ఫ్యామిలీ… పాచ్ అప్

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఈటల రాజేందర్ అడుగు బయటపెట్టడం మరిన్ని పరిణామాలకు దారితీయవచ్చునేమో అని రాజకీయ వర్గాలు భావించాయి. పార్టీలో చాలా కాలంగా అసంతృప్తి పేరుకు [more]

Update: 2021-06-15 15:30 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఈటల రాజేందర్ అడుగు బయటపెట్టడం మరిన్ని పరిణామాలకు దారితీయవచ్చునేమో అని రాజకీయ వర్గాలు భావించాయి. పార్టీలో చాలా కాలంగా అసంతృప్తి పేరుకు పోయి ఉంది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఇతర నాయకులెవరికీ పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. మంత్రులు సైతం తమ శాఖల్లో స్వతంత్రంగానిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. నియోజకవర్గాల్లో చోటామోటా నాయకులకు పనులు చేసి పెట్టేందుకు ఎమ్మెల్యేలు సాహసించడం లేదు. తమపై అవినీతి ముద్ర పడుతుందేమోననే భయం వారిని వెన్నాడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి నాయకునిపైనా ప్రభుత్వ నిఘా కొనసాగుతోంది. 2023లో ఎన్నికలకు వెళ్లేనాటికి పార్టీ క్లీన్ చిట్ తో ప్రజల ముందు నిలవాలనేది కేసీఆర్ లక్ష్యం. ఎమ్మెల్యేలు, మంత్రులు దీనికి గండి కొట్టకుండా వారి నియోజకవర్గాలు, శాఖల నుంచి అంతర్గత సమాచారాన్ని కేసీఆర్ సేకరిస్తున్నారు. తమ ముందరి కాళ్లకు బందం వేసినట్లుగా నాయకులు భావిస్తున్నారు. అయితే వారి కనుల ముందు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. సమస్యలు చెప్పుకోవడానికి నాయకులకు కేసీఆర్ అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రాజేందర్ ఉదంతం చోటు చేసుకోవడం , దాని ప్రకంపనలు కొన్ని వారాల పాటు కొనసాగడంతో టీఆర్ఎస్ లో కదలికలు రావచ్చని అంచనా వేశారు. కానీ టీ కప్పులో తుపానులా పార్టీ పరంగా విషయం చల్లబడి పోయింది. ‘ఫ్యామిలీ పాచ్ అప్’తో మొత్తం ఉదంతం ఎటువంటి ఒడుదొడుకులు లేకుండానే జావగారిపోయింది.

ఫలించిన నిరీక్షణ…

కేసీఆర్ తర్వాత పార్టీలో హరీశ్ రావు చాలా కాలంపాటు రెండో స్తానంలో కొనసాగారు. నిజానికి ఉద్యమం మొదలైన ఆరేడు సంవత్సరాల వరకూ కేటీఆర్, కవిత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం వహించలేదు. తొలి నుంచి అండగా నిలిచింది హరీశ్ మాత్రమే. కేసీఆర్ కూడా మేనల్డుడికి సముచిత ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే 2009లో మహా కూటమి పరాజయం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హరీశ్ పార్టీని విడిచిపెట్టేస్తారనే ప్రచారం సాగింది. రెండో సారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ లో ద్వితీయ స్తానంలో ఉన్న హరీశ్ కు మంచి ఆఫర్ ఇచ్చారనే విషయం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వై.ఎస్. దుర్మరణం తో ఎటువంటి కదలికలు జరగలేదు. తనపై వచ్చిన వదంతులను పుకార్లుగా హరీశ్ కొట్టిపారవేశారు. కానీ అప్పట్నుంచి కేసీఆర్ దగ్గర ఆయన ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో ఈటల రాజేందర్, కేటీఆర్ కు పార్టీలోనూ, ఉద్యమంలోనూ ప్రాముఖ్యం పెరిగింది. తన విధేయతను నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు హరీశ్. అయినప్పటికీ పార్టీలో అతనికున్న బలం దృష్ట్యా అనుమానాస్పద దృక్పథంతోనే చూస్తూ వచ్చారు కేసీఆర్. తన కుమారుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి హరీశ్ సహనానికి పరీక్ష పెట్టారు. అయినా విదేయంగానే ఉంటూ వచ్చారు. ఈటల ఉదంతం మరోసారి విధేయతను చాటుకునే సందర్భంగా కలిసి వచ్చింది. కుటుంబమంతా ఒకటేననే సంకేతాలను హరీశ్ పంపగలిగారు. ఈటల రాజేందర్ తనపై చేసిన అభియోగాలను ఖండించడంతోపాటు తాను చివరి క్షణం వరకూ టీఆర్ఎస్ లో ఉంటానని, కేసీఆర్ కు విధేయుడిగా ఉంటానని నిర్ద్వంద్దంగా ప్రకటించారు.

ప్రభుత్వంలో పెద్ద పీట…

హరీశ్ సైతం కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ ఈటల రాజేందర్ గాలం వేయడానికి ప్రయత్నించారు. తన భుజాలపై తుపాకి పెట్టి కాల్చాలనుకుంటే కుదరదని విస్పష్టంగా హరీశ్ తేల్చేశారు. ఎదురుదాడి చేశారు. పార్టీకి అండగా నిలిచారు. రాజేందర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల సమన్వయానికి తన వంతు బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్దమయ్యారు. అతని ప్రాముఖ్యాన్ని గుర్తించిన కేసీఆర్ తిరిగి అతనికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. నిజానికి గడచిన ఏడాది కాలంగా హరీశ్ పెద్దగా యాక్టివ్ గా లేరు. మంత్రిగా ఉన్నప్పటికీ తన పనేదో తాను చూసుకుని వెళ్లిపోతున్నారు. ఎక్కువగా నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. తనను తాను కుదించుకున్నారు. దుబ్బాక ఎన్నికను బలవంతంగానే తప్పనిసరి బాధ్యతగా తీసుకున్నారు. పరాజయం తర్వాత మళ్లీ యాక్టివిటీ తగ్గించేశారు. ఈ పరిస్థితుల్లో రాజేందర్ ఉదంతం తర్వాత హరీశ్ చురుకుగా మారాలని కేసీఆర్ నిర్ణయించారు. అన్నిటా యాక్టివ్ గా ఉండాల్సిందిగా ఆదేశించినట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఢి్ల్లీ స్థాయిలో సమీక్షలు, కేంద్రమంత్రులతో మంతనాలు, రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం వంటి బాధ్యతలను స్వీకరించారు. తనపై రాజేందర్ వేసిన ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.

రాజకీయ తురుపు ముక్క..

టీఆర్ఎస్ ఫస్టు ఫ్యామిలీ కేసీఆర్ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని హరీశ్ తన మాటలు, చేతల ద్వారా క్యాడర్ కు స్పష్టమైన సంకేతాలే పంపించారు. అందుకే ఎక్కడా ఈటల ప్రభావం పార్టీపై కనిపించలేదు. ఉద్యమ కాలం నుంచి రాష్ట్రంలోని ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో హరీశ్ కు బలమైన అనుచర వర్గం ఉంది. వారికి కావాల్సిన పనులన్నీ ఎప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటాడు. అందువల్ల పార్టీలో ప్రత్యేకించి పైకి చెప్పకపోయినా హరీశ్ అనుచర వర్గం అన్న ముద్ర బహిరంగ రహస్యమే. అందుకే ఇతర రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ ను హరీశ్ ను విడదీయాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయి. అతను బయటికి వస్తే టీఆర్ఎస్ అధినేత నైతికంగా బలహీనపడతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి ఆఫర్లతో కాంగ్రెసు, బీజేపీ హరీశ్ కు అనేకసార్లు గాలం వేసేందుకు ప్రయత్నించినా ఆయన చిక్కలేదు. తాజాగా మరోసారి బీజేపీకి భంగపాటు ఎదురైంది. ప్రస్తుతం రాజకీయ విమర్శల విషయంలో హరీశ్ ను కమల దళంపై అస్త్రంగా ప్రయోగించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇందులో బాగంగానే హరీశ్ కేంద్రంపై ఆరోపణాస్త్రాలను ముమ్మరం చేశారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News