ఇక ఆ పండగ లేనట్లేనా? నిరాశ తప్పదా?

భారతీయులకు క్రికెట్ కి వీడతీయలేని బంధం. అలాంటి ఆటలో ఐపీఎల్ కి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు ఫ్రాంచైజ్ లకు వేలకోట్ల [more]

Update: 2020-03-14 18:29 GMT

భారతీయులకు క్రికెట్ కి వీడతీయలేని బంధం. అలాంటి ఆటలో ఐపీఎల్ కి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు ఫ్రాంచైజ్ లకు వేలకోట్ల రూపాయల కాసుల పంట బెట్టింగ్ మాఫియా కు చేతినిండా పని పెట్టే ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అని అంతా ఏడాది పొడుగునా చూస్తారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా ఉండదా అన్న సందేహంలో పడింది. దీనికి కారణం కరోనా ప్రభావం.

వణుకుతున్న రాష్ట్రాలు ….

భారీ సమూహాలు ఉండే చోట కరోనా సులువుగా ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే భారత్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. కేంద్రం విదేశీయులకు 15 రోజులపాటు ఇప్పటికే వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ ను 15 రోజుల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజ్ లు సైతం బిసిసిఐ ను అభ్యర్ధించాయి. దీనికి తోడు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మ్యాచ్ ల నిర్వహణ కు అనుమతి ఇవ్వమని తేల్చేశాయి.

అమ్మకాలు లేకుండా పోయాయి …

మరోపక్క క్రికెట్ అభిమానులు టికెట్ల కొనుగోళ్లపై ఆసక్తి ప్రదర్శించడం లేదు. అయినా కానీ జనం లేకుండా మ్యాచ్ లు నిర్వహించేందుకు సైతం ఫ్రాంచైజ్ లు సిద్ధం అయ్యాయి. దీనికి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం మ్యాచ్ లు వాయిదా పడ్డాయి. ఈనెల 29 నుంచి ప్రారంభం కావలిసిన ఐపీఎల్ ను ఏప్రిల్ 15 కు వాయిదా వేస్తూ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయం ప్రకటించారు. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని వారి రక్షణ కోసమే మ్యాచ్ లు వాయిదా అని గంగూలీ చెప్పుకొచ్చారు. రీ షెడ్యూల్ తిరిగి కరెక్ట్ గా ప్రకటిస్తామని వెల్లడించారు.

లేకపోతే కొంపలు అంటుకోవు …

ఇదిలా ఉంటే ఈ ఏడాది అవసరమైతే ఐపీఎల్ కి డుమ్మా కొట్టేద్దామని కొంపలు ఏమి అంటుకుపోవని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. అయితే దీనికి ఫ్రాంచైజ్ లు ససేమిరా అంటున్నాయి. వేలకోట్ల రూపాయలు నష్టపోతామని లబోదిబోమంటున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం అంతా పరిశీలిస్తే కరోనా దేశంలో కంట్రోల్ లోకి వస్తే ఒకే కానీ దేశంలో పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం ఈ ఏడాది క్రికెట్ ప్రేమికులకు నిరాశ తప్పదు.

Tags:    

Similar News