ఇమ్రాన్ అసహనం అందుకేనట

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అసహనంతో ఉన్నారు. అసంతప్తి, ఆవేశంతో రగలిపోతున్నారు. ఇంటాబయటా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లే ఇందుకు కారణం. ప్రపంచంలో జనాభాపరంగా అయిదో పెద్ద దేశమైన [more]

Update: 2021-08-19 16:30 GMT

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అసహనంతో ఉన్నారు. అసంతప్తి, ఆవేశంతో రగలిపోతున్నారు. ఇంటాబయటా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లే ఇందుకు కారణం. ప్రపంచంలో జనాభాపరంగా అయిదో పెద్ద దేశమైన పాకిస్థాన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్), ప్రపంచబ్యాంకు అప్పులతో బండి నెట్టుకొట్టోస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని అధికార నివాసాన్ని అద్దెకిచ్చే ప్రతిపాదనను స్వయంగా ఇమ్రాన్ ఖాన్ తెరపైకి తీసుకువచ్చారు. దీనిని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. ఇక అంతర్జాతీయంగానూ దాయాది దేశం పరిస్థితి ఏమీ బాగాలేదు. తన అవివేక చర్యలతో అది ఉగ్రవాదులను తయారుచేసే దేశంగా అప్రతిష్ట పాలైంది. దీంతో దానిని విశ్వసించే దేశం ఒక్కటీ లేకుండాపోయింది.

మాట్లాడకపోవడంపై..?

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే ఒకప్పుడు తనకు అన్నివిధాలా అండగా నిలిచిన అగ్రరాజ్యమైన అమెరికా అసలు పాకిస్థాన్ ఉనికినే గుర్తించడం లేదు. ఇస్లామాబాద్ ను వాషింగ్టన్ దాదాపు పూర్తిగా పక్కన పెట్టేసింది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మొదలైన ఈ విధానం ఇప్పడు బైడెన్ పాలనలోనూ కొనసాగుతుండటం పాక్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. గత ఏడాది నవంబరులో అధ్యక్ష్యపదవికి ఎన్నికై ఈ ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన డెమొక్రటిక్ పార్టీ నాయకుడైన జో బైడెన్ ఇంతవరకు తనతో మర్యాదపూర్వకంగా సైతం కనీసం ఫోన్లోనూ మాట్లాడక పోవడంపై ఇమ్రాన్ ఖాన్ రుసరుసలాడుతున్నారు. అదే సమయంలో భారత ప్రధాని మోదీతో బైడెన్ సంభాషించడాన్ని ఇమ్రాన్ ఖాన్ జీర్ణించుకోలేకపోతున్నారు.

అవమానంగా…?

ఇది తనకు అవమానమేనని, పాక్ ను నిర్లక్ష్యం చేయడమేనని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. ఒకప్పుడు వాషింగ్టన్ విధాన నిర్ణేతలు ఇస్లామాబాద్ కు అన్నివిధాలా అండగా నిలిచేవారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఆర్థికంగా, సైనికంగా సాయం చేసేవారని ప్రధాని పాత అనుభవాలను నెమరువేసుకుంటున్నారు. లండన్ లోని ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ ఎస్ ఏ) మొయిన్ యూసఫ్ ఈ విషయాలను ప్రస్తావించారు. దీనిపై పాకిస్థాన్ లోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ కథనాన్ని ప్రచురించింది. 1961 జులై 11న నాటి అమెరికా అధినేత జాన్ ఎఫ్ కెన్నడీ వాషింగ్టన్ లోని తన అధికార నివాసంలో అప్పటి పాక్ సైనిక పాలకుడు ఆయూబ్ ఖాన్ తో భేటీ అయిన విషయాన్ని యూసఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తమకూ ప్రత్యామ్నాయ మార్గాలు…..?

అగ్రరాజ్యం తమను వద్దనుకుంటే తమకూ వేరే ప్రత్యామ్నాయాలు లేకపోలేదని యూసఫ్ ఒకింత హెచ్చరికగా అన్నారు. ఇప్పటికే చైనాతో పాక్ సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ముస్లింలపై చైనాఅణచివేత చర్యలు చేపట్టినప్పటికీ ఇస్లామాబాద్ మారు మాట్లాడటం లేదు. కశ్మీర్ లోని ముస్లిముల హక్కుల గురించి అదేపనిగా అల్లరి చేసే ఇస్లామాబాద్ చైనాలోని ముస్లిముల దుస్థితిపై మౌనం వహించడం వెనక వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోపక్క మాస్కోతోనూ ఇటీవల కాలంలో ఇస్లామాబాద్ సన్నిహితంగా మసలుతోంది. అమెరికా తనను నిర్లక్ష్యం చేస్తుందనే భావనతోనే చైనా, రష్యాలకు దగ్గరవుతోంది. ఇక అఫ్గానిస్థాన్ సమస్య పరిష్కారంలో తన పాత్ర కీలకమని తెలిసినప్పటికీ అగ్రరాజ్యం ఉదాసీనంగా ఉండటం దాయాది దేశానికి మింగుడు పడటం లేదు. బైడెన్ పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహానికి ఇదే కారణం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News