గులాబీ గూటిలో గ‌లాటా ఏంటి..?

ఓట‌మి గుణ‌పాఠం నేర్పుతుంది అంటారు. అయితే ఖ‌మ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు మాత్రం ఓట‌మి నుంచి ఎటువంటి పాఠాన్ని నేర్చుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లి [more]

Update: 2019-02-16 00:30 GMT

ఓట‌మి గుణ‌పాఠం నేర్పుతుంది అంటారు. అయితే ఖ‌మ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు మాత్రం ఓట‌మి నుంచి ఎటువంటి పాఠాన్ని నేర్చుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక్లో రాష్ట్ర‌వ్యాప్తంగా గులాబీ గాలి వీచినా ఖ‌మ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. కేవ‌లం ఒకే ఒక్క స్థానాన్ని మాత్ర‌మే ఆ పార్టీ గెలుచుకోగ‌లిగింది. ఇందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌లంగా ఉండ‌టం ఒక కార‌ణ‌మైతే టీఆర్ఎస్ లోని వ‌ర్గ విభేదాలే ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం. స్వ‌యంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజే స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ విష‌యాన్ని అంగీక‌రించారు. ఖ‌మ్మంలో త‌మ‌ను ఎవ‌రూ కొట్ట‌లేద‌ని, మా క‌త్తులు మాకే తాకాయ‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విష‌య‌మై ఎన్నిక‌ల ముందే హెచ్చ‌రించినా వారు మార‌కుండా ఓడిపోయార‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌రే, అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసాయి, పార్ల‌మెంటు ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా పార్టీలో గ్రూపు త‌గాదాలు త‌గ్గుతాయంటే ఇంకా పెరిగాయి. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ‌ర్గాలుగా చీలిన ఖ‌మ్మం టీఆర్ఎస్‌లో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఒక‌రి వ‌ర్గీయుల‌ను ఒక‌రు ఓడించుకుని..

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలో బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డంతో ఖ‌మ్మంలో టీఆర్ఎస్ ఓడిపోయింది. 2018లో మాత్రం బ‌ల‌మైన నాయ‌కులు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల ఓడిపోయింది. 2014 త‌ర్వాత టీడీపీ నుంచి జిల్లా రాజ‌కీయాల్లో బ‌ల‌మైన నేత‌గా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు స‌న్నిహితుడైన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖ‌మ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో అప్ప‌టి నుంచి జిల్లా పార్టీ రెండు వర్గాలుగా కొన‌సాగుతోంది. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పాలేరు నుంచి ఓట‌మి పాల‌య్యారు. అయితే, ఆయ‌న ఓట‌మికి పరోక్షంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార‌ణ‌మ‌నేది తుమ్మ‌ల వ‌ర్గీయుల వాద‌న‌. వైరాలోనూ తుమ్మ‌ల వ‌ర్గీయుడైన బానోతు మ‌ద‌న్‌లాల్‌కు కాకుండా పొంగులేటి వ‌ర్గీయులు స్వతంత్ర అభ్య‌ర్థి రాములు నాయ‌క్ కు మ‌ద్ద‌తు ఇచ్చి గెలిపించార‌నే ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అదే విధంగా పొంగులేటి వ‌ర్గంగా ఉన్న తెల్లం వెంక‌ట్ రావుకు వ్య‌తిరేకంగా భ‌ద్రాచ‌లంలో తుమ్మ‌ల వ‌ర్గీయులు ప‌నిచేశారు. మొత్తానికి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌రి వ‌ర్గీయుల‌ను ఒక‌రు ఓడించుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ప‌ర‌స్ప‌రం చేసుకున్నారు.

పొంగులేటికి స‌హ‌క‌రిస్తారా..?

పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ కూడా ఇవే విభేదాలు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. తాజాగా, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. ప‌రోక్షంగా పొంగులేటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారు ఎక్కువ కాలం పార్టీలో మ‌నుగ‌డ సాధించ‌లేర‌ని పేర్కొన్నారు. ఇక‌, తుమ్మ‌ల వ‌ర్గంలోని జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ కూడా పార్టీలో ప‌రిణామాలు న‌చ్చ‌డం లేద‌ని చెబుతూ రాజీనామా చేశారు. మొత్తానికి ఈ విభేదాలు రోజురోజుకూ త‌గ్గ‌డం అటుంచితే పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయ‌నున్నారు. మ‌రి, ఇప్ప‌టికే త‌న ఓట‌మికి పొంగులేటినే కార‌ణ‌మ‌ని పీక‌ల దాకా కోపంతో ఉన్న తుమ్మ‌ల‌, ఆయ‌న వ‌ర్గీయులు ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం అనుమాన‌మే అంటున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల కొత్త‌గూడెం నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్ రావు కూడా పొంగులేటికి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి ఖ‌మ్మం టీఆర్ఎస్ లో వ‌ర్గ విభేదాలు ఇలానే కొన‌సాగితే మ‌రోసారి ఇక్క‌డ టీఆర్ఎస్ పుట్టి మున‌గ‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు.

Tags:    

Similar News