బజారున పడుతున్న అధికారులు ?

ప్రభుత్వ అధికారులు అంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది. వారి జీవితాలకు భద్రత ఉన్నా ఎంత ఆర్ధికపరమైన భరోసా ఉన్నా కూడా వారు ప్రతీ విషయంలోనూ ఆచీ తూచీ [more]

Update: 2021-08-08 13:30 GMT

ప్రభుత్వ అధికారులు అంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది. వారి జీవితాలకు భద్రత ఉన్నా ఎంత ఆర్ధికపరమైన భరోసా ఉన్నా కూడా వారు ప్రతీ విషయంలోనూ ఆచీ తూచీ వ్యవహరిస్తారు అన్నది నిజం. ఏది చేయాలన్నా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారమే అంతా నడచుకుంటారు. ఒక అధికారికీ మరొకరికి మధ్య విభేధాలు ఉండడం సహజం. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండాలని ఏమీ లేదు కాబట్టి. అలాంటి సందర్భాల్లో తనకు ఫలానా అధికారి నుంచి ఇబ్బందులు ఉన్నాయని ఆ పై అధికారికి ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే సరైన విధానం. కానీ అలా కాకుండా తామే యాక్షన్ లోకి దిగిపోతే ఏం జరుగుతుంది. అంటే అల్లరే అవుతుంది అన్నది జవాబు.

ఎందుకిలా చేస్తున్నారు.. ?

రాష్ట్రంలో గత కొన్నాళ్ళుగా చూసుకుంటే కొందరు ప్రభుత్వ అధికారులు కట్టుతప్పినట్లుగానే కనిపిస్తోంది. విశాఖ వంటి చోట్ల అధికారులు అయితే ఏకంగా రోడ్డు మీదకే వస్తున్నారు. ఈ మధ్య వరసగా జరిగిన రెండు సంఘటనలు అదే నిజం అని చెబుతున్నాయి. విశాఖలోని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న పుష్ప వర్ధన్ అనే అధికారి మీద ఏకంగా ఇసుక పోసి దాడి చేశారు అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఆమె ఏకంగా ఆయన చాంబర్ లోకి దూసుకుని వచ్చి ఇలా చేశారని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరికీ అసలు పడదని, నెల రోజులుగా ఆ విభేదాలు మరింత ముదిరి చివరికి ఆమె ఇలా చేశారని అంటున్నారు.

అవమానించారుగా..?

ఇక విశాఖలో మైంగింగ్ మాఫియాకు అరవీర భయంకరుడుగా మారిన మైనింగ్ విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి మీద ఈ మధ్య కింద స్థాయి అధికారి ఒకరు దాడి చేశారు. ఆయన ఒక ఫైల్ అడిగినందుకు ఏకంగా తన చేతిలో ఉన్న టీని ఉన్నతాధికారి మీద విసిరేసి రచ్చ చేశారు. దీని మీద ఫిర్యాదు అందుకున్న మైనింగ్ శాఖ ఆయన్ని సస్పెండ్ చేసి విచారణ జరుపుతోంది. ప్రతాప్ రెడ్డి నిజాయతీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయనను ఇలా దిగువ స్థాయి అధికారి అవమానించడం చర్చనీయాంశమే అయింది. దీంతో ప్రభుత్వ అధికార వర్గాలలో అలజడి కూడా రేగింది.

లూజ్ అయ్యారా …?

గత చంద్రబాబు టైమ్ లో అధికారులకు ప్రభుత్వం అంటే టెర్రర్ గా ఉండేది అన్న మాట ఉంది. చంద్రబాబు కూడా అధికారుల క్రమశిక్షణ విషయంలో అసలు ఉపేక్షించేవారు కాదని చెబుతారు. ఆయన స్ట్రిక్ట్ అని కూడా చాలా మంది అధికారులు మండిపోయేవారు. ఇక అంతకు ముందు కాంగ్రెస్ హయాం అంటే అధికారులకు ఆటవిడుపుగా ఉండేది అని కూడా అంటారు. అయితే నాడు ఇలా సాటి అధికారుల మీద దాడులు జరగడం, మీడియాకు ఎక్కి విమర్శలు చేసుకోవడం అన్నది లేదు ఇపుడు వైసీపీ పాలనలో అధికారులకు చనువు ఎక్కువ అయిందా అన్న విమర్శ కూడా ఉంది. అధికారుల మీద పెద్దగా ఏమీ అనకుండా వైసీపీ సర్కార్ నెట్టుకువస్తోంది. ఇది తాము తెచ్చిన ప్రభుత్వం అని కూడా ప్రభుత్వ వర్గాలలో ఉంది. దాంతో ఒక విధంగా ఇది విపరీత వైఖరులకు దారి తీసి ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. మరి కఠినమైన చర్యలు శాఖపరంగా యాక్షన్ ఉంటేనే తప్ప ఇలాంటివి కట్టడి చేయలేమని అంటున్నారు. ప్రభుత్వం అంటే అధికారులే. వారే ఇలా రోడ్డున పడితే పోయేది సర్కార్ పరువే అంటున్నారు.

Tags:    

Similar News