గుంత‌క‌ల్లు ఎవరి ఖాతాలోకి..?

అనంత‌పురం జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌ర‌గ‌గా గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం త్రిముఖ పోటీ జ‌రిగింది. ఆ [more]

Update: 2019-05-22 06:30 GMT

అనంత‌పురం జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌ర‌గ‌గా గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం త్రిముఖ పోటీ జ‌రిగింది. ఆ పార్టీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే మ‌ధుసుద‌న్ గుప్తా పోటీ చేయ‌డంతో ఆయ‌న ఏ పార్టీ ఓట్లు చీలుస్తార‌నే దానిని బ‌ట్టి ఇక్క‌డ గెలుపోట‌ములు నిర్ణ‌యం అయ్యే అవ‌కాశం ఉంది. గుంత‌క‌ల్లు(2009కి ముందు గుత్తి)లో ఏ పార్టీ అభ్య‌ర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే ఓ సెంటిమెంట్ ఉండ‌టంతో ఇక్క‌డ విజ‌యం సాధించేందుకు రెండు పార్టీలూ బాగానే క‌ష్ట‌ప‌డ్డాయి. టీడీపీలో గ‌తంలో ఎప్పుడూ ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేకు గానీ, ముందు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన వారికి గానీ టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఈ సంప్ర‌దాయానికి జితేంద‌ర్ గౌడ్ బ్రేక్ వేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మ‌ళ్లీ టిక్కెట్ తెచ్చుకున్నారు. ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన ఎల్లారెడ్డిగారి వెంక‌ట‌రామిరెడ్డి ఈసారి కూడా బ‌రిలో ఉన్నారు. జ‌న‌సేన పోటీలో ఉన్నా ప్ర‌ధానంగా పోటీ మాత్రం వీరిద్ద‌రి మ‌ధ్యే జ‌రిగింది.

బీసీల ఓట్ల‌పై టీడీపీ ధీమా

గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట‌రామిరెడ్డిపై టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన జితేంద‌ర్ గౌడ్ 5,094 ఓట్ల స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించారు. వాస్త‌వానికి ఆ ఎన్నిక‌ల్లో ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటును కేటాయించినా జితేంద‌ర్ గౌడ్ కూడా పోటీలో ఉండ‌టంతో పొత్తు లేకుండానే టీడీపీ, బీజేపీ రెండు పార్టీలూ ఇక్క‌డ పోటీ చేశాయి. ఈసారి టీడీపీ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మ‌ధుసుద‌న్ గుప్తా కూడా చివ‌రి నిమిషం వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. ఆయ‌న‌కు ఎంపీ దివాక‌ర్ రెడ్డి అండ‌దండ‌లు ఉన్నా టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో జ‌న‌సేన టిక్కెట్ తెచ్చుకొని పోటీ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ సామాజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు, ముస్లింలు కీల‌కం. జితేంద‌ర్ గౌడ్ బీసీ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో వారి ఓట్లపై ఆయ‌న న‌మ్మ‌కంగా ఉన్నారు. అభివృద్ధి చేయ‌గ‌లిగార‌నే పేరు కూడా ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. అయితే, కుటుంబ‌స‌భ్యుల పెత్త‌నం పెర‌గ‌డం, కొంద‌రు నేత‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం జితేంద‌ర్ గౌడ్ కు మైన‌స్ గా మారింది.

జ‌నసేన ఓట్లు చీల్చినా…

వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట‌రామిరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో కొంత సానుభూతి ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో 45 వేలు ఉన్న ముస్లిం ఓట్లతో వైసీపీకి మొగ్గు ఉంటుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. రెడ్డి, ఎస్సీ ఓట్లు కూడా వైసీపీకి ఎక్కువ‌గా ప‌డే అవ‌కాశం ఉంది. గ‌త ఎన్నిక‌ల కంటే ఈసారి వైసీపీ బ‌ల‌ప‌డటం ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. దీంతో వెంక‌ట‌రామిరెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. పోలింగ్ స‌ర‌ళి కూడా త‌మ‌కే అనుకూలంగా ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు న‌మ్ముతున్నారు. జ‌న‌సేన అభ్య‌ర్థి మ‌ధుసుద‌న్ గుప్తా కూడా భారీగా ఓట్లు చీల్చే అవ‌కాశం ఉంది. ఆయ‌న ఆర్థికంగానూ బ‌లంగా ఉండ‌టం, 2009లో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన అనుభ‌వం, నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌రిచ‌యాలు ఉండ‌టం ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. అయితే, ఆయ‌న ఓట్లు చీల్చినా గెలుపోట‌ములు మాత్రం వైసీపీ, టీడీపీ మ‌ధ్యే ఉండే అవ‌కాశం ఉంది. విజ‌యావ‌కాశాలు వైసీపీకే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News