లెక్కలు సరిచేస్తున్నారు

మహారాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ కొంత దూకుడుగానే వెళుతుంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు వదిలేసిన తర్వాత ఆ బాధ్యతలను తీసుకున్న సోనియా గాంధీ [more]

Update: 2019-09-13 17:30 GMT

మహారాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ కొంత దూకుడుగానే వెళుతుంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు వదిలేసిన తర్వాత ఆ బాధ్యతలను తీసుకున్న సోనియా గాంధీ వరసగా ఒక్కో రాష్ట్రంపై దృష్టి పెడతున్నారు. మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూటమి ద్వారా వెళ్లాలని సోనియా గాంధీ నిర్ణయించారు. కేవలం పొత్తులే కాదు సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేయాలని సోనియా పార్టీ నేతలను ఆదేశించారు. మహారాష్ట్రలో ఇప్పటికే కొన్ని సీట్లలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మధ్య సీట్ల సర్దు బాటు కుదిరింది.

ఈ ఏడాది చివర్లో……

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, శివసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాబు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ సంఖ్య విషయలో ఒక స్పష్టత వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో శివసేన, బీజేపీ కూటమికి అడ్వాంటేజీ ఉంటుందన్న విశ్లేషణలతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది.

నేతలు పార్టీని వీడుతున్నా….

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కొందరు నేతలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీ మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి సారించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి కట్టడానికి పొత్తులపై చర్చించేందుకు, అభ్యర్థులను ఖరారు చేసిందుకు స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీలో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా వంటి వారున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సోనియా గాంధీ నేరుగా హస్తినలోనే చర్చలు జరిపారు.

స్పీడు పెంచిన…..

తాజాగా ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య జరిగిన చర్చల్లో ముంబై ప్రాంతంలో ఉన్న 36 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఖరారయింది. ముంబయి ప్రాంతంలో ఉన్న 36 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. ఎన్సీపీ ఏడు స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఎస్పీకి ఒక స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన రెండు స్థానాలనూ కూటమిలోని పార్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించాలని సోనియా గాంధీ నిర్ణయించారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి పంపేలా సోనియా గాంధీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సోనియా గాంధీ మహారాష్ట్ర ఎన్నికల విషయంలో స్పీడ్ పెంచినట్లే కన్పించింది.

Tags:    

Similar News