కేంద్రం ‘ఊ..’అంటుందా..?
ఒకరికి సవాల్. మరొకరికి అవకాశం. ఏపీ ఆత్మాభిమానానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కును తెగనమ్మేయడానికి కేంద్రం వేగంగానే పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి [more]
ఒకరికి సవాల్. మరొకరికి అవకాశం. ఏపీ ఆత్మాభిమానానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కును తెగనమ్మేయడానికి కేంద్రం వేగంగానే పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి [more]
ఒకరికి సవాల్. మరొకరికి అవకాశం. ఏపీ ఆత్మాభిమానానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కును తెగనమ్మేయడానికి కేంద్రం వేగంగానే పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని చెప్పేస్తోంది. ఒకవైపు ఉద్యమాలు, ఆందోళనలు సాగుతున్నప్పటికీ విధానపరమైన నిర్ణయంగా తేల్చేస్తోంది. ప్రయివేటీకరించమంటారా? మూసేయమంటారా? రెండే ఆప్షన్లు అని ఇప్పటికే స్పష్టం చేసేసింది. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాలు వేడి రగిలిస్తాయి. కానీ ఫలితం ఇస్తాయన్న నమ్మకం లేదు. ప్రత్యామ్నాయం సూచిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రయివేటీకరణ కు ప్రత్యామ్నాయంగా కంపెనీ అప్పులను ఈక్విటీలుగా మార్చమన్నారు. సంస్థ ఖాళీ స్థలాలను రియల్ ఎస్టేట్ తరహాలో డెవలప్ మెంట్ మోడల్ లో ఆదాయం ఆర్జించి బయటపడవచ్చుననేది సీఎం సూచన సారాంశం. నిజానికి ఉక్కు పరిశ్రమ లాభనష్టాలతో కేంద్ర నిర్ణయానికి సంబంధం లేదు. ప్రయివేటీకరణకు అది కారణం కూడా కాదు. ఈ రంగం నుంచి కేంద్రం తప్పుకోవాలనుకుంటోంది. నష్టాలను సాకుగా చూపి ఎంతో కొంత సొమ్ము చేసుకుని వదిలించేసుకోవాలనుకుంటోంది. యజమానిగా కేంద్రం వ్యవహరిస్తున్నప్పటికీ ఈ భూమి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సేకరించింది. అందువల్ల ఎవరో ఒకరికి అప్పనంగా తక్కువకే విక్రయించకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. అవసరమైతే తానే రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొందరు సూచిస్తున్నారు.
భలే చాన్సులే..
22 వేల ఎకరాల భూమి కంపెనీతో సహా దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు విలువ కట్టారు. కంపెనీని పక్కనపెట్టినా భూమి విలువే లక్షాయాభై వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ఈ స్థితిలో ఎవరో ప్రయివేటు వ్యక్తులు, కంపెనీలకు ధారాదత్తం చేయకుండా కాపాడుకోవాలి. సమర్థ నిర్వహణ తెలియని కంపెనీలు వస్తే నాలుగైదేళ్ళు తూతూ మంత్రంగా నడిపి ఉద్యోగులకు పరిహారం చెల్లించి మూసేయడం ఖాయం. భూమి విలువ అప్పటికి మరింతగా పెరుగుతుంది. దానిని విక్రయించుకుని లక్షల కోట్ల లో లాభపడతారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే రాష్ట్రప్రభుత్వమే బాధ్యత స్వీకరించాలి. కంపెనీకి ఉన్న ఆస్తి, అప్పు, కేంద్ర ప్రభుత్వ మదింపును పరిగణనలోకి తీసుకుంటే అదనంగా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రయోజనం రాష్ట్రానికి సమకూరుతుంది. ఈ దిశలో ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన మొదలుపెట్టినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కానీ సీఎం లేఖ ప్రకారం చూస్తే రియల్ ఎస్టేట్ తరహా మోడల్ లో స్వీకరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ప్రయివేటు వ్యక్తులకు, ప్రభుత్వానికి తేడా ఉండదు. విశాఖ పట్నం లో రాజధానిని నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి నగరంలో ఒకే చోట 22 వేల ఎకరాల భూమి లభించడమంటే మాటలు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు పోసినా భూ సేకరణ సాధ్యం కాదు. అందువల్ల ఈ భూమి ప్రభుత్వానికి అసెట్ గా మారుతుంది. అయితే రియల్ ఎస్టేట్ తరహాలో ఏవో నిర్మాణాలు కట్టి విక్రయించి సొమ్ములు చేసుకోకుండా ఉపాధి మార్గంగా దీనిని మలచాలనేది విశాఖలో మేధావుల సూచన.
సంఘాలతో సమస్యలే…
ట్రేడ్ యూనియనిజం దేశంలో క్రమంగా బలహీనపడుతోంది. సంఘటిత రంగంలోని విశాఖ ఉక్కు వంటి పరిశ్రమల్లో ఇదింకా బలంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినా లాభాల బాట పట్టించడానికి కష్టపడాల్సి వస్తుందంటున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా ట్రేడ్ యూనియన్ల డిమాండ్లు విపరీతంగా పెడుతుంటాయి. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి, విక్రయాల పరంగా సంస్కరణలు ప్రవేశపెట్టాలి. మార్కెట్ లో పోటీదారుగా నిలిపేందుకు చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కార్మిక సంస్కరణలూ చేపట్టాలి. అందుకు ట్రేడ్ యూనియన్లు సహకరించకపోవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. విస్తారమైన లాండ్ బ్యాంక్ ను చూసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేందుకు సన్నద్ధంగానే ఉంది. అయినప్పటికీ సంఘాలతో సమస్యలు వస్తాయని వెనకాడుతున్నారనే ఒక వాదన వినవస్తోంది. కేంద్రం వదిలేసుకుంటే ప్రయివేటు వ్యక్తులు, కంపెనీల పరం చేయడం కంటే రాష్ట్రప్రభుత్వం తీసుకోవడమే ఉత్తమమనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.
ఉపాధికి ఓ నిధి…
విశాఖ ఉక్కును తాను స్వీకరించదలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆలోచన ధోరణి మాత్రం మారాలి. ఇక్కడి భూమిని సొమ్ము చేసుకునేందుకు మాత్రమే తీసుకుంటే అర్థరహితం. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకంటే మౌలిక వసతులు, ఎగుమతి అవకాశాలు, మానవ వనరుల లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంది. భూ వసతి మాత్రం అంత సులభం కాదు. విశాఖ ఉక్కు ప్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే విస్తారమైన భూమి లభిస్తుంది. ఉక్కు ప్యాక్టరీకి 50 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్రంలోనే పెద్దదైన తూర్పుగోదావరి జిల్లా ఉంది. ప్రయివేటు పరిశ్రమలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజునకు భూములు కల్పిస్తే అయిదారు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికీకరణలో వెనకబాటుతనం లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వరంగా మారుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయిన కొరత తీరుతుంది. అందువల్ల కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికీకరణకు ఉపయోగించుకోవచ్చు. వ్యాపారి కోణంలో ఆలోచించి మిగులు స్థలం విక్రయంపై దృష్టి పెడితే రాష్ట్రానికి విశాల ప్రయోజనం చేకూరదు. రాష్ట్రప్రభుత్వానికి బదలాయించేందుకు కేంద్రం ఊ కొడితే రాష్ట్రం సన్నద్ధం కావాలి. తానే ముందస్తు చొరవ తీసుకుని ప్రతిపాదన పెట్టడం సముచితం.
– ఎడిటోరియల్ డెస్క్