అలా అనుకుంటే కుదరదు మరి…?

ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, మీడియా, నాలుగు స్థంభాలూ ముఖ్యమే. భారత రాజ్యంగంలో నాలుగో స్థంభం అయిన మీడియాకు పెద్దగా ప్రస్తావన లేకపోయినా ఆచరణలో మీడియాను ప్రభుత్వం [more]

Update: 2020-09-07 11:00 GMT

ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, మీడియా, నాలుగు స్థంభాలూ ముఖ్యమే. భారత రాజ్యంగంలో నాలుగో స్థంభం అయిన మీడియాకు పెద్దగా ప్రస్తావన లేకపోయినా ఆచరణలో మీడియాను ప్రభుత్వం విస్మరించజాలదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి మీడియా ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంది. అందుకేనేమో మీడియా అధికారంలో ఉన్నవారికి నచ్చదు. చాలామంది పాలకులు మీడియాకు దూరంగా ఉండడమో లేక మీడియాను దూరంగా ఉంచడమో చేస్తూ ఉంటారు. అందుకే ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. అయితే పాలకులకు నచ్చినా, నచ్చకపోయినా మీడియాను విస్మరించలేరు.

80వ దశకం నుంచి…..

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా బలమైన పాత్ర పోషిస్తోంది. ప్రతిపక్ష పాత్ర నుండి 1980 దశకంలో ఒక రాజకీయ పక్షం వహించే స్థాయికి దిగజారిపోయింది. ఆ తర్వాత అది 1990 దశకంలో మరింత దిగజారి ఒక పార్టీకి మూలస్తంభంలా, మరోపార్టీకి చెప్పులోన రాయిగా మారిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర పోషించాలిసిన మీడియా ఒక పార్టీకి అనుకూలంగా, మరోపార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. 1980లో మొదలైన ఈ పతనం 2000 దశకంలో మీడియా రాజకీయ వివక్షను ఎదుర్కొనేందుకు ఒక ముఖ్యమంత్రి తన కుటుంబ యాజమాన్యంలో ఏకంగా ఒక మీడియా సంస్థనే స్థాపించాల్సి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి అనారోగ్యకర పరిస్థితే అయినప్పటికీ కరోనాతో సహజీవనం అలవాటు చేసుకుంటున్నట్టే పాలకులు మీడియాతో సహజీవనం అలవాటు చేసుకోవాలి.

ఈ ప్రభుత్వం అనవసరం……

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని మీడియా సంస్థలకు ఈ ప్రభుత్వం అనవసరం. ఈ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కూలిపోతే బాగుంటుందని ఉంది. అలాగే ఈ ప్రభుత్వానికి అసలు మొత్తం మీడియానే అవసరం లేదనే పరిస్థితి కనిపిస్తోంది. మీడియా మద్దతు లేకుండానే గెలిచాం కాబట్టి మీడియాతో పనేంటి అనే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది. అందుకేనేమో గత 13 నెలలుగా ఈ ప్రభుత్వం మీడియాకు దూరంగా ఉంటోంది. అంతమాత్రాన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మీడియా తన ప్రయత్నాలు ఆపలేదు. అవి ఆగవుకూడా. కానీ రాజకీయ ఎజెండాతో ఉన్న కొన్ని మీడియా సంస్థలకోసం మొత్తం మీడియాను దూరంగా పెట్టడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది.

జర్నలిస్టులు ఇంకా ఆ స్థాయిలో…..

అయితే మీడియా సంస్థలు ఎంత పతనం అయినా ఇంకా జర్నలిస్టులు ఆస్థాయిలో పతనం కాలేదు. ఇంకా ప్రజాస్వామ్యం పట్ల, జర్నలిజం పట్ల నిబద్దత కలిగిన వారు ఉన్నారు. అలాగే నిష్పక్షపాతంగా ఉండే మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. ఏవో కొన్ని మీడియా సంస్థలకు వ్యాపార ప్రకటనలు ఇచ్చేస్తే అలా పడుంటాయి అనే ఆలోచన కూడా సరికాదు. ఎంత వ్యాపార లక్ష్యంతో ఉన్నా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి బాధ్యతలు నిర్వర్తించే మీడియా సంస్థలు, జర్నలిస్టులు ఉన్నారనే స్పృహ ఈ ప్రభుత్వం కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఇలా స్పృహ కోల్పోవడం ఆరోగ్యకరం కాదు. లెజిస్లేచర్ లో మాకు బలం ఉంది. ఎగ్జిక్యూటివ్ తో మా బంధం బాగుంది. పైగా ప్రతిపక్షం బలహీనంగా ఉంది. ఇక జ్యుడీషియరీ, మీడియాతో మాకేంటి అనుకుంటే కుదరదు.

 

గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News