గుడివాడ గురి చూసి కొట్టినట్లేనటగా?

వైసీపీలో గుడివాడ గురునాధ అమరనాధ్ యువ నేతగా ముందున్నారు. ఆయన్ని అటు విజయసాయిరెడ్డికి, ఇటు ముఖ్యమంత్రి జగన్ కి కూడా చాలా ఇష్టమైన నేతగా చెప్పుకుంటారు. ఆయన్ని [more]

Update: 2020-04-02 14:30 GMT

వైసీపీలో గుడివాడ గురునాధ అమరనాధ్ యువ నేతగా ముందున్నారు. ఆయన్ని అటు విజయసాయిరెడ్డికి, ఇటు ముఖ్యమంత్రి జగన్ కి కూడా చాలా ఇష్టమైన నేతగా చెప్పుకుంటారు. ఆయన్ని మూడేళ్ళ పాటు విశాఖ వంటి అతి పెద్ద జిల్లా ప్రెసిడెంట్ గా జగన్ విపక్షంలో ఉన్నపుడు కొనసాగించడం వెనక ఆయనంటే ఉన్న ప్రత్యేక అభిమానమే కారణం అంటారు. సామాజికవర్గం పరంగా బలమైన కాపు వర్గానికి చెందిన గుడివాడ అమరనాధ్ రాజకీయంగా కూడా అతి పెద్ద కుటుంబానికి చెందిన వారసుడు. ఆయన తాత గుడివాడ అప్పన్న విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకర్గానికి తొలి ఎమ్మెల్యే. తరువాత తండ్రి, మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు అదే పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా రాణించారు. గురునాధరావు మంచి వక్త. ఒకసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా పనిచేశారు.

వారసుడిగా ఎదిగి….

ఇక గురునాధరావు రెండు దశాబ్దాల క్రితం అతి చిన్న వయసులోనే అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ఆయన వారసుడిగా అమరనాధ్ ఎదిగేసరికి పదేళ్ళు పట్టింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిన గుడివాడ అమరనాధ్ పట్టువిడవకుండా పనిచేయడంతో ఈసారి అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యెగా గెలిచారు. విశాఖ జిల్లా రాజకీయాలకు ముఖద్వారంగా ఉన్న అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా గతంలో దిగ్గజ నేతలు గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు వంటి వారు గెలిచారు. వీరంతా మంత్రులుగా అధికారం చలాయించారు.

ఖాయమా?

ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే గుడివాడ అమరనాధ్ కు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే టీడీపీ నుంచి ఎన్నికల ముందు వైసీపీలోకి షిఫ్ట్ అయిన అవంతి శ్రీనివాస్ కి జగన్ మంత్రి ఇచ్చారు. ఆయన తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీలోకి వస్తానని నాడు కండిషన్ పెట్టారు. దాని ప్రకారం ఆయనకు పదవి వెంటనే దక్కింది. అయితే అవంతి మెత్తగా ఉండడం, కమాండింగ్ నెచర్ లేకపోవడం, అందరినీ కలుపుకుని ముందుకుపోకపోవడం వల్ల వైసీపీలో కొంతమేర‌ నిరుత్సాహం ఉంది. హైకమాండ్ సైతం అవంతిని దూకుడు రాజకీయం చేయమని కోరుతున్నా ఆయన అనుకున్నంతగా సాగలేకపోతున్నారు. దాంతో మలివిడతలో ఆయన్ని తప్పిస్తారని అంటున్నారు.

కీలక సమయంలో….

ఇక అమరనాధ్ వంటి యువకులకు ఎన్నికల టీంగా మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. జోరుగా పార్టీని జనంలోకి తీసుకెళ్ళాలంటే యువతకు పట్టం కట్టడమే మేలు అని కూడా భావిస్తున్నారుట. మలి విడతలో పూర్తిగా సీనియర్ సిటిజన్లకు చాన్స్ ఉండదని అంటున్నారు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న గుడివాడ అమరనాధ్ తనదైన రాజకీయంతో ఎప్పటికపుడు అధినాయకత్వం కంట్లో ఉంటున్నారు. విశాఖ రాజకీయాల్లో ఆయన విపక్షాలను చీల్చిచెండాడుతూ జగన్ వద్ద బాగానే మార్కులు సంపాదిస్తున్నారు. మరి ఆయన కూడా తండ్రిలాగానే మంత్రి పదవిని చేపడతారా అన్నది చూడాలి. అభిమానులు మాత్రం అది జరిగితీరుతుందని అంటున్నారు.

Tags:    

Similar News