వైఎస్సార్, వాజ్ పేయ్ మధ్యన పోటీ…?

ఎక్కడి వైఎస్సార్, మరెక్కడ వాజ్ పేయ్. ఇద్దరి రాజకీయాలు వేరు. ఇద్దరి వ్యక్తిత్వాలూ కూడా భిన్నం. ఇక ఒకరు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికే పరిమితం. మరొకరు ఏకంగా కోటానుకోట్ల [more]

Update: 2020-11-27 03:30 GMT

ఎక్కడి వైఎస్సార్, మరెక్కడ వాజ్ పేయ్. ఇద్దరి రాజకీయాలు వేరు. ఇద్దరి వ్యక్తిత్వాలూ కూడా భిన్నం. ఇక ఒకరు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికే పరిమితం. మరొకరు ఏకంగా కోటానుకోట్ల భారతీయుల మనసులను చూరగొన్న కవి, మేధావి, ప్రధాని. ఇక వైఎస్సార్ ముఖ్యమంత్రిగా అయ్యేనాటికే వాజ్ పేయ్ రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చేశారు. మరి ఈ ఇద్దరినీ ఎందుకు కలుపుతున్నారు. ఏమా అవసరం అంటే. అదే కదా రాజకీయం అని మాత్రమే జవాబు వస్తుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి గురువు, దైవం సర్వం వైఎస్సార్. ఇందులో ఎవరికీ ఏ డౌటూ లేదు. అదే సమయంలో వ్యక్తిపూజలకు వ్యతిరేకం అని అంటున్న బీజేపీలో ఇపుడు ఆ కొరతా తీరిపోయింది. మోడీని గత ఏడేళ్ళుగా భుజాల మీద మోస్తున్న కమలానికి దైవ సమానుడు వాజ్ పేయ్. అందువల్లనే ఇపుడు ఏ మొహమాటాలూ లేకుండా ఆయన్ని ముందుకు తెస్తున్నారు.

విగ్రహాల గొడవ….

మహానుభావులు పుడతారు, తాము చేయాల్సింది చేస్తారు. కాలధర్మం చెందుతారు. కానీ వారు తమ తరువాత వీధికో విగ్రహం పెట్టారా లేదా, తమ పేరు తలచుకుంటున్నారా. తమకు భారత రత్న వంటి బిరుదులు వచ్చాయా అని చూడరు, బతికినపుడు కూడా వారికి ఆ ఆలోచనలు ఉంటే వారు మహనీయులే కారు. ఇక వైఎస్సార్ పాదయాత్ర తరువాత మహానుభావుడే అయ్యారు. పేదలకు ఆయన దేవుడిగా మారారు. అందుకే ఆయన మరణిస్తే లక్షాది గుండెలు కదిలాయి. వందలాది మంది చనిపోయారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు కానీ అక్కడ విగ్రహాల గొడవ మొదలైంది. వైఎస్సార్ కల పోలవరం కాబట్టి ఆయన విగ్రహం పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోందిట. అందుకోసం 125 అడుగుల ఎత్తున వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారుట. దాంతో బీజేపీ కూడా ఇపుడు రంగంలోకి దిగుతోంది.

రేసులో వాజ్ పేయ్…..

పోలవరం వద్ద వాజ్ పేయ్ విగ్రహం మాత్రమే పెట్టాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని కేంద్రం నిర్మిస్తోందని, కాబట్టి బీజేపీ మూల పురుషుడు, కేంద్ర ప్రభుత్వానికి మారదర్శకుడు అయిన వాజ్ పేయ్ విగ్రహం పెట్టడమే సముచితమని సోము వాదిస్తున్నారు. అది సరే కానీ పోలవరానికి వాజ్ పేయ్ కి సంబంధం ఏంటో బీజేపీ చెప్పడంలేదు. వైఎస్సార్ అంటే తాను సీఎం అయ్యేటప్పటికి ఆరు దశాబ్దాలుగా పోలవరం ఊసు లేదు పైగా తాను చొరవ తీసుకుని ప్రాజెక్ట్ పనులను మొదలెట్టారు. అందువల్ల ఆయన విగ్రహం ఉండాలనుకోవడం ఒక విధంగా సబబేమో అన్న మాట ఉంది.

ఫక్త్ రాజకీయమే …?

ఇక పోతే వైఎస్సార్ అయినా వాజ్ పేయ్ అయినా ఇపుడు ఇహలోకంలో లేరు. వారు మాట్లాడరు, కానీ విగ్రహాలుగా మారితే నలుగురి కంట్లో పెడతారు, నాలుగు ఓట్లు తెచ్చిపెడతారు. అందుకే ఫక్త్ రాజకీయంగానే ఈ విగ్రహాల వివాదాన్ని ముందుకు తెచ్చారని అంటున్నారు. నిజానికి పోలవరానికి ఎటువంటి కోతా లేకుండా పూర్తి నిధులు ఇచ్చి బీజేపీ ఏకంగా మోడీ విగ్రహాన్నే అక్కడ పెట్టినా ప్రజలు తప్పుపట్టుకోరు. కానీ ఓ వైపు నిధులు ఇవ్వమని మోకాలడ్డుతూ రాజకీయ వాటా కోసం చిల్లర డిమాండ్లు చేస్తే ఏపీలో కమలం వికసిస్తుందా అన్నదే మధావుల మాట. ఏది ఏమైనా పోలవరం పూర్తి అయితే చాలు అన్నదే జనం మాట. అంతే తప్ప విగ్రహాల మీద ఆగ్రహాలు సంగ్రామాలు ఎవరికీ పట్టని గొడవే మరి.

Tags:    

Similar News