అందులో కూడా ఇద్దరూ అన్నదమ్ములే

విభజన తరువాత తేలిందేంటి అంటే తెలంగాణా సంపన్న రాష్ట్రం అని. ఏపీ అప్పటికే 90 వేల కోట్ల అప్పుతో విడిపోయింది. ఇక ఏపీలో విశాఖ తప్ప మెట్రో [more]

Update: 2020-07-19 11:00 GMT

విభజన తరువాత తేలిందేంటి అంటే తెలంగాణా సంపన్న రాష్ట్రం అని. ఏపీ అప్పటికే 90 వేల కోట్ల అప్పుతో విడిపోయింది. ఇక ఏపీలో విశాఖ తప్ప మెట్రో సిటీ ఒక్కటీ లేదు. అదే విధంగా విభజనతో ఏపీ పూర్తిగా వ్యవసాయిక ఆధారిత రాష్ట్రం అయిపోయింది. పారిశ్రామికంగా వెనకడుగు వేస్తోంది. దాంతో ఏపీ మొత్తాన్ని పోషించే సత్తా వ్యవసాయ రంగానికి లేదు. దాంతో ఏపీ అన్ని విధాలుగా అభివృధ్ధిలో వెనకడుగు వేస్తోంది. దానికి తోడు కొత్తగా రాజధాని కట్టుకోవాల్సిరావడం, గత అయిదేళ్ళ టీడీపీ పాలనలో వారి ప్రయారిటీలు అన్నీ ఒక ఎత్తు. ఇక ఇపుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ చేతికి ఎముక లేకుండా ఇస్తున్న సంక్షేమ పధకాలతో కూడా ఏపీ అనేక రకాలుగా ఇబ్బందుల్లో పడుతోంది. మొత్తానికి ఈ రోజుకు చూసుకుంటే ఏపీ అప్పుల కుప్పగా నిలిచింది.

అందులోనే ముందు …..

రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విషయంలో పోటీ పడకపోయినా కూడా అప్పుల్లో మాత్రం చాలా జోరుగా ఉన్నాయి. రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా వివరాలా ప్రకారం చూసుకుంటే భారీ ఎత్తున అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ మూడవ స్థానంలో ఉంటే తెలంగాణా ఆరవ స్థానంలో ఉంది. గత ఏడాది తెలంగాణా తొమ్మిదవ స్థానంలో ఉంటే ఏపీ ఆరవ స్థానంలో ఉంది. అంటే ఇది అప్పుల్లో ఎదుగుదలగా భావించాలన్న మాట. ఏపీ 42 శాతం అప్పులభారంతో కూనరిల్లుతూంటే, తెలంగాణా 38 శాతంతో పక్కనే ఉంది.

తప్పు కాదు…..

సరే అప్పు చేయడం కూడా అభివృధ్ధికి ఒక సంకేతం అని ప్రగతికాముకులు భావిస్తారు. అంటే తెచ్చిన అప్పులతో శాశ్వత ప్రాతిపదికన కార్యక్రమాలు చేపడితే, దాని వల్ల ఇప్పటితరాలు, భావి తరాలు బాగుపడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. కానీ ఇక్కడ అలా జరుగుతోందా అన్నది ప్రశ్న. ఎందుకంటే శనగలు తిని చేతులు కడిగిన చందంగా ఈ అప్పులు తాత్కాలిక ప్రయోజనాల కోసం తెస్తున్నారని అంటున్నారు. ఏపీలో అయితే సంక్షేమానికి అప్పులు చేయడం ఆర్ధిక వేత్తలు కూడా తప్పు పట్టేలా ఉంది. తెలంగాణా వంటి సంపన్న రాష్ట్రానికి అప్పులు ఎందుకు అన్న వాదనను అక్కడి విపక్షాలు ముందుకు తెస్తున్నాయి.

భారమేనా …?

ఇదే తీరున అప్పులు చేసుకుంటూ పోతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు అది పెను భారమై కూర్చుకుంటుంది. తెలంగాణాలో ఆరేళ్ళుగా ఒకే సర్కార్ అధికారంలో ఉంది. అదే ఏపీలో చూసుకుంటే అయిదేళ్ళు తెలుగుదేశం పాలనలో దాదాపుగా రెండున్నర లక్షల అప్పులు చేశారని వైసీపీ విమర్శలు చేసింది. ఇపుడు చూస్తే గత మూడు నెలల వ్యవధిలో ఏపీ సర్కార్ పది వేల కోట్లు అప్పు తెచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇదే తీరులో సాగితే ఆంధ్రాకు ప్రమాదమేనని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. తెలంగాణాలో అప్పులు చేసి ప్రాజెక్టులు కడుతున్నామని చెబుతున్నారు. మరి అదే నిజం అయితే ఆ అప్పు సబబేనని అనుకోవాలి. ఏది ఏమైన శక్తికి మించి లక్షల కోట్లు అప్పులు చేయడం రెండు చిన్న రాష్ట్రాలుగా విడిపోయిన ఏపీ, తెలంగాణలకు మంచిది కాదేమో.

Tags:    

Similar News