గోరంట్ల మాధవ్ ఇలా ఎందుకు చేస్తున్నారో?

సార్వత్రిక ఎన్నిక‌లు ముగిసి ఏడాది అయింది. రాష్ట్రంలో వైసీపీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 22 మంది ఎంపీ సీట్లను కైవ‌సం చేసుకుంది. వీరిలో కొత్తవారు చాలా మంది [more]

Update: 2020-05-17 02:00 GMT

సార్వత్రిక ఎన్నిక‌లు ముగిసి ఏడాది అయింది. రాష్ట్రంలో వైసీపీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 22 మంది ఎంపీ సీట్లను కైవ‌సం చేసుకుంది. వీరిలో కొత్తవారు చాలా మంది ఉన్నారు. కేవ‌లం ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయాల‌తో సంబంధం లేని వారు అనూహ్యంగా రాజ‌కీయ అరంగేట్రం చేసి టికెట్ సాధించి విజ‌యం ద క్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన వ్యక్తి అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన గోరంట్ల మాధ‌వ్‌. అప్పటి వ‌ర‌కు పోలీసు శాఖ‌లో సీఐగా ప‌నిచేసిన ఆయ‌న టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డితో ఏర్పడిన వైరంతో రాజ‌కీయంగా ముందుకు వ‌చ్చారు. క‌దిరి సీఐగా ప‌నిచేసిన గోరంట్ల జేసీతో మీసం మెలేసి ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

టీడీపీకి మేలు చేకూర్చేలా?

ఎన్నిక‌ల‌కు ముందు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గోరంట్ల మాధ‌వ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. టీడీపీ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్ట‌ప్పపై పోటీ చేసిన మాధ‌వ్‌.. వైసీపీ త‌ర‌ఫున ఘ‌న విజ‌యం సాధించారు. కురుబ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న ఏకంగా ల‌క్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో నిమ్మల కిష్టప్పను ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయ‌న అనుస‌రిస్తున్న విధానం ఏంటి? నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప‌రిస్థితి ఏంటి? అనేవి ప‌రిశీలిస్తే.. వైసీపీ కంటే కూడా టీడీపీకి మేలు చేసేలా గోరంట్ల మాధ‌వ్ వ్యవ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు వైసీపీ నుంచి వ‌స్తుండ‌గా.. ఇలానే ఉంటే బాగుండ‌ని టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. స్వత‌హాగా.. దాదాపు ప‌దిహేను సంవ‌త్సరాల పాటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేసిన నేప‌థ్యంలో గోరంట్ల మాధ‌వ్ స్థానికంగా ప్రజ‌ల‌తో మ‌మేకం కాలేక పోతున్నార‌న్న చ‌ర్చలు ఉన్నాయి.

పోలీసు తరహాలోనే….

పోలీసుగా ఉన్న ప్పుడు ఉన్న త‌న దూకుడునే ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా కూడా చూపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని అంటున్నారు. ఎంపీ అయ్యాక ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో ఆయ‌న దూకుడు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌ను పొగిడేందుకు మాత్రమే గోరంట్ల మాధ‌వ్ ప్రాధాన్యం ఇస్తున్నారు త‌ప్ప.. స్థానికంగా మాత్రం స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టడం లేద‌ని అంటున్నారు. నిజానికి హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం. అయితే, ఇక్క ‌డ వైసీపీ తొలిసారి గెలుపు గుర్రం ఎక్కింది. దీనిని ప‌దిలం చేసుకోవాలంటే.. ఎంపీగా గోరంట్ల మాధ‌వ్ పై చాలా బాధ్యత ఉంద‌నేది వాస్తవం.

ఎమ్మెల్యేలతో పడకుండా….

కానీ గోరంట్ల మాధ‌వ్ ఈ విష‌యాన్ని విస్మరించి.. త‌న శైలినే అనుస‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇటు త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు సైతం ఆయ‌న్ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ట‌. ఇది టీడీపీకి వ‌రంగా క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు మాజీ ఎంపీ నిమ్మల కిష్ట‌ప్ప వ‌ర్గం.. ప్రజ‌ల్లో సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్న స‌మ‌యంలో గోరంట్ల మాధ‌వ్ అదే ప్రజ‌ల‌కు దూరంగా ఉండ‌డం వీరికి క‌లిసి వ‌స్తోంది. ఇప్పటికే ఏడాది పూర్తయిన నేప‌థ్యంలో వ‌చ్చే నాలుగేళ్లలో అయినా మాధ‌వ్ స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్యవ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

Tags:    

Similar News