ఆర్థికంగా బ్యాలెన్స్ చేస్తారా? చేయరా?

ప్రభుత్వ పరిపాలన లో ప్రధాన భాగం పన్నుల రూపంలో లభించే నిధులను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సక్రమంగా వినియోగించి ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడం. ఇదే వార్షిక బడ్జెట్ [more]

Update: 2020-06-18 15:30 GMT

ప్రభుత్వ పరిపాలన లో ప్రధాన భాగం పన్నుల రూపంలో లభించే నిధులను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సక్రమంగా వినియోగించి ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడం. ఇదే వార్షిక బడ్జెట్ లో ముఖ్యాంశం. రాను రాను బడ్జెట్ అంటే ఒక ఆనవాయితీగా , అంకెల గారడీగా ముద్ర పడిపోయింది. దీని ద్వారా అద్భుతాలు సాధిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కొత్తసీసాలో పాత సారా అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఖర్చలు చేయకుండా కొంత జవాబుదారీతనంతో వ్యవహరించేలా పక్కాలెక్కలు వేయడానికి ఎంతో కొంత సహకరించే ఏర్పాటు. కానీ రాజకీయాలే ముప్పేట ప్రభుత్వాల పనితీరును నిర్దేశిస్తున్న సమయంలో ఏటా సమర్పించే బడ్జెట్ మొక్కుబడిగా మారిపోతున్న మాట వాస్తవం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ అవే సాధారణీకరణలు, పదజాలాలు, హితోక్తులు, సూక్తులు కనిపించాయి. కరోనా వైరస్ కాలానికే కఠిన పరీక్ష పెడుతోంది. ఆర్థిక రంగం అస్తవ్యస్తమైపోయింది. ఆ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ఏపీ బడ్జెట్ కనిపించదు. వాస్తవాలనూ ప్రతిబింబించలేదు. ఎక్కడా కష్టాలకు ఎదురీదాలన్న స్పృహ ప్రజలకు, యంత్రాంగానికి కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా సాఫీగా నడిచిపోతోందన్న ఆశల మేడలు కట్టేశారు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతోందనుకోవడంలో తప్పు లేదు. నేల విడిచి సాము చేస్తేనే ఇబ్బంది.

సంక్షేమమే సాధికారత….

ప్రజలు సాధికారికంగా తయారు కావాలంటే ఏం చేయాలనేది ఎప్పటికీ చర్చనీయమే. అత్యంత పేదరికం, ఉపాధి చూపించలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వీటి ద్వారా ఆసరా పొందుతూ తమ జీవన స్థితిగతులను ప్రజానీకం మెరుగుపరచుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇది వరకూ చౌకధరల్లో ఆహారపదార్థాల పంపిణీ, విపత్తుల్లో కొన్నిసార్లు ఉచితంగా ఇచ్చే సంప్రదాయం ఉండేది. అందులో అవినీతి పాళ్లు ఎక్కువ కావడం, ప్రజలు సైతం సంతృప్తి చెందకపోవడంతో నగదు బదిలీని మొదలు పెట్టాయి ప్రభుత్వాలు. అధికారంలో ఉన్న పార్టీకి దీనివల్ల రాజకీయ ప్రయోజనాలు సైతం లభించే వెసులుబాటు కలిగింది. ప్రత్యక్షంగా డబ్బులు లబ్ధిదారుకే చేరడంతో చాలావరకూ అవినీతిని కట్టడి చేయగలిగారు. రాష్ట్రప్రభుత్వాలు చాలా వరకూ సంక్షేమ పథకాలనే ప్రధాన రాజకీయ అస్త్రాలుగా వినియోగించుకుంటున్నాయి. బడ్జెట్ లో ఖర్చు పెట్టే నిధుల్లో సగానికి పైగా సంక్షేమ పథకాలపైనే వెచ్చిస్తున్నాయి. అర్హులకు పథకాలను ఇవ్వడం ద్వారా చేయూతనివ్వడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఉచితాలను అనుచితంగా ఇచ్చేందుకూ వెనకాడని రాజకీయం ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రెండు లక్షల ఇరవై నాలుగువేల కోట్ల రూపాయల బడ్జెట్ లో వాస్తవానికి అమలు చేసే మొత్తం లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చని అంచనా. ఇందులో మూడోవంతు సంక్షేమ పథకాలకే వెచ్చించక తప్పడం లేదు.

వైఎస్సార్ పేరు చెబితే…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెబితే సంక్షేమ పథకాలైన ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ గుర్తు కొస్తాయి. విద్య,వైద్యం భవిష్యత్తుకు పెట్టుబడిగా వై.ఎస్. భావించేవారు. దాంతో పాటు వ్యవసాయరంగానికి జలవనరులు అందించే సాగునీటి ప్రాజెక్టులను సైతం పెట్టుబడిగానే చూసేవారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అనేక నీటి ప్రాజెక్టులు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ ఒరవడిని కొనసాగించకతప్పలేదు. అయితే సంక్షేమ పథకాల పద్దు పెరిగిపోవడంతో ఏపీలో నీటి ప్రాజెక్టులకు సైతం నిధుల సర్దుబాటు కష్టమవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 32 వేల కోట్ల రూపాయల వరకూ అభివృద్ధి పనులపై వెచ్చించాలనుకున్నారు. మూడోవంతుకే పరిమితమయ్యారు. ప్రత్యేకించి ఇరిగేషన్ పై అయిదు వేల కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయలేకపోయారు. మరోవైపు సంక్షేమ పథకాల పద్దు చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. రాష్ట్రంలో అయిదు కోట్ల జనాభా ఉంటే మూడుకోట్ల తొంభై లక్షలమందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సగటు జీవనప్రమాణాల రీత్యా మెరుగైన స్థితిలోనే ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నరాష్ట్రం కాదు. అర్హులకు మాత్రమే సంక్షేమం అందేలా చూసుకుంటూ మిగిలిన నిధులను జలయజ్ణం వంటి నీటి ప్రాజెక్టులకు, మౌలిక వసతులకు వెచ్చిస్తే ఉత్పత్తి, ఉపాధి మెరుగుపడతాయి.

భవితకు భరోసా..?

మౌలిక వసతుల కల్పనతోనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. స్వావలంబన సాధ్యమవుతుంది. దీనికి బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం పెరగాలి. పదేళ్ల క్రితం వరకూ చూస్తే మూడింట రెండువంతులు ప్రణాళికేతర వ్యయం, ఒక వంతు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రణాళిక వ్యయం ఉండేది. సంక్షేమం, ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు ప్రణాళికేతర వ్యయంలో చూపించేవారు. ప్రాజెక్టులు, మౌలిక వసతులు ప్రణాళిక వ్యయంలో భాగంగా ఉండేవి. కానీ తాజాగా బడ్జెట్లను చూస్తుంటే ప్రణాళిక వ్యయాలను అంటే పెట్టుబడి పెట్టాల్సిన అభివ్రుద్ధి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరిస్తున్నట్లే కనిపిస్తోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ 2019-20లో లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ లో ఖర్చు చేసింది. అందులో కేవలం 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి వ్యయం. అంటే పదిహేనోవంతు మాత్రమే భవిష్యత్తుపై వెచ్చిస్తున్నట్లుగా, ప్రజా సౌకర్యాలపై ఖర్చు చేసినట్లుగా భావించాలి. గతంలో చేసినట్లుగా మూడు రూపాయల ఆదాయంలో రెండు రూపాయలు సాధారణ ఖర్చులు, సంక్షేమం, జీతాలకు వెచ్చించి ఒక రూపాయి భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడిగా మౌలిక వసతులకు వెచ్చించే సంప్రదాయానికి తిలోదకాలిచ్చేశారు. ఈ సంతులనం దెబ్బతింది. దీనివల్ల భవిష్యత్తులో ఆదాయవనరులు కూడా పడిపోయే అవకాశం ఉంది. అప్పులతోనే కాలం వెళ్లదీయం ఎల్ల కాలం సాధ్యం కాదు. మనవద్ద చెల్లించే సామర్థ్యం లేదనుకున్నప్పుడు అప్పు కూడా పుట్టదు. అందువల్ల ప్రభుత్వాలు ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. అంకెల రాజకీయాన్ని సైతం ఆర్థికంగా బ్యాలెన్స్ చేసుకోవాలి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News