కమ్మలకు అసలైన అన్యాయం… ?

కులాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చాక ఆ సామాజికవర్గాలు ఎంతవరకూ బాగుపడ్డాయో తెలియదు కానీ వాటిని ఆసరాగా చేసుకుని రాజకీయ పార్టీలు మాత్రం సులువుగా అందలాలను ఎక్కేస్తూ వస్తున్నాయి. బలంగా [more]

Update: 2021-08-03 06:30 GMT

కులాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చాక ఆ సామాజికవర్గాలు ఎంతవరకూ బాగుపడ్డాయో తెలియదు కానీ వాటిని ఆసరాగా చేసుకుని రాజకీయ పార్టీలు మాత్రం సులువుగా అందలాలను ఎక్కేస్తూ వస్తున్నాయి. బలంగా ఉన్న కులాలను రెచ్చగొట్టడం ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే ప్రతీ కులంలోనూ పేదలు ఉన్నారు. అంతే కాదు వారిని ఏ ప్రభుత్వాలు కూడా అసలు ఆదుకోవడంలేదు. దేశానికి స్వాతంత్రం లభించి ఏడున్నర దశాబ్దాలు దాటుతున్నా కూడా దళితులు బాగుపడ్డారా అంటే జవాబు ఉండదు. మరి మిగిలిన కులాల సంగతి కూడా అంతే.

కమ్మలే టార్గెట్…

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, రాజకీయంగా తలపండిన నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎనభయ్యేళ్ళకు చేరువ అవుతున్న ఆయన గెలుస్తున్నది కాపులు బలంగా ఉన్న చోట. మరి అన్ని కులాలు ఓటేస్తే గెలిచిన ఆయన ఈ మాటలు అనవచ్చా. అంటే రాజకీయమే ఆయన నోట ఈ మాట అనిపిస్తోంది. కమ్మలను వైసీపీ సర్కర్ లక్ష్యంగా చేసుకుని సర్వనాశనం చేస్తోంది అని గోరంట్ల ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే కమ్మ నాయకులనే జగన్ అరెస్ట్ చేయిస్తున్నారు, వేధిస్తున్నారు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ వ్యవహారంలో బరస్ట్ అయ్యారు. దానికి ముందు ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరి ఉదంతాన్ని కూడా ఆయన ఉటంకిస్తున్నారు.

ఆ ముద్ర వేసేసి …

నిజానికి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ నాయకులు చాలా మంది అరెస్ట్ అయ్యారు. అపుడు బీసీలే టార్గెట్ అన్నారు. ఇపుడు టీడీపీ కమ్మలను సొంతం చేసుకునే ప్రయత్నంలోనే గోరంట్ల అలాంటి మాటలు వాడారని అనుకోవాలేమో. మరో వైపు చూసుకుంటే కమ్మల మీద టీడీపీ ముద్ర ఉంది. ఇది చాలాకాలంగా వేశారు. కమ్మలలో ఎక్కువ శాతం మంది టీడీపీని సమర్ధించి ఉండవచ్చు. కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదు. వారి వైఖరిలో కూడా మార్పు వచ్చింది. దానికి సంకేతమే 2019 ఎన్నికలలో కమ్మల ఆధిపత్యం ఉన్న చోట మెజారిటీ సీట్లు వైసీపీ పరం అయ్యాయి. ఇక ఈ ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కమ్మల ఓట్లు పడకపోతే వైసీపీ ఏకపక్ష విజయం సాధ్యమయ్యేనా అన్న మాట కూడా ఉంది.

నష్టం వారికే …?

ఏ కులమైనా కూడా ఒకే పార్టీకి కట్టుబడి ఉండదు. అలా ఎక్కడా జరగదు కూడా. టీడీపీని సమర్ధించి ఇప్పటికే నష్టపోయామని కమ్మలు బాధపడుతున్నారు కూడా. రాజకీయల్లో ఓడలు బళ్ళు అవుతాయి. అది రాజకీయ పార్టీల ఫేట్ అనుకుంటే మధ్యలో కులాలను తెచ్చి వారి కొంప ముంచడమేంటన్న బాధ కూడా కమ్మలలో ఉంది. కమ్మలు అన్ని సామాజికవర్గాలతో సఖ్యతను కోరుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో ప్రభుత్వం వారికి అనుకూలంగా పనిచేసిందన్న బురద జల్లేశారు. దాని వల్లనే వారు ఇంకా కోలుకోలేకుండా ఉన్నారు. ఇపుడు కమ్మలను వెనకేసుకురావడం ద్వారా టీడీపీ తన రాజకీయాన్ని చూసుకుంటోంది అన్న మాట అయితే ఉంది. కమ్మలు టీడీపీలోనే ఉండాలా, ఇతర పార్టీలలో ఉంటే వారు కమ్మలు కారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ లాజిక్ గా మాట్లాడారు. మొత్తానికి టీడీపీ తనకు మద్దతు తగ్గుతోందనే కమ్మలను ఎగదోస్తోంది అన్న విమర్శలు అయితే ఉన్నాయి

Tags:    

Similar News