ఇద్దరిలోనూ కాన్ఫిడెన్స్ కారణమేంటి?

ఆదాయపు పన్ను శాఖ దాడులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కాకపుట్టించాయి. ఆరు రోజుల పాటు జరిగిన దాడుల్లో రెండు వేల కోట్ల కూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఆదాయపు [more]

Update: 2020-02-18 09:30 GMT

ఆదాయపు పన్ను శాఖ దాడులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కాకపుట్టించాయి. ఆరు రోజుల పాటు జరిగిన దాడుల్లో రెండు వేల కోట్ల కూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ చేసిన ప్రకటన సంచలనమే అయింది. ఈ రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులకు చెందిన కంపెనీలు జరిపినవేనని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కేవలం రెండున్నర లక్షలు మాత్రమే దొరికాయని టీడీపీ వాదిస్తోంది.

తొలి ప్రకటనతో…..

తొలుత ఆదాయపు పన్ను శాఖ చేసిన ప్రకటన అస్పష్టంగా ఉన్నా రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. ఆ ప్రకటనలో ఒక ముఖ్యనేత మాజీ పీఎఎస్ నుంచి ఆధారాలు లభించినట్లు కూడా ఐటీ శాఖ పేర్కొనడంతో వైసీపీ ఇక జూలు విదిల్చింది. చంద్రబాబుకు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసులు, లోకేష్ కు సన్నిహితుడు కిలారి రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి కంపెనీలేనని వైసీపీ ఎటాక్ స్టార్ట్ చేసింది.

టీడీపీ కూడా….

అయితే టీడీపీ కూడా ఆ తర్వాత మాజీ పీఎస్ శ్రీనివాస్ పంచనామా రిపోర్ట్ ను బయటపెట్టింది. శ్రీనివాస్ దగ్గర రెండున్నర లక్షల నగదు మాత్రమే దొరికిందని, అది తిరిగి ఐటీ శాఖ ఆయనకే ఇచ్చేసిందని తెలిపారు. కావాలనే వైసీపీ తమ అధినేతపై తప్పుడు ప్రచారానికి దిగిందని టీడీపీ నేతలు కస్సుమన్నారు. అంతేకాదు ప్రచారం ఆపకుంటే వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేయనున్నట్లు కూడా యనమల రామకృష్ణుడు ప్రకటించారు.

బాబు మౌనంతో….?

తాజాగా ఐటీ శాఖ విడుదల చేసిన మరో పంచనామా రిపోర్టు మరోసారి వైసీపీ వాదనకు ఊతమిచ్చినట్లయింది. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ ఫ్రాలో వెయ్యి పేజీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. పదమూడు పేజీల పంచనామా రిపోర్ట్ ఐటీ శాఖ బయటపెట్టింది. లాకర్ల సీజ్ విషయాన్ని కూడా రిపోర్ట్ లో ఐటీశాఖ ప్రస్తావించింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో పెద్ద సంఖ్యలో డైరీలను స్వాధీనం చేసుకున్నామని, అందులో కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొన్నారు. అయితే ఐటీ శాఖ దాడులపై ఇప్పటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News