అయ్యన్న బాణానికి మంత్రి విలవిల ?

చంద్రబాబుకు అసలైన తమ్ముడు ఉత్తరాంధ్రాలోనే ఉన్నాడు. ఆయనే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడు కూడా అధికార పార్టీ మీద నిత్యం విమర్శల జడివాన కురిపిస్తూనే ఉంటారు. [more]

Update: 2020-10-13 12:30 GMT

చంద్రబాబుకు అసలైన తమ్ముడు ఉత్తరాంధ్రాలోనే ఉన్నాడు. ఆయనే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడు కూడా అధికార పార్టీ మీద నిత్యం విమర్శల జడివాన కురిపిస్తూనే ఉంటారు. ఆయనకు చిన్న సందు దొరికితే చాలు వీర విహారమే చేస్తారు. అధారాలు మాట పక్కన పెడితే బురద జల్లడంలో మాత్రం బాబుకు అసలైన వారసుడు అయ్యన్నే మరి. ఆయన ఈ మధ్యన వైసీపీ మంత్రి జయరాం ని టార్గెట్ చేస్తున్నారు. జయరాం రాయలసీమకు చెందిన బీసీ మంత్రి. జగన్ ఏరి కోరి తెచ్చుకున్న మంత్రి. బీసీలకు పెద్ద పీట వేస్తూ కీలకమైన శాఖలను జగన్ ఆయనకు అప్పగించారు. ఏడాదిన్నరగా జయప్రదంగానే జయరాం రాజకీయం సాగింది. ఎపుడైతే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారో నాటి నుంచే జయరాం మీద టీడీపీ గురి పెట్టింది.

అవినీతి ఆరోపణలతో….

జయరాం మీద బురద జల్లేందుకు ఉత్తరాంధ్రకు చెందిన మరో బీసీ నేత అయ్యన్నపాత్రుడిని రంగంలోకీ దించడంలోనే చంద్రబాబు రాజకీయం దాగుతుంది. బెంజి కారు తో మొదలుపెట్టిన అయ్యన్నపాత్రుడి ఆరోపణలు ఇపుడు వందల ఎకరాల భూ దందా దాకా సాగడమే అసలైన కొసమెరుపు. జయరాం ని పచ్చి అవినీతిపరుడుగా చిత్రీకరించడంలో మాజీ మంత్రి చాలానే చేస్తున్నారు. తాజాగా మంత్రి జయరాం 200 ఎకరాల భూములను కొనుగోలు చేశాడంటూ అయ్యన్న చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఆ భూములు ఆయన ఒక కంపెనీ నుంచి దందా చేసి తీసుకున్నవి అని కూడా అయ్యన్నపాత్రుడు అంటున్నారు.

బీసీ కార్డుతోనే …..

అయితే బీసీ మంత్రి జయరాం దీన్ని బీసీ కార్డుతోనే ఎదుర్కొంటున్నారు. ఒక బీసీగా తాను కష్టార్జితంగా 30 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశానని అందులో అవినీతి ఏముందని కూడా ఆయన అంటున్నారు. తాను దందా చేసినట్లుగా ఆరోపణలు రుజువు చేస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని కూడా ఆయన ప్రకటిస్తున్నారు. అదే సమయంలో తాను చేయని దాన్ని చేసినట్లుగా చెబుతున్నా అయ్యన్నపాత్రుడు మీద పరువు నష్టం దావా వేయడానికి కూడా రెడీ అంటున్నారు. బెంజి కారు మొదలుకుని భూముల కొనుగోలు వరకూ జయరాం మీద ఆరోపణల జడివాన కురియడం మాత్రం వైసీపీలో చర్చగా ఉంది.

ఊడిపోతుందా….?

జగన్ తన మంత్రులకు ఒక్కటే చెబుతూ వస్తున్నారు. తాను అవినీతిని అసలు సహించనని పక్కా క్లారిటీగానే చెబుతున్నారు. ఈ విషయంలో ఎంతటి వారిని అయినా వదలమని కూడా అంటున్నారు. ఒకవేళ అవినీతి అని తేలితే ఆ మంత్రి తనను కూడా కలవకుండా నేరుగా గవర్నర్ వద్దకే వెళ్ళి రాజీనామా పత్రం ఇచ్చేయాలని కూడా జగన్ హెచ్చరించిన సంగతి విదితమే. చూడబోతే జయరాం పరిస్థితి ఇపుడు ఇరకాటంగానే ఉంది. ఆయన బెంజ్ కారు భూముల కధలు ఎలా బయటకు వస్తున్నాయో తెలియదు, వైసీపీ నేతలే టీడీపీకి ఉప్పు అందిస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జయరాం మీద రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. ఇది చిలిలి చిలికి గాలి వాన అయ్యేట్లుగా ఉంది. జగన్ కనుక మూడవ కన్ను తెరిస్తే జయరాం పదవికి ముప్పేనని కూడా అంటున్నారు. ఇక జయరాం మంత్రిగా కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ సర్కార్ నుంచి ఒక వికెట్ ని తీసిన ఘనత మాత్రం టీడీపీ దక్కించుకుంటుందని చెప్పాలి.

Tags:    

Similar News