పని గట్టుకుని మరీ…ఎందుకో?

అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్షకుమార్ దూకుడు త‌గ్గలేదు. ఇటీవ‌లే ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. కోర్టు ప్రాంగ‌ణంలో కూల‌గొడుతున్న భ‌వ‌నాల‌కు సంబంధించిన కేసులో అక్కడి అధికారిని [more]

Update: 2020-02-10 02:00 GMT

అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్షకుమార్ దూకుడు త‌గ్గలేదు. ఇటీవ‌లే ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. కోర్టు ప్రాంగ‌ణంలో కూల‌గొడుతున్న భ‌వ‌నాల‌కు సంబంధించిన కేసులో అక్కడి అధికారిని కులం పేరుతో దూషించార‌ని, చేయి కూడా చేసుకోబోయార‌ని ఆయ‌న‌పై కేసులు న‌మోదయ్యాయి. వీటికి తోడు గ‌తంలో న‌మోదైన కేసులు కూడా తిర‌గ‌దోడిన పోలీసులు మొత్తానికి హ‌ర్షకుమార్‌ను జైలుకు పంపారు. అయితే, ఇటీవ‌లే బెయిల్‌పై విడుద‌లైన మాజీ ఎంపీ హ‌ర్షకుమార్ త‌న దూకుడు త‌గ్గించుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆయ‌న వ్యూహం చూస్తే.. గ‌తానిక‌న్నా ఎక్కువ‌గానే ఆయ‌న జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రభుత్వాన్ని ద‌ళిత వ్యతిరేకి స‌ర్కారుగా ముద్ర వేసేందుకు ఆయ‌న ప్రయ‌త్నిస్తున్నార‌న్న చ‌ర్చలు కూడా ఏపీ రాజ‌కీయాల్లో ప్రారంభ‌మ‌య్యాయి.

జగన్ ను టార్గెట్ చేస్తూ….

స‌రే! రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టి ఎవ‌రూ ఎవ‌రీకి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేకున్నా.. హ‌ర్షకుమార్ దూకుడు చూస్తే ఏదో వ్యూహం ప్రకారం సాగుతోంద‌నే భావ‌న క‌లుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్‌తో ఆయ‌న‌కు పెద్దగా శ‌తృత్వం ఏమీ లేదు. అయినా కూడా జ‌గ‌న్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్‌ సీఎం అవ్వడానికి అర్హత ఏంటి? కేవలం వైఎస్‌ కొడుకు కావడమేనా? వైఎస్‌ వివేకానందరెడ్డితో ఎంపీగా రాజీనామా చేయించేందుకు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.. కొట్టాడు. మా నాన్న ఇచ్చిన పదవి.. నీవు రాజీనామా చేస్తే నేను ఎంపీని అవుతానన్నాడు.. ఈ విషయాలన్నీ వివేకా సోనియాగాంధీకి చెప్పారు. ఆయన హత్య విషయంలో జగన్‌ కుటుంబ సభ్యుల ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణ ఎందుకు వేయరు? అని హ‌ర్షకుమార్ ఇప్పుడు స‌రికొత్త గ‌ళం వినిపిస్తున్నారు.

పరిటాల రవి హత్య కేసులో….

అంతేకాదు, ఎప్పుడో ఏళ్లనాడు జ‌రిగిన‌ పరిటాల రవి హత్య వ్యవహారంలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు జగనే అందించాడని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ విషయాన్ని ఆ కేసు కుట్రదారు, ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 12 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న కొండారెడ్డే త‌న‌తో చెప్పాడ‌ని హ‌ర్షకుమార్ అన‌డం సంచ‌ల‌నంగా మారింది. పరిటాల హత్యకేసులో ముద్దాయి మొద్దు శీను బయటకు వస్తే అన్ని విషయాలు తెలిసిపోతాయని అతడిని జైలులోనే చంపించారు అని హర్షకుమార్‌ ఆరోపించారు. దీంతో హ‌ర్షకుమార్ ఇలా ఎందుకురెచ్చిపోతున్నారు ? జ‌గ‌న్‌పై ఆయ‌న‌కు ఎందుకు అంత క‌సి ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

వెయిట్ చేయకుండా….

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు కూడా హ‌ర్షకుమార్ ఏమీ వైసీపీ టికెట్ ఆశించ‌లేదు. వైసీపీలో చేరేందుకు కూడా ఆయ‌న అంగీక‌రించ‌లేదు. అయితే ఆయ‌న టీడీపీ సీటు ఆశించి ఆ పార్టీలో చేరి బాబు కాళ్లకు సైతం మొక్కి తీవ్ర విమ‌ర్శల‌కు గుర‌య్యారు. త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ, ప‌నిగ‌ట్టుకుని ఇప్పుడు ఇంత జోరుగా విమ‌ర్శలు చేయ‌డం వెనుక మ‌రో ప్రతిప‌క్షం ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా తాను ద‌ళితుడిని కాబ‌ట్టి ఏమ‌న్నా చెల్లుంద‌ని ఆయ‌న అనుకుంటున్నారా? అనే సందేహం కూడా వ‌స్తోంది. కానీ, హ‌ర్షకుమార్ వైఖ‌రిపై ద‌ళితులే విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఆయన త‌న ఉనికిని కాపాడుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు త‌ప్ప.. మరేమీలేద‌ని అంటున్నారు. మ‌రి హ‌ర్షకుమార్ వ్యూహం ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..!

Tags:    

Similar News