హార్థిక్ కు కలసి రావడం లేదే…?

పటీదార్ ఉద్యమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీపై మాత్రం స్పష్టత రాలేదు. నామినేషన్లకు ఇంకానాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో హార్థిక్ పటేల్ పోటీ చేస్తారా? [more]

Update: 2019-03-31 18:29 GMT

పటీదార్ ఉద్యమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీపై మాత్రం స్పష్టత రాలేదు. నామినేషన్లకు ఇంకానాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో హార్థిక్ పటేల్ పోటీ చేస్తారా? లేదా…? అన్నది అనుమానంగానే ఉంది. ఆయనపై 2015లో పాటిదార్ల ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. నేర నిర్ధారణపై స్టే ఇవ్వలేదు. నేరం రుజువైన వారు పోటీకి అనర్హులు. గుజరాత్ హైకోర్టు మాత్రం నేరనిర్థారణపై స్టే ఇవ్వకపోవడం, సుప్రీంకోర్టుకు వెళదామన్నా సమయం లేకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉంటారంటున్నారు.

పోటీకి దూరంగా…..

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. పాటిదార్ల నుంచి కాంగ్రెస్ కు ఓట్లు రావడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చుక్కుల చూపించింది. బీజేపీ కంచుకోటగా ఉన్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో కాంగ్రెస్ పాగా వేయగలిగింది. మొత్తం 54 సీట్లలో 30అసెంబ్లీ స్థానాలను హస్తం పార్టీ చేజిక్కించుకోగలిగింది. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో ప్రభావం చూపగలదని అంచనా వేస్తున్నారు.

పాటీదార్లు కాంగ్రెస్ వైపేనా…?

కాంగ్రెస్ బలం పెరగడంతో పాటు ఇటీవల పాటీదార్ల ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. పాటీదార్లు సంప్రదాయంగా భారతీయ జనతా పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాటీదార్లు కాంగ్రెస్ కు అండగా నిలిచారు. ఈ ఎన్నికల్లోనూ పాటీదార్లు తమకు అండగా ఉంటారని హస్తం పార్టీ భావిస్తోంది. అందుకే నేరుగా హార్థిక్ పటేల్ కు కాంగ్రెస్ కండువా కప్పేసింది.

మోదీని దెబ్బతీయాలంటే…

మోదీ సొంత రాష్ట్రంలోనే దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇక్కడ ఎలాంటి పొత్తు సమస్యలు లేకపోవడం దానికి కలసి వచ్చే అంశంగా చెప్పాలి. హార్ధిక్ పటేల్ ను ముందు పెట్టి ఎన్నికల ప్రచారం చేయాలని భావించింది. అందుకే హార్థిక్ బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పటికీ హార్థిక్ పోటీ చేస్తారా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. అయితే తాను కేసుల దృష్టిలో పోటీ చేయకపోయినా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తానని హార్థిక్ చెబుతున్నారు. మొత్తం మీద హార్థిక్ పటేల్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనా…?

Tags:    

Similar News