ఇమ్రాన్ విజయం సాధించినా…స్పెషాలిటీ ఏమీ లేదట

ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను అభివద్ధి చేయకపోయినా ఆ ప్రాంతంపై పట్టు కోసం ఇస్లామాబాద్ లోని అధికార పార్టీ పరితపిస్తోంటోంది. పాక్ అధికార పీఠాన్ని అధిష్టించే ప్రతి పార్టీ [more]

Update: 2021-08-12 16:30 GMT

ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను అభివద్ధి చేయకపోయినా ఆ ప్రాంతంపై పట్టు కోసం ఇస్లామాబాద్ లోని అధికార పార్టీ పరితపిస్తోంటోంది. పాక్ అధికార పీఠాన్ని అధిష్టించే ప్రతి పార్టీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తుంటోంది. సైన్యం పరోక్ష సహాయంతో ఈ ప్రయత్నంలో విజయవంతమవుతుంటుంది. తాజాగా ఇటీవల జరిగిన పీవోకే ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం సాధించడంలో ప్రత్యేకత ఏమీ లేదు. ఇమ్రాన్ పార్టీ ఇక్కడ గెలవడం ఇదే తొలిసారి. 2016 నాటి ఎన్నికల్లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్ షరీఫ్) విజయం సాధించగా ఈసారి ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ – ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) అధికారాన్ని చేజిక్కించుకుంది. ముందే చెప్పుకున్నట్లు దేశాన్నేలే పార్టీనే పీవోకే లోనూ నెగ్గడం సంప్రదాయంగా వస్తోంది.

పాక్ ఆక్రమిత ప్రాంతంలో…

ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సుల్తాన్ మహమ్మద్ చౌదరి ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనం పీవోకేగా వ్యవహరించే ప్రాంతాన్ని పాకిస్థాన్ అజాదీ కశ్మీర్ గా వ్యవహరిస్తుంది. అజాదీ అంటే భారత్ నుంచి స్వేచ్ఛ పొందిన ప్రాంతమన్నది పాక్ అభిప్రాయం. పాక్ ఆక్రమించిన మరో ప్రాంతమైన గిల్గిత్ – బాలిస్థాన్ లో గత ఏడాది నవంబరు లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పీవోకే చట్టసభలో మొత్తం 53 సీట్లున్నాయి. వీటిల్లో అయిదు సీట్లను మహిళలకు, సాంకేతిక నిపుణులకు మూడు సీట్లను రిజర్వు చేశారు. మిగిలిన 45 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీ ఐ 25 సీట్లు సాధించి స్పష్టమైన మెజార్టీ పొందింది. బిలావల్ భుట్టో నాయకత్వంలోని పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) 11, నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) 6, ముస్లిం కాన్ఫరెన్స్, జమ్ము కశ్మీర్ పీపుల్స్ పార్టీ ఒక్కో సీటు సాధించాయి.

శరణార్థులు కూడా….

పీవోకే ఆవిర్భావం అనంతరం జరిగిన 11వ సార్వత్రిక ఎన్నికలివి. మొత్తం 45 సీట్లలో 33చోట్ల పీవోకే వాసులు ఎన్నికవగా, 12 చోట్ల శరణార్థులు విజేతలుగా నిలిచారు. వివిధ ప్రాంతాల నుంచి పీవోకే కు వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని శరణార్థులుగా పిలుస్తుంటారు. 1947లో దేశ విభజన సందర్భంగా పాక్ తో పాటు, భారత్ లోని జమ్ము కశ్మీర్ నుంచి వలస వచ్చిన వారు ఇదే తమ సొంత దేశమని భావిస్తుంటారు. అయినప్పటికీ వారిని శరణార్థులుగా పిలవడం పాక్ నాయకత్వ వివక్షతకు నిదర్శనం. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్, అక్రమాలు జరిగాయని, సైన్యం సాయంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచిందని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్రకు పరిమితమైందని, అక్రమాలను అడ్డకోలేదని పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) నాయకుడు ఔరంగజేబు, పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ) ఉపాద్యక్షుడు రాజా ఫరూఖ్ హైదర్ ఘాటైన ఆరోపణలు చేశారు. ఎప్పటిలాగానే ఈఆరోపణలు అవాస్తవమని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాయని 32 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అభివృద్థి ఇసుమంత కూడా…?

రాజకీయాలను పక్కనపెడితే ముజఫరాబాద్ రాజధానిగా పది జిల్లాలు, 33 తెహశీళ్లు, 40.5 లక్షల జనాభాతో, 13,297 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన పీవోకే పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ అభివద్ధి ఆనవాళ్లే కనపడవు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రజలకు కనీస వసతులు కరవే. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు తగిన మేరకు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత సేపటికీ భారత్ వ్యతిరేకతను ప్రజల్లో రెచ్చగొట్టడం, అధికారాన్ని సాధించడం, దానిని కాపాడుకోవడమే ఇక్కడి జాతీయ పార్టీల లక్ష్యంగా కనపడుతుంది. పీవోకే పై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందన్నది చేదు నిజం. ఇస్లామాబాద్ పాలకులు ఎంత కాదన్పప్పటికీ ఇది సత్యం. ఎదుగూ బొదుగూ లేని పీవోకేనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చిత్తశుద్ధితో పీవోకే ప్రగతికి పాటుపడినప్పుడే అవి తమ నిజాయతీని చాటుకోగలవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News