అప్పు పేరుతో.. నాసిరకం ఆయుధాలతో?

ఆర్థిక సాయం పేరుతో పేద దేశాలకు అప్పులిచ్చి వాటిని అంతిమంగా అప్పుల ఊబిలోకి దించడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. చేయూత అందించి చిన్న దేశాలను చతికిల [more]

Update: 2020-12-10 16:30 GMT

ఆర్థిక సాయం పేరుతో పేద దేశాలకు అప్పులిచ్చి వాటిని అంతిమంగా అప్పుల ఊబిలోకి దించడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. చేయూత అందించి చిన్న దేశాలను చతికిల పడేలా చేయడంలో దానికదే సాటి. శ్రీలంక, పాకిస్థాన్ తదితర దేశాలకు ఇది అనుభవమే. అప్పులు తీర్చలేక శ్రీలంక తమ దేశంలోని హంబన్ టోట ఓడరేవు, పాకిస్థాన్ తమ దేశంలోని గ్వదర్ ఓడరేవులోని కొంతవాటాను బీజింగ్ కు అప్పగించిన విషయం బహిరంగ రహస్యం. అందుకే ప్రస్తుతం కొన్ని దేశాలు చైనా అప్పంటేనే ఉలిక్కి పడుతున్నాయి. దూరం దూరం జరుగుతుతున్నాయి. ఎంత గొంతు మీదకు వచ్చినా వేరే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి తప్ప చైనా వైపు కన్నెత్తి చూడటం లేదు.

ఆయుధాల పేరుతో…..

దీంతో చైనా ఇప్పుడు ఆయుధాల పేరుతో మరో దోపిడీకి తెరదీస్తోంది. ఆయుధాల విక్రయం పేరుతో పేద దేశాలను అప్పుల పాల్జేస్తోంది. వాటికి నాసిరకం ఆయుధాలను అంటగడుతూ పబ్బం గడుపుకొంటోంది. అదేమని అడిగితే అడ్డంగా బుకాయిస్తోంది డ్రాగన్. 2015-19 మధ్య కాలంలో అంతర్జాతీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో చైనా వాటా 5.5 శాతంగా ఉంది. ఈ కాలంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెన్యా, అల్జీరియా, శ్రీలంక, మయన్మార్ లకు నాసిరకం ఆయుధాలను అంటగట్టింది. ఆయుధాలు బాగాలేదంటూ వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలా చేసింది. చైనా కన్నా ఎన్నోరెట్లు చిన్నవైన ఆయా దేశాలు ఎవరికీ ఏమీ చెప్పుకోలేక తమ బాధను దిగమింకుంటున్నాయి. గట్టిగా అడిగితే కక్ష సాధింపుచర్యలకు దిగుతుందన్న భయంతో నిస్సహాయంగా ఉన్నాయి.

పాక్ కూ తప్పని…..

చైనాకు అనుంగు మిత్రదేశమైన పాకిస్థాన్ ఈ వరుసలో ముందుంది. 2016లో ఎఫ్ 22 యుద్ధ నౌకలను చైనా నుంచి ఇస్లామాబాద్ కొన్నది. కొద్దికాలానికే అవి మూలనపడ్డాయి. వీటిల్లోని లోపాలను సరిదిద్దాలని 2018లో కోరగా బీజింగ్ నుంచి మౌనమే సమాధానం లభించింది. 2019 లో ఎల్ వై -80 రకం యుద్ధ వాహనాలను కొనుగోలు చేయగా కొద్దికాలానికే అవి కాలం చెల్లాయి. మరో మిత్రదేశం బంగ్లాదేశ్ కు కూడా ఈ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2017లో రెండు జలాంతార్గాములను ఒక్కొక్కటి రూ.800 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. వీటికి సంబంధించిన సాంకేతిక సేవల్లో లోపాలు తలెత్తడంతో అవి పనికిరాకుండా పోయాయి. 2020లో 053హెచ్ 3 కొనుగోలు చేసింది. వాటికీ ఇదే పరిస్థితి ఎదురైంది.విషయాన్ని చైనా నౌకాదళానికి తెలియజేయగా మరమ్మతుల కోసం అదనపు మొత్తం కావాలని అడగడంతో ఢాకా నిర్ఘాంతపోయింది. పొరుగునఉన్న హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ కూ ఈ దుస్థితి తప్పలేదు. వై12ఇ, ఎంఏ 60 రకానికి చెందిన యుద్ధ విమానాలను బీజింగ్ నుంచిఖాట్మండు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ వద్దన్న ఈ ఉత్పత్తులను చైనా తెలివిగా నేపాల్ కు అంటగట్టింది. పాడైన వీటి బదులు కొత్తవి ఇవ్వడానికి చైనా ససేమిరా అన్నది.

లబోదిబో మంటున్నా…..

మరో మిత్రదేశం మయన్మార్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. నాసిరకం ఆయుధాలను ఈ దేశానికి విక్రయించింది. దీంతో ఇటీవల భారత్ నుంచి ‘సింధువీర్’ సబ్ మెరైన్ ను మయన్మార్ కొనుగోలు చేసింది. కెన్యా, అల్జీరియా, జోర్డాన్ వంటి చిన్న దేశాలకూ ఈ సమస్య ఎదురైంది. 2016లో వీఎన్ -4 క్షిపణులను ప్రయోగించగల యుద్ధ వాహనాలను కెన్యా కొనుగోలు చేసింది. వీటి పరిస్థితీ ఇంతే. అల్జీరియా, జోర్డాన్ సీహెచ్- 4బీ రకానికి చెందిన మానవ రహిత యుద్ధ డ్రోన్లను చైనా నుంచి కొనుగోలు చేశాయి. జోర్డాన్ ఆరు కొనుగోలు చేయగా మూడు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. చివరకు చేసేదేమీ లేక ఆ దేశాలు లబోదిబోమంటున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News