ఆరేళ్లవుతున్నా జండా ఎగరేయరే …?

జనసేన పార్టీ 2014 లో మొదలైంది. పవన్ కళ్యాణ్ పార్టీని ప్రకటించగానే ఉమ్మడి రాష్ట్రాల్లో యువత ఒక కెరటంలా రోడ్డెక్కి జనసేన జండా పట్టారు. మూస రాజకీయాలకు [more]

Update: 2020-07-05 08:00 GMT

జనసేన పార్టీ 2014 లో మొదలైంది. పవన్ కళ్యాణ్ పార్టీని ప్రకటించగానే ఉమ్మడి రాష్ట్రాల్లో యువత ఒక కెరటంలా రోడ్డెక్కి జనసేన జండా పట్టారు. మూస రాజకీయాలకు చెక్ పెడుతూ కొత్త రాజకీయం రాబోతుందని చాలామంది సంబరపడ్డారు. వారసత్వ రాజకీయాలకు ఇక చెల్లు చిటీని పవన్ ఇస్తారనే అనుకున్నారు. ఇక ఆ తరువాత పవన్ సీరియస్ గానే జనసేనను ముందుకు నడిపించారు. అయితే ఎక్కడా పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున ఇప్పటికిప్పుడు కమిటీలు కరెక్ట్ కాదన్నది అధినేత చెప్పుకొచ్చారు. కట్ చేస్తే టిడిపి, బిజెపిలకు మద్దతు ఇస్తూ ఒక్కసీటులో కూడా పోటీ చేయలేదు పవన్. కేవలం వైసిపి ని అధికారంలోకి రాకుండా ఉండే వ్యూహంతోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేసినట్లు నాడు తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఐదేళ్లలో ఏదో చేస్తారని అనుకుంటే …

ఆ తరువాత ఐదేళ్ళ సమయం జనసేన పార్టీ నిర్మాణానికి వినియోగించలేదు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్న టిడిపి కి కష్టం లో ఉన్నా వైసిపి దూకుడు పెరుగుతున్నా పవన్ ప్రత్యక్షం అయ్యేవారు. అధికారపక్షాన్ని కాపాడేవారన్న సంగతి రాజకీయ విశ్లేషకులు ఎత్తి చూపేవారు. ఇక ప్రత్యేక హోదా అంశం లో తీవ్ర పోరాటం చేస్తున్న వైసిపి కన్నా దూకుడుగా ఆ బాధ్యతను తన నెత్తిన పెట్టుకున్నారు పవన్. ఎన్నికలకు ఏడాది ముందు తాను అప్పటివరకు వెనకేసుకు వచ్చిన టిడిపి కి హ్యాండ్ ఇచ్చి యు టర్న్ కొట్టి హోదా కోసం కవాతు రాష్ట్రం అంతా మొదలు పెట్టారు.

హడావిడి చేసి వదిలేశారు …

నిజమైన ప్రతిపక్షం జనసేన మాత్రమే అన్న స్థాయిలో ఆయన గట్టిగానే ఉద్యమాలు చేశారు. అయితే అప్పుడు కూడా పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం చేయడం పై సీరియస్ గా దృష్టి పెట్టలేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరో ఒకరికి మద్దతు ఆయన ఇస్తారనే అంతా లెక్కేశారు. అయితే ఇలా తప్పటడుగులు వేయడంతో పవన్ పై అనుమానాలు ప్రజల్లో ఉండిపోయాయి. ఆ అనుమానాలే ఆయన జనసేన నిర్మాణం పూర్తి స్థాయిలో లేకుండా ఎన్నికల్లో దిగి అధినేత రెండుచోట్లా ఓటమికి ఒక్కసీటు దక్కడానికి కారణం అయ్యింది.

ఇప్పుడు అదే దారి …

ఎన్నికలు ముగిసాయి. జనసేన మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా చతికిలపడింది. ఈ ఓటమి శ్రేణుల్లో నైరాశ్యం నింపింది. అయినా పవన్ కళ్యాణ్ ఏ మాత్రం అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఇక నుంచైనా ఆయన గాడిన పెడతారనే అంతా అనుకున్నారు. ఏడాది గడిచింది. గ్రామీణ స్థాయిలో కమిటీలకు మోక్షం లేదు.

వారే నియమించుకుంటున్నారు …

కానీ అక్కడక్కడా మొన్నటి ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చిన నేతలు పోరాటం ఆపేది లేదని మండల, గ్రామ స్థాయి కమిటీలు తమకు తామే నియమించుకున్నారు. వీరిని అధిష్టానం ఆగండని చెప్పినా క్షేత్ర స్థాయిలో పటిష్టం కాకపోతే తమ నాయకత్వానికి మనుగడ లేదని పోటీ చేసిన అభ్యర్థులు కొందరు ధైర్యంగానే అధిష్టానానికి చెప్పేశారు. అయితే ప్రతి నియోజకవర్గంలోను బూత్ స్థాయిలో కమిటీల నిర్మాణానికి జనసేనకు ఎందుకు ఇబ్బంది అన్న ప్రశ్న అలానే ఉండిపోయింది. ఇప్పటికి ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో కమిటీల ఏర్పాటు చేసినా అది కింది స్థాయి వరకు వెళ్ళలేదు. అక్కడితోనే ఆగిపోయింది.

అధినేత వ్యూహం అర్ధం కావడం లేదు …

ఇప్పటికే రెండు ఎన్నికలను చూసి ఒక ఎన్నికల్లో నేరుగా పోటీ చేసినా జనసేనాని వ్యూహం ఏమిటో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అర్ధం కాకుండానే ఉంది. దీనిపై పవన్ జనసేన శ్రేణులతో సమాలోచనలు జరిపి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోతే బిజెపి కూడా చులకన చేసే పరిస్థితి ఉందని వారు ఇచ్చిన సీట్లే పోటీ చేయాలిసి ఉంటుందనే ఆందోళన శ్రేణుల్లో నెలకొనివుంది. వచ్చే ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావాలన్నా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి చెప్పాలన్నా అన్ని విభాగాల్లో నిర్మాణం ఈపాటికే జరగాలన్నది జనసైనికుల మనోగతం. మరి పవన్ ఏమి చేస్తారో చూడాలి.

Tags:    

Similar News