుడు అంటే., గడ్డ కట్టిన పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్ నుంచి తీసి పాలు వేడి చేయమంటే….. పొయ్యి మీద ప్యాకెట్ నేరుగా పెట్టి వేడి చేసేంత తెలివి”….లోకజ్ఞానం బొత్తిగా లేకుండానే ఉద్యోగం కోసం ఢిల్లీ వరకు వచ్చేశాడంటే అతని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. తన కాళ్ళ మీద తను నిలబడాలని ధైర్యంగా ఢిల్లీ వచ్చేశాడు. ఇక సుబ్బయ్య కుర్రాడిని ఏమి చదువుకున్నావోయ్ అని అడిగితే.., యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అన్నడు. హిందీ వచ్చా అంటే రాంబాబు బిక్క ముఖం వేశాడు. ఇంగ్లీష్ అంటే మరు మాట్లాడలేదు.

మనవాడేననుకుని….

“సరే ఏమి పని చేస్తావంటే.., చదివిన చదువుకు తగ్గ ఏదైనా ఉద్యోగం అని నసిగాడు…. సరేనంటూ తలూపి తనకు తెలిసిన పెద్ద మనిషికి ఫోన్ చేశాడు సుబ్బయ్య….. ఆ మాట , ఈ మాట చెప్పి….. తానెందుకు ఫోన్ చేశాడో చెప్పాడు. అవతలి వ్యక్తికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి సిఫార్సు చేశాడని నొక్కి చెప్పి, రాంబాబుకి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. కుర్రాడు మన వాడే… ఒట్టి అమాయకుడిలా ఉన్నాడని ఏదొక మార్గం చూసి పెట్టాలని కోరాడు. అవతల నుంచి సరేనంటూ సమాధానం రావడంతో రాంబాబుని వెళ్లి ఆయన్ని కలవమని సూచించాడు.

టార్చర్ పెట్టి మరీ….

సుబ్బయ్య మాట మహిమో.., రాంబాబు వెళ్లిన వేళా విశేషమో కానీ, కుశల ప్రశ్నల తర్వాత రాంబాబుకి ఉద్యోగం ఖాయం అయ్యింది. తమ దగ్గరే జూనియర్ గా రాంబాబు ఢిల్లీలో బతకడానికి సరిపడా జీతం, వసతితో ఉద్యోగం దొరికాయి.వారం పది రోజుల తర్వాత పెద్దాయన మెల్లగా రాంబాబుతో ముచ్చట్లు చెబుతూ మెల్లగా కూపీ లాగడం మొదలు పెట్టాడు…. “ఎమోయ్ రోజూ సంధ్యా వందనం చేస్తావా…..” అని అడిగేసరికి, రాంబాబు వాళ్ళెవరు సర్ అని అమాయకంగా అడిగాడు. ఈసారి బిత్తరపోవడం పెద్దాయన వంతైంది. అదేమిటి సుబ్బయ్య తాలూకా కదా నువ్వు అంటే….! వెంకయ్య చెబితే సుబ్బయ్యని కలిశాను, సుబ్బయ్య మీ దగ్గరకి పంపారని బదులిచ్చాడు. ఎక్కడో తేడా జరిగిందని గ్రహించిన పెద్దాయన మరు మాట్లాడలేదు. రాంబాబుకి ఉద్యోగం మొదట్లో బాగానే ఉన్నా క్రమంగా టార్చర్ గా మారింది. గాడిద చాకిరి చేసినా ఎవరు మెచ్చే వాళ్ళు కాదు. ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనుకున్నా, కష్టమో, నష్టమో భరించడం అలవాటు చేసుకున్నాడు.ఆ తర్వాత రాంబాబు మంచిగా ఎదగడం పూర్తిగా అతని కష్టమే. తెలుగుటీవీలు, పత్రికలలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంలో వివక్ష, జాత్యహంకారం వంటి పదాలు, ఇంకా పెద్ద పెద్ద ఆదర్శాలు కనిపిస్తూ, వినిపిస్తుంటే పదేళ్ల కిందట పరిచయమైన రాంబాబు గుర్తొచ్చాడు. ఇంకా చాలా ఆలోచనలు వచ్చాయి కానీ ఇక్కడితో ఈ కథకి బ్రేక్…రాంబాబు ఎవరని మాత్రం అడగొద్దు., తెలిసిన వాళ్ళు చెప్పొద్దు. నిజానికి రాంబాబు వివక్ష ఎదుర్కొనే కులం కాకున్నా, ఊరు కానీ ఊళ్ళో అతని పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీలో అంతే, కౌగిలించుకుని, భుజం తడితే దాని అర్థం వేరని రాంబాబుకి మెల్లగా అర్థమైంది.

Tags:    

Similar News