సన్న గీత చెరిగిపోతోందా ?

భారత రాజ్యాంగాన్ని రాసిన అంబెద్కర్ వంటి మహనీయులు ముందు కాలాన్ని మరీ ఎక్కువగా అంచనా వేయలేక పోయి ఉండవచ్చునేమో. అందుకే విచక్షణ అన్న దానికే మన రాజ్యాంగంలో [more]

Update: 2020-10-09 15:30 GMT

భారత రాజ్యాంగాన్ని రాసిన అంబెద్కర్ వంటి మహనీయులు ముందు కాలాన్ని మరీ ఎక్కువగా అంచనా వేయలేక పోయి ఉండవచ్చునేమో. అందుకే విచక్షణ అన్న దానికే మన రాజ్యాంగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని కీలకమైన స్థానాల్లో ఉన్న వారు తీసుకునే నిర్ణయాలను కనీసం ప్రశ్నించే అవకాశం అధికారం ఈ దేశ పౌరులకు లేకుండా పోయింది. మనది అచ్చమైన ప్రజాస్వామ్యం అనుకున్నపుడు ప్రజల చేతిలో అంతిమ అధికారం దఖలు పడాలి. అలా కాని నాడు అది పూర్తి ఎప్పటికీ కాదు.

మూల స్థంభాలు అవే….

మన ప్రజాస్వామ్యం సజావుగా నడవాలంటే శాసనవ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ కచ్చితంగా పనిచేయాలి. ఈ వ్యవస్థల మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంది. వాటి పరిధులు కూడా సక్రమంగా రాజ్యాంగ నిర్మాతలు నిర్వచించారు. కానీ ఆచరణలో కాల పరీక్షకు అవి ఎంతవరకూ నిలబడతాయి అన్నదే ఊహించలేకపోయారు. ఏ వ్యవస్థ అయినా నడిచేది మనుషులతోనే. మరి మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు మారుతున్నాయి. కాలంతో పాటుగా విలువలూ మారుతున్నాయి. దానికి తగినట్లుగా ఇపుడు వ్యవస్థల మధ్యన సన్నని రేఖ చెదిరిపోతోందని మేధావులు అంటున్నారు.

సర్వం రాజకీయం….

రాజకీయ ఆధిపత్యం పెరిగిపోయిన వర్తమాన కాలంలో అంతా అదే శాసిస్తోంది. కార్యనిర్వహణ వ్యవస్థ మీద అయిదు దశాబ్దాల నుంచే నెమ్మదిగా ఆరోపణలు మొదలయ్యాయి. ఆ పట్టిన చెదలు ఇపుడు పెరిగి పెద్దవయ్యాయి. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు స్థానం ఎక్కడ ఉందో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. ఈ నేపధ్యంలో స్వతంత్రంగా ఉండాల్సిన ఈ రెండు వ్యవస్థలు కలగాపులగం అయిపోతున్నాయి. ఇపుడు జనాలకు న్యాయ వ్యవస్థ మీదనే ఇంకా నమ్మకం ఉంది. దానికి పెంచిపోషించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది.

జనాలకే అధికారం ….

ముందే చెప్పుకున్నట్లుగా శాసన వ్యవస్థలో తప్పు రాజ్యాంగ పరంగా జరిగితే దానిని సరిదిద్దాల్సిన బాధ్యత కచ్చితంగా న్యాయ వ్యవస్థ మీదనే ఉంది. అదే సమయంలో ప్రభుత్వ విధానాల మీద ప్రజలు డేగ కళ్లతో ఎపుడూ చూస్తుంటారు. ఈ దేశంలోని ఓటర్లలో ఇంకా నలభై శాతం నిరక్షరాస్యులే ఉన్నారు. అయినా వారు అయిదేళ్ళలో పాలన బాగులేకపోతే నిర్దాక్షిణ్యంగా మార్చేస్తారు. ఎవరు వత్తిడి కూడా వారి మీద పడదు, అదే ఇండియాలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎంతటి పెద్దలైనా జనం ఓటు వేటుకు ఇంటికి వెళ్లాల్సిందే. అందువల్ల ప్రభుత్వాలు ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎవరికీ ఎటువంటి చింత అవసరం లేదు. అదే సమయంలో అయిదేళ్ల పాటు పాలన చేయడానికి ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇచ్చారన్నది ఎవరూ మరవరాదు.

బాధపడుతున్నారా…?

ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య కోర్టుల్లో వరసగా వైసీపీ సర్కార్ కి మొట్టికాయలు పడుతున్నాయి. దీని మీద వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. వాటి విషయంలోనే కాదు, పాలనకు సంబంధించి దైనందిన వ్యవహారాల్లో ఏ వ్యవస్థ అధిక జోక్యం తగదని అంటున్నారు. తాము ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చామని, వారికే జవాబుదారీ అని ఆయన అంటున్నారు. మరి దీని మీద అంతా ఆలోచన చేయాలి. వ్యవస్థలను మనమే కాపాడుకోవాలి. రాజ్యాంగం నిర్వచించిన మేరకు ప్రతీ వ్యవస్థ తన విధులను ప్రజల కోసం నిర్వహించాలి. అపుడే సన్నని గీత చెదిరిపోకుండా ఉంటుంది.

Tags:    

Similar News