ఒక్కరోజులో మారుతుందా…?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు ఇంకా మరో రోజు సమయం ఉంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరిగి తమ ఎమ్మెల్యేలను క్యాంప్ నకు తరలించారు. ముఖ్యమంత్రి [more]

Update: 2019-07-20 16:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు ఇంకా మరో రోజు సమయం ఉంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరిగి తమ ఎమ్మెల్యేలను క్యాంప్ నకు తరలించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా అగ్రనేతలు భేటీ అయ్యారు. మరికొంత సమయం ఉండటంతో రెబల్ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.

రెబెల్ ఎమ్మెల్యేలతో….

రెబెల్ ఎమ్మెల్యేలంతా ముంబయిలో హోటల్ లో మకాం వేసి ఉన్నారు. వారిని కలుసుకునేందుకు వీలులేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు, సన్ని హితుల ద్వారా కాంగ్రెస్ నేతలు రాయబారాలు నెరుపుతున్నారు. సోమవారం కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్ష ఉంటుందని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కుమారస్వామి, సిద్ధరామయ్యలు విశ్వాస పరీక్ష మంగళవారం జరిపితే బాగుంటుందని సూచించినా స్పీకర్ మాత్రం సోమవారం విశ్వాస పరీక్షను ఖచ్చితంగా నిర్వహిస్తానని తెలిపారు.

ఐదుగురు వస్తే….

దీంతో ఈ ఒక్కరోజులో ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే గండం నుంచి బయటపడినట్లే. సభలో ప్రస్తుతంకర్ణాటక శాసనసభలో కాంగ్రెస్ బలం 101గా ఉంది. మరో ఐదుగురు ఎమ్మెల్యేలను రప్పించుకుంటే అవిశ్వాసాన్ని సులువా గట్టెక్కవచ్చు. ఇదే పనిలో డీకే శివకుమార్ లాంటి నేతలు ఉన్నట్లు తెలిసింది. రామలింగారెడ్డి వంటి నేతలు తిరిగి రావడంతో కొంత కాంగ్రెస్ పార్టీలో నమ్మకం ఏర్పడింది. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలను తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వస్తారా? లేదా?

మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా అసమ్మతి ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్ని చర్యలు చేపట్టింది. ముంబయిలో అసమ్మతి ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద గట్టి నిఘాను పెట్టింది. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లపై కూడా బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇలా మరో రోజు మాత్రమే కర్ణాటకలో విశ్వాస పరీక్షకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అసమ్మతి నేతలను తిరిగి రప్పించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాని ఇంత జరిగిన తర్వాత వారు వస్తారా? అన్నది అనుమానమే. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇప్పుడు వెనక్కు వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని అసమ్మతి నేతలు భావిస్తుండటమే ఇందుకు కారణం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News