ట్రబుల్ లో ట్రబుల్ షూటర్

దాదాపు నలభై ఏళ్లకు పైగానే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. ఎన్నో పదవులు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆయన పదవిలో ఉన్నట్లే. ఇక గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. [more]

Update: 2020-08-25 17:30 GMT

దాదాపు నలభై ఏళ్లకు పైగానే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. ఎన్నో పదవులు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆయన పదవిలో ఉన్నట్లే. ఇక గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. ఇక రాష్ట్రాల్లో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు పరిష్కరించే ట్రబుల్ షూటర్ గా పేరుంది. అనేక రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా వ్యవహరించి అక్కడ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఆయన ఇప్పుడు గాంధీ కుటుంబానికి పూర్తిగా దూరమయినట్లే కన్పిస్తుంది.

నలభై ఏళ్ల అనుబంధం…..

గులాంనబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ లోని సోటి గ్రామంలో 1949 లో జన్మించారు. జమ్మూ కాశ్మీర్ లోని బలెస్సా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా 1973లో గులాం నబీ ఆజాద్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ పార్టీనే నమ్ముకున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారీ కేంద్ర మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు కూడా.

చొరవగా వెళ్లగలిగే నేత….

టెన్ జన్ పథ్ లోకి చొరవగా వెళ్లగలిగే నేతల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు. సోనియా గాంధీకి అత్యంత ఆప్తుడిగా పేరుంది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కూడా గులాం నబీ ఆజాద్ చొరవే. అనేక పదవులు అందుకున్న గులాం నబీ ఆజాద్ ఇప్పుడు పార్టీకి కొరగాకుండా పోయారు. సీనియర్లు రాసిన లేఖతో గులాంనబీ ఆజాద్ పై సోనియాతో సహా రాహుల్, ప్రియాంకలు మండిపడుతున్నారు.

ఆ లేఖతో ఆజాద్ ను…

ఈ లేఖ రాయడంతో పాటు, ఆ లేఖ మీడియాకు లీక్ కావడంపై కూడా గాంధీ కుటుంబం ఆగ్రహంతో ఉంది. పార్టీ నుంచి తమ కుటుంబాన్ని దూరం చేసే ప్రయత్నంలో కొందరు ఉన్నారని సోనియా గాంధీ సయితం అభిప్రాయపడుతున్నారు. ఇంతమంది సీనియర్ల కలయిక వెనక ఆజాద్ ఉన్నారన్నది వారి అనుమానం. ఇక భవిష్యత్తులో ఆజాద్ ను గాంధీ కుటుంబం నమ్మే పరిస్థితి లేదంటున్నారు. మొత్తం మీద ఒక్క లేఖతో నలభై ఏళ్ల అనుబంధంలో ఒక్క మాట కూడా పడని ఆజాద్ నేడు టెన్ జన్ పథ్ ముందు తలవంచుకోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News