“కులం” మంటలతో చలి కాచుకుంటుంటే..?

బెజ‌వాడ‌లో ఈ నెల 9న జ‌రిగిన అగ్ని ప్రమాదం ఘ‌ట‌న రాజ‌కీయంగానే కాకుండానే.. కులం ప‌రంగా కూడా యుద్దానికి కార‌ణ‌మ‌వుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విజ‌య‌వాడ న‌గ‌రంలో [more]

Update: 2020-08-23 08:00 GMT

బెజ‌వాడ‌లో ఈ నెల 9న జ‌రిగిన అగ్ని ప్రమాదం ఘ‌ట‌న రాజ‌కీయంగానే కాకుండానే.. కులం ప‌రంగా కూడా యుద్దానికి కార‌ణ‌మ‌వుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విజ‌య‌వాడ న‌గ‌రంలో బ‌స్ స్టేష‌న్‌కు స‌మీపంలో ఉన్న సర్ణ ప్యాలెస్ హోట‌ల్‌ను స్థానిక కార్డియాల‌జిస్ట్‌.. ర‌మేష్ కార్డియాక్ సెంట‌ర్ అధినేత‌.. ర‌మేష్‌బాబు.. కోవిడ్ కేర్ సెంట‌ర్ కోసం రెంట్ కు తీసుకున్నారు. రాష్ట్రంలో కేసులు పెరిగిపోయిన నేప‌థ్యంలో ఆసుప‌త్రులు చాల‌ని నేప‌థ్యంలో ప్రభుత్వమే ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను ప్రోత్సహించి పెయిడ్ ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన మాట వాస్తవం.

ప్రమాదం జరిగిన తర్వాత….

ఈ క్రమంలో అనేక మంది కార్పొరేట్ వైద్య శాల‌లు ఉన్నవారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి వారిలో పోతినేని ర‌మేష్ కూడా ఒక‌రు. ఈయ‌న స్వర్ణప్యాలెస్‌లో కొంత భాగాన్ని కొవిడ్ కేర్ సెంట‌ర్‌గా మ‌లుచుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అనుమ‌తులు పొందారు. కానీ, అగ్నిప్రమాదం జ‌రిగిన త‌ర్వాత.. ఇక్కడి లోపాలు వ‌రుస‌గా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అగ్నిప్ర‌మాదం జ‌రిగితే.. త‌ప్పించుకునేందుకు కూడా అవ‌కాశం లేకుండా హోట‌ల్ నిర్మించార‌నేది ప్రధాన అభియోగం. ఇక‌, ఎప్పుడో ఏళ్ల కింద‌ట నిర్మించిన హోట‌ల్ కావ‌డంతో విద్యుత్ వ్యవ‌స్థ నాశిర‌కంగా ఉంద‌ని దీనిని ప‌ట్టించుకోకుండా ర‌మేష్ ఇక్కడ కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేశారని, అందుకే ప్రమాదం జ‌రిగింద‌నేది ప్రభుత్వ అధికారుల వాద‌న‌.

కులం రంగు పులిమి…..

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. విద్యుత్ వ్యవ‌స్థలో లోపాల‌ను స‌రిదిద్దుకోకుండా ర‌మేష్ బాబు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేయాల్సిందేన‌ని.. కొంద‌రు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ఈ విష‌యానికి కులం రంగు పులుము కోవ‌డ‌మే అత్యంత విచార‌క‌ర‌మ‌నే వాద‌న బ‌య‌టకు వ‌స్తోంది. ప్రభుత్వంలోని కొంద‌రు కీల‌క నేత‌లు.. ఈ ఘ‌ట‌న గురించి మాట్లాడుతూ.. డాక్టర్ ర‌మేష్‌బాబు చౌద‌రి అంటూ.. వ్యాఖ్యానించారు. కానీ, గ‌తంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆసుప‌త్రి నిర్వహించిన‌ప్పటికీ.. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తి అని ఎవ‌రికీ తెలియ‌దు. ఈ ఘ‌ట‌న‌ను కులానికి ఆపాదించి రాజ‌కీయంగా మ‌లుచుకుంటున్నారా ? అనే సందేహాల‌కు ప్రభుత్వంలోని కొంద‌రు ఛాన్స్ ఇచ్చారు.

రామ్ వాదన సమర్థనీయమే…

ఇక‌, దీనిపై స్పందించిన సినీ హీరో.. డాక్టర్ ర‌మేష్‌కు బంధువు కావడంతో రామ్‌.. కూడా కులం ప్రాతిప‌దిక‌నే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో హెరెత్తి పోవడం మ‌రింత నివ్వెర క‌లిగించింది. గ‌తంలో ఇక్కడ ప్రభుత్వం ఎన్నారైల‌కు క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసింది. అప్పట్లోనే ప్రమాదం జ‌రిగి ఉంటే.. ఎవ‌రు బాధ్యులు అన్న రామ్ వాద‌న స‌మ‌ర్ధనీయ‌మే అయినప్పటికీ.. కులం ప్రస్థావ‌న తీసుకువ‌చ్చి.. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేయ‌డం స‌రికాద‌నేది మ‌రో వాద‌న‌. ఇక‌, దీనికి చంద్రబాబు కూడా తోడ‌య్యారు. స్వేచ్ఛను హ‌రిస్తోందంటూ.. ఆయ‌న ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పించారు.

కారణం ఏదైనా.. ఎంతటి వారైనా….

జ‌రిగిన ప్రమాదంలో ప‌ది మంది చ‌నిపోయారు. ఈ దారుణ సంఘ‌ట‌నకు బాధ్యులు ఎవ‌రు అయినా.. ఎంత‌టి వారు అయినా వారిపై చ‌ర్యలు త‌ప్పకుండా తీసుకోవాలి. ఇక‌, ఇప్పుడు ఈ ఘ‌ట‌న అటు తిరిగి ఇటు తిరిగి కులాల చిచ్చుగా మారిపోవ‌డం స‌మ‌జసంగా లేద‌నేది వాస్తవం. నిజాలు బ‌య‌ట‌కు తీసి.. త‌ప్పు ఎవ‌రిదైతే వారిని చ‌ట్టం ముందు నిల‌బెట్టడమే స‌రైంది త‌ప్ప.. కులాల ప్రాతిప‌దిక‌న వివాదాలు లేవ‌దీస్తే.. రేపు మ‌రో సామాజిక వ‌ర్గానికి చెందిన ఆసుప‌త్రిలో ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తే.. అప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించుకునేందుకు పెద్ద క‌ష్టం కాదు.

Tags:    

Similar News