‘సెగ’ పుట్టింది

కరోనా పుణ్యమా? అని రోడ్డెక్కి ఆందోళన చేసే రాజకీయపార్టీలు లేవు. ఒకవేళ గొంతు చించుకున్నా పట్టించుకునే నాథుడూ లేడు. పార్టీలు సాధారణ జనంతో మమైకమయ్యే అజెండాను ఎప్పుడో [more]

Update: 2021-09-07 05:00 GMT

కరోనా పుణ్యమా? అని రోడ్డెక్కి ఆందోళన చేసే రాజకీయపార్టీలు లేవు. ఒకవేళ గొంతు చించుకున్నా పట్టించుకునే నాథుడూ లేడు. పార్టీలు సాధారణ జనంతో మమైకమయ్యే అజెండాను ఎప్పుడో వదిలేశాయి. రాజకీయ కారణాలతో రచ్చ చేస్తున్నాయి. అధికారపార్టీలకు అందుకే ప్రతిపక్షాలంటే అలుసుగా మారింది. పొరుగున ఉన్న తెలంగాణలో కొంతమేరకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కదిలించ గలుగుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యబలం కంటే తనకున్న ప్రజాదరణ తక్కువన్న సంగతి టీఆర్ఎస్ కు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు భిన్నం. ప్రతిపక్షాల మొత్తం ఓటింగు కంటే వైసీపీదే ఆధిక్యం. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, ఇటీవలి స్థానిక ఎన్నికల వరకూ ఆ ట్రెండ్ కొనసాగింది. అసలు ప్రతిపక్షాలను, వాటి డిమాండ్లను కేర్ చేయాల్సిన అవసరమే లేదని ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేసింది. ఈ దశలో జనసేన చేపట్టిన రోడ్ల ఉద్యమం ప్రభుత్వానికి సెగ తగిలేలా చేసింది. ప్రజలలో స్పందన కనిపించడంతో ఒక్కసారిగా ఉలికి పడింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగి అధికారులతో సమీక్ష చేయాల్సి వచ్చింది. అయితే ఇది జనసేన విజయం గా కంటే ఇష్యూ ప్రాధాన్యమే ప్రభుత్వాన్ని కలవరపరిచినట్లుగా చెప్పాలి.

పంచ్ కుదిరింది…

జనసేనకు పవన్ కల్యాణ్ అభిమాన సేన అండగా ఉంది. వారు కొంతమేరకు రిస్క్ చేసి తమ పంతం నెగ్గించుకోగలరు. కానీ ఇంతకాలం వారికి సరైన మార్గదర్శకత్వం కరవైందనే చెప్పాలి. ఆందోళనలు చేసి అరెస్టులు వరకూ తెచ్చుకుని కెరియర్ ను నాశనం చేసుకునేందుకు ఈ కాలంలో ఎవరూ సిద్ధంగా లేరు. అయితే తమ అభిమానాన్ని సామాజిక మాధ్యమాలు, సినిమా పంక్షన్లలో చాటి చెప్పడం వరకూ అయితే సర్వదా సిద్దం. జనసేన ఒక రాజకీయ పార్టీగా పిలుపునిచ్చిన కార్యక్రమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటే మాత్రమే కొంత స్పందన కనిపిస్తోంది. కానీ తాజాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల వేదిక గా బహిరంగ పరచమంటూ పవన్ ఇచ్చిన పిలుపుకు అనూహ్యంగా కదలిక వచ్చింది. ప్రత్యేకంగా పవన్ ఫ్యాన్స్ తమ చేతిలోని మొబైల్ నే రాజకీయ ఆయుధంగా చేసుకుంటూ విరుచుకు పడ్డారు. లక్షల్లో ట్వీట్లు, అధ్యాన్నమైన రోడ్డ దుస్థితితో సోషల్ మీడియా హోరెత్తి పోయింది. ప్రజలు సైతం వాటితో ఏకీభవిస్తూ రీ ట్వీట్లు చేస్తుండటంతో పరిస్థితి ప్రభుత్వానికి అర్థమైంది. ఉద్యమం ఆచరణాత్మకంగా, సులభంగా ఉంటే మాస్ మూవ్ మెంట్ గా తీర్చిదిద్దవచ్చని అర్థమైంది. భారీ కసరత్తులు, ధర్నాలు, రాస్తారోకోల హంగామా లేదు. అతిశయోక్తులు, ఆరోపణలు లేవు. ఉన్న వాస్తవాన్ని ఉచితరీతిలో ప్రదర్శించడమే ఈ విజయానికి కారణం.

ఎమ్మెల్యేలు ఎగాదిగా…

ముఖ్యంగా రాష్ట్రంలో 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. వారికే జనసేన ఉద్యమ సెగ తగులుతోంది. తమ నియోజకవర్గాల్లో ఎస్.ఐ మొదలు అధికారుల వరకూ ఎవరుండాలో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తున్నారు. కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలో చెప్పేది వారే. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితిని చూసుకోవాల్సింది కూడా వారే కదా. జనసేన ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ రోడ్ల దుస్థితిని ఫోకస్ చేయడం సరైన రాజకీయ నిర్ణయమే. ప్రజల్లో ఈ అంశము చర్చకు దారి తీస్తోంది. తమ అభిమాన నాయకుడు వస్తుంటే బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టడం కంటే ప్రజల అవస్తలపై ఫ్లెక్సీలు పెట్టడం కచ్చితంగా మంచి పరిణామం. రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం. ఆందోళన అంటే రాస్తారోకోలు చేపట్టి, ప్రజలకు మరింత అసౌకర్యం కలిగించడం కాదు. ప్రజల చేత వారు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యపై దృష్టి పెట్టేలా చేసి, ఆలోచింప చేస్తే చాలు. ఇందుకు మొబైల్ ఫోన్ వంటి సాధారణ ఉపకరణాలు అందివచ్చాయి. పెద్ద ఉద్యమాలు సాగినప్పుడు అదంతా రాజకీయమంటూ కొట్టి పడేసిన ఎమ్మెల్యేలు జనసేన ఆందోళనపై నోరు మెదపలేకపోతున్నారు. వారంతా ఆత్మరక్షణలో పడ్డారు.

సీఎం ..సీరియస్..

అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం రోడ్లపై పెట్టిన ఖర్చు నామమాత్రం. సాధారణంగా ప్రతి ఏడాది వేసవిలో రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తుంటారు. 2020, 21 సంవత్సరాల్లో ఆ పనులు చేపట్టలేదు. దాంతో రాష్ట్రంలో అన్ని రహదారులు అద్వాన్నస్థితికి చేరుకున్నాయి. పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై అదనపు రుసుం వసూలు చేసి మరీ నిధులు సమకూర్చుకున్నారు. కానీ ఆ నిధులను రోడ్లకు వెచ్చించడం లేదు. ఈ ఉదాసీనతే జనసేన రాజకీయ పోరాటానికి అవకాశమిచ్చింది. రాజకీయ అనుబంధాలు, వర్గాలకు అతీతంగా ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్య. అందుకే జనసేన ఉద్యమం చేపట్టిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యాలయానికి సమస్య తీవ్రత తెలియవచ్చింది. అధికారులతో సమీక్ష చేసి, వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆదేశించారు. ఇదొక మంచి పరిణామమే. ప్రతిపక్షాలకు ఎటూ బలం లేదు కాబట్టి అనేక అంశాల్లో వారి ఆందోళనలను సీఎం సీరియస్ గా తీసుకోవడం లేదు. కానీ రోడ్ల అంశం ప్రజలలో అలజడిగా మారి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని గ్రహించడంతో స్పందించాల్సి వచ్చింది. ఏదేమైనా వినూత్న రీతిలో ఆందోళన చేపట్టిన జనసేన క్యాడర్ ను పవన్ కల్యాణ్ ను, అదే సమయంలో తమ తప్పును గ్రహించి బుకాయించకుండా అంగీకరిస్తూ దిద్దుబాటుకు ప్రయత్నిస్తామన్న ముఖ్యమంత్రిని అభినందించాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News