మ్యూజియంలో పెట్టొద్దు..?

మహాత్మాగాంధీకి ఆధునికత అవసరమా? వేల కోట్ల రూపాయలు పోసి ఆయనకు అధునాతనమైన స్మారకం నిర్మిస్తామంటోంది గుజరాత్ ప్రభుత్వం. అందుకు సరేనంటోంది కేంద్రప్రభుత్వం. వేల కోట్ల రూపాయల వ్యయంతో [more]

Update: 2021-08-18 16:30 GMT

మహాత్మాగాంధీకి ఆధునికత అవసరమా? వేల కోట్ల రూపాయలు పోసి ఆయనకు అధునాతనమైన స్మారకం నిర్మిస్తామంటోంది గుజరాత్ ప్రభుత్వం. అందుకు సరేనంటోంది కేంద్రప్రభుత్వం. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రతిపాదనను ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పని లేదు. అయితే గాంధీ స్వాతంత్ర్య సమరంలో ఎక్కువభాగం నడయాడిన సబర్మతి ఆశ్రమాన్నే మ్యూజియం చేస్తామనడంతోనే ఇబ్బంది వచ్చి పడుతోంది. ఆ ప్రదేశంలో ఆయన గురుతులు చెరపరానివి. నేటికీ ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చే నాయకులు స్ఫూర్తిని పొందుతుంటారు. ఆయన కూర్చున్న , తిరిగిన ప్రదేశాలను కలియ చూసి మనో ఫలకంపై నివాళులర్పిస్తుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పులకించిపోతుంటారు. అటువంటి ప్రాంతంలో ఆకాశహర్మ్యం వంటి కట్టడంతో ఆయనను చిరస్థాయిగా చేస్తామనడం పరిహాసాస్పదమే. హంగు ఆర్బాటాలు, హడావిడిని జీవిత కాలం దూరంగా ఉంచిన వ్యక్తి బాపూజీ. ఆయనలోని బోసి నవ్వుల పలకరింపులా కనిపించే సాదాసీదా ఆశ్రమమే ఆయనకు సరైన నివాళిగా నిలుస్లుంది. సబర్మతి ఆశ్రమం కాంక్రీట్ కట్టడం గా మారిపోతే ఇతర ప్రాంతాల్లో ఆయన పేరిట ఉన్న నిర్మాణాలకు దానికి తేడా ఏమీ ఉండదు. అందుకే రాజకీయాలకు అతీతంగా ఆశ్రమాన్ని పరిరక్షించమనే డిమాండ్ వినవస్తోంది.

దశ మార్చిన నేత…

అతివాదులు, మితవాదులతో ‘హై ఫై’ సొసైటీగా ముద్ర పడిన కాంగ్రెసుకు కొత్త దిశను నిర్దేశించారు మహాత్మాగాంధీ. బ్రిటిషర్ల దయాదాక్షిణ్యాల కోసం పాకులాడుతూ సంఘంలో తమ హోదాకు ఒక చిహ్నంగా కాంగ్రెసును భావించేవారు ఆనాటి నాయకులు. 1915 వరకూ అదే పరిస్థితి. బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినా ఆ నాటి కాంగ్రెసు వారి మాట పడనీయలేదు. బ్రిటిషర్లు ఆయనను జైలుకి పంపించి కాంగ్రెసుకు లోపాయికారీ సహకరించారు. ప్రతిగా కాంగ్రెసు మితవాడులు కూడా బ్రిటిష్ పాలకులకు లోపాయికారీ మద్దతునిచ్చారు. ఈ స్థితిలో కాంగ్రెసులో ప్రవేశించిన గాంధీ దక్షిణాప్రికాలో తాను నేర్చుకున్న రాజకీయ పోరాటాన్ని భారత్ లో అమలు చేశారు. స్వాతంత్ర్యోద్యమానికి కొత్త రూపునిచ్చారు. తిలక్ వంటి నాయకులు చనిపోయారు. దాంతో ఒకే ఒక్క మహానేతగా కాంగ్రెసుకు బాపూజీ దిశానిర్దేశం చేశారు. స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించారు. అటువంటి నాయకుడి అడుగుజాడలు చాలా పవిత్రమైనవి. వాటిని ఏ పేరుతోనైనా చెరిపేయాలనుకోవడం దారుణం. మ్యూజియంలో పెట్టి ఆయన చరిత్రను చెప్పడం కంటే ఆయన గురుతులను చెరిగిపోకుండా కాపాడుకోవడమే ముఖ్యం.

నేటికీ ఆదర్శమే…

రాజకీయ నాయకులకు ఈనాటికి కూడా గాంధీ ఆదర్శమనే చెప్పాలి. దేశ పాలనకు మూల స్తంభాలుగా నిలుస్తున్న ఆదేశిక సూత్రాలు, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన వంటివి ఆచరించాల్సిన నియమాలు. ప్రజల్లో నైతిక వర్తన, అహింసా భారత దేశానికి అనుసరణీయాలు. భిన్నమతాలు, కులాలు, ప్రాంతాలతో కూడిన భారత్ లో పరమత సహనం వంటివి తప్పనిసరిగా ఆచరించాలని తన జీవిత కాలంలోనే ప్రబోధించారు గాందీ. ఆడంబరాలు లేని సాధారణ జీవితం , మూడోతరగతి రైలు ప్రయాణం, సాత్వికాహారం, ప్రజల్లో మమైకం కావడం వంటివి ఆయన చూపిన మార్గాలు. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పగలిగితే వారంతటవారే తరలి వస్తారు. సమావేశాలకు కోట్ల రూపాయల ఖర్చుతో నాయకులు జనసమీకరణ చేయాల్సిన అవసరం ఉండదు. గాంధీ దేశవ్యాప్త పర్యటనలకు ప్రజలు తండోపతండాలుగా , స్వచ్ఛందంగా తరలి వచ్చేవారు. ప్రజల పట్ల ఆయన అంకితభావమే అందుకు కారణం. నేటి పరిపాలకులు గాందీ పేరును ప్రచారానికి వాడుకోకుండా ఆయన ఆదర్శాలను కొంతమేరకైనా ఆచరిస్తే భారత్ నిజంగానే స్వర్గధామంగా విలసిల్లుతుంది.

ప్రజల్లో ఉన్నాడు…

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన నాయకుడు గాంధీజీ. అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యలో ఆయన జీవితాన్ని పాఠ్యాంశాలు చేశాయి. స్వాతంత్య్యోద్యమంలో పాల్గొన్న చాలా మంది నాయకులను ప్రజలు ఇప్పటికే మరిచిపోయారు. ప్రభుత్వాలు సైతం పక్కన పెట్టేశాయి. ఇంకా దేశంలో సజీవంగా ఆదరణ పొందుతున్న నాయకుడు గాంధీజీయేనని చెప్పాలి. ఆయన పేరుకు ఇంకా ప్రజల్లో పలుకుబడి ఉంది. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు తమ ప్రసంగాల్లో ఆయనను ప్రస్తావిస్తుంటారు. మహాత్మునికి ఉన్న పాప్యులారిటీకి ఇదే కొలబద్ద. లేకపోతే మన నాయకులు ఆయనను కూడా ఎప్పుడో మరిచిపోయేవారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను తప్పు పట్టలేం. అయితే కొన్ని చారిత్రక సందర్భాలు, ప్రదేశాలను యథాతథంగా కాపాడుకుంటేనే జీవత్వం తొణికిసలాడుతుంది. భారత ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గాంధీ కదలికలు కనుమరుగు కాకుండా చూసుకోవాలి. మ్యూజియంలో పెట్టి చరిత్ర చెప్పాల్సిన నాయకుడు కాదు, ప్రజలలో నిరంతరం కనుల ముందు నిలవాల్సిన నాయకుడు . అందువల్ల గాంధీ కట్టడాలను పక్కన పెట్టి , ఆశ్రమాన్ని యథాతథంగా ఉంచడమే దేశానికి ప్రేరణ నిస్తుంది. గాంధీజీపై అంతగా ప్రేమ పొంగివస్తుంటే వేరే ప్రాంతంలో విశ్వవిద్యాలయం సహా మ్యూజియం నిర్మించి ఆయన చూపిన మార్గానికి నీరాజనాలు పట్టవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News