ఆచరణ యుక్తమా..? అసాధ్యమా..?
గతంలో న్యాయస్థానాలు తీర్పులు చెబితే ప్రభుత్వాలు గడగడలాడిపోతుండేవి. నైతిక బాధ్యత వహించి ప్రభుత్వాల అధినేతలు రాజీనామాలు చేసిన ఉదంతాలు కోకొల్లలు. కానీ ఇటీవలి కాలంలో కోర్టు తీర్పులంటే [more]
గతంలో న్యాయస్థానాలు తీర్పులు చెబితే ప్రభుత్వాలు గడగడలాడిపోతుండేవి. నైతిక బాధ్యత వహించి ప్రభుత్వాల అధినేతలు రాజీనామాలు చేసిన ఉదంతాలు కోకొల్లలు. కానీ ఇటీవలి కాలంలో కోర్టు తీర్పులంటే [more]
గతంలో న్యాయస్థానాలు తీర్పులు చెబితే ప్రభుత్వాలు గడగడలాడిపోతుండేవి. నైతిక బాధ్యత వహించి ప్రభుత్వాల అధినేతలు రాజీనామాలు చేసిన ఉదంతాలు కోకొల్లలు. కానీ ఇటీవలి కాలంలో కోర్టు తీర్పులంటే ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు అనిపించడం లేదు. ప్రభుత్వాధికారులూ తీర్పులను పెద్దగా లెక్క చేయడం లేదు. ఒక కోర్టు కాకపోతే మరింత పై న్యాయస్థానానికి వెళ్లవచ్చనే ఉదాసీనత ప్రబలుతోంది. ప్రభుత్వాల సంకుచిత దృక్పథమే చాలా వరకూ న్యాయస్థానాల కఠిన తీర్పులకు కారణమని చెప్పవచ్చు. అయితే కొంతమేరకు న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులూ ఆచరణాత్మకంగా లేకపోవడమూ అలసత్వానికి కారణంగా నిలుస్తున్నాయి. అమలు చేయడం సాధ్యం కాని తీర్పులు, కాలవ్యవధి ముగిసిపోయిన వ్యాజ్యాలు చర్చకు దారి తీస్తున్నాయి. అందుకే సుప్రీం కోర్టు ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఇవ్వవద్దంటూ హైకోర్టులకు కొంచెం ఘాటుగానే చెప్పింది. తాజాగా పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చను రేకెత్తించింది. హైకోర్టులో డివిజన్ బెంచ్, ఆపై సుప్రీం కోర్టు ఉండనే ఉన్నాయనే ధోరణిలో ప్రభుత్వం దీమాగా ఉంది. అమలు చేసే ఆలోచన చేయడం లేదు. లొసుగులను పట్టుకుని కొత్త రకం వ్యాజ్యాలు వేయాలనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ప్రచార సంబరమే తప్ప ప్రతిపక్షాలకు ఫలితం దక్కే సూచనలు కనిపించడం లేదు. అయితే న్యాయస్థానాల తీర్పులు వాస్తవిక పరిస్తితిని మించిన ఆదర్శాలను ప్రవచించడంతోనే చిక్కులు వచ్చి పడుతున్నాయనేది కొందరి వాదన.
కోర్టు చెప్పిందంటే…
గతంలో కోర్టులు అభిశంసించాయంటే ప్రభుత్వాధినేతలు అవమానంగా భావించేవారు. తాము ప్రజల దృష్టిలో పలచన అవుతామని పదవులకు రాజీనామాలు చేసేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రవాణా వ్యవస్తలో బస్సుల అనుమతులపై కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు నైతిక బాధ్యత వహించారు. పదవి నుంచి తప్పుకున్నారు. అది తొలి తరం . కానీ నేదురుమల్లి జనార్దనరెడ్డి వంటి మలితరం నేతలూ అదే సంప్రదాయాన్ని పాటించారు. మెడికల్ కళాశాలల అనుమతుల్లో అక్రమాలపై న్యాయస్తానం వ్యతిరేకంగా స్పందిస్తే పదవి నుంచి వైదొలిగి పోయారు. అదంతా గత వైభవంగానే మిగిలిపోనుంది. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని తరచూ హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వాలు లెక్క చేయడం లేదు. అందుకు న్యాయస్థానాల్లోని తీర్పులలోని డొల్లతనమూ ఒక కారణమే. డివిజన్ బెంచ్ ఇచ్చిన అనుమతితో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇప్పటికే జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని రద్దు చేయడం వల్ల న్యాయ పునరుద్ధరణ సంగతి పక్కన పెడితే అనవసర గందరగోళం చోటు చేసుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినప్పుడు సంబంధిత అధికారులపై కోర్టులు చర్యలు తీసుకోవచ్చు. అందువల్ల భవిష్యత్తులో తప్పులు చేయాలంటే అధికారులు వెనుకంజ వేస్తారు. ప్రభుత్వాలు చెప్పినా తమ మనస్పాక్షి లేకుండా ముందడుగు వేయలేరు. అటువంటి చర్యలు కాకుండా మొత్తం ప్రక్రియనే పక్కనపెట్టడం అంటే అమలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. .
ఆచరణ సాధ్యం కాని అంశాలెన్నో…
కోట్ట కొలదీ కేసులతో తల్లడిల్లుతున్న న్యాయస్థానాల్లో కాలం చెల్లిన వ్యాజ్యాలకూ కొదవ లేదు. ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర విభజన చెల్లదంటూ దాఖలైన కేసు ఇప్పటికీ సుప్రీం కోర్టులో మూలుగుతోంది. రెండు రాష్ట్రాలుగా పరిపాలన మొదలై ఏడేళ్లు గడిచింది. ఇంకా ఈ వ్యాజ్యం అర్థరహితమే. పైపెచ్చు రాష్ట్ర విభజన చెల్లుబాటు కాదని న్యాయస్థానం అభిప్రాయపడినా అమలయ్యే అంశమూ కాదు. అందువల్ల సకాలంలో జోక్యం చేసుకుని దిద్దుబాటు చేయాల్సిన అంశాలపైనే న్యాయస్తానాలు తమ సమయాన్ని సద్వినియోగం చేయాలని న్యాయనిపుణులు కోరుకుంటున్నారు. కాలం చెల్లిన కేసులకు మంగళం పాడటం అవసరం. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. లక్షల గ్రామాలున్న దేశం మనది. ఉత్తరప్రదేశ్ పెద్ద రాస్ట్రం. ప్రతిగ్రామంలో రెండు అంబులెన్సులు పెట్టాలని కోర్టు ఆదేశించింది. అంతటి ఇనఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. హైకోర్టుల్లో కోవిడ్ వాక్సినేషన్ పై అనేక కేసులున్నాయి. రెండు నెలలలో వాక్సినేషన్ దేశమంతటా పూర్తి కావాలని న్యాయస్థానాలు అభిప్రాయపడినా అమలు సాధ్యం కాదు. అందువల్ల ఆచరణ ప్రాతిపదికనే కోర్టులు స్పందించి , అమలు విషయంలో మాత్రం కఠినంగా ఉండటం మేలు. లేకపోతే కోర్టులు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వ్యవస్థల పనితీరుపై ప్రజల్లోనే చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యం..
న్యాయస్తానాల తీర్పుల పట్ల ప్రభుత్వాలు తగినంత గౌరవ భావంతో వ్యవహరించడం లేదు. కోర్టు తీర్పులకు రాజ్యాంగమే ప్రామాణికంగా ఉంటుంది. ఒకవేళ దిగువ న్యాయస్థానాలు భిన్నమైన తీర్పులు చెప్పినా, సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు కోర్టుల ప్రతిష్ఠ దిగజారకుండా వ్యవహరించాలి. కామన్ సెన్స్ తో నిర్ణయాలు తీసుకుంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ప్రజలు అధికారమిచ్చారనే ఉద్దేశంతో రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటే పేచీలు తప్పవు. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పర్యాయాలు న్యాయస్థానం నుంచి అభ్యంతరాలు చవి చూడాల్సి వచ్చింది.తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల్లో రాజ్యాంగ బద్ధత, న్యాయ కోణాలను పట్టించుకోవడం లేదు. రాజకీయ నిర్ణయాలను ఎలాగైనా అమలు చేయాలన్న మొండి పట్టుదల కారణంగానే ప్రతికూలత ఎదురవుతోంది. మెజార్టీ తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడానికి కారణమిదే. ఇప్పటికైనా సమున్నత రాజ్యాంగ వ్యవస్థలు సంఘర్షణాత్మకతకు తావివ్వకుండా పరిధులు, పరిమితుల్లో ప్రజా ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు.
-ఎడిటోరియల్ డెస్క్