కరోనాతో కబాడీ ఆడేసుకుంటున్నారుగా ?

కరోనా వైరస్ కూడా బెంబేలెత్తే పాలిటిక్స్ ఏపీలో సాగుతోంది. కరోనాని తమకు ఇష్టం వచ్చినట్లుగా తిప్పుకుంటూ కదన కుతుహల రాగాలు ఆలపించడంతో రాజకీయ జీవులు సాధించిన నైపుణ్యం [more]

Update: 2020-11-01 09:30 GMT

కరోనా వైరస్ కూడా బెంబేలెత్తే పాలిటిక్స్ ఏపీలో సాగుతోంది. కరోనాని తమకు ఇష్టం వచ్చినట్లుగా తిప్పుకుంటూ కదన కుతుహల రాగాలు ఆలపించడంతో రాజకీయ జీవులు సాధించిన నైపుణ్యం చూసి అహా అనాల్సిందే మరి. కరోనాను అడ్డం పెట్టుకుని ఏమైనా చేయవచ్చునని ఏపీలోని రాజకీయ పార్టీలు నిరూపించాయి. దేనికైనా కరోనా భూతాన్ని ముందుకు తేవడం అలవాటు అయింది. అలాగే తమను నచ్చినట్లుగా కరోనా పేరు చెప్పి కబాడీ ఆడేసుకుంటున్నారు.

నాడు అలా….

నిజానికి ఈ ఏడాది మార్చి 15నాటికి దేశంలో కరోనా కేసులు వంద కూడా లేవు. ఇక ఏపీలో చూసుకుంటే రోజుకు ఒకటి రెండు కేసులు కూడా లేవు. కానీ కరోనా పేరు చెప్పిన్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన ముందస్తు సూచనల మేరకు అలా చేశామని ఆయన చెప్పారు. కానీ ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోలేదు. సరే నిమ్మగడ్డ వారి వాదన ఎలా ఉన్నా ఆయనకు వంతపాడుతూ టీడీపీ చేసిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు, ప్రజలంటే లెక్క లేదా. కరోనా కంటే పదవులే ముఖ్యమా అంటూ వైసీపీ మీద పసుపు తమ్ముళ్ళు వీరంగమే వేశారు. ముందు ప్రాణాలు ముఖ్యం. ఆనక ఎన్నికలు, రాజకీయాలు అంటూ నీతి సూక్తులూ వల్లించారు.

సీన్ కట్ చేస్తే ….

ఎందుకు ఎన్నికలు పెట్టరు, మీకు జనం తీర్పు కోరాలంటే భయం అంటున్నారు ఏపీ టీడీపీ కొత్త కామందు అచ్చెన్నాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వాటివల్ల ఒనకూడే ప్రయోజనాలను కూడా వల్లిస్తున్నారు. పల్లెలు, పంచాయతీలు, సౌభాగ్యం అంటూ పసందైన కబుర్లే చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ 2018 ఆగస్ట్ 1తో ఏపీలోని స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. మరి నాడు టీడీపీ సర్కార్ పెద్దలు ఎందుకు ఎన్నికలు పెట్టలేకపోయారో అప్పట్లో మంత్రిగా కూడా ఉన్న అచ్చెన్న చెబుతారా. ఇక మార్చిలో ఎన్నికలు వాయిదా వేసినపుడు టీడీపీ పెద్దలు ఏమన్నారో అయినా ఆయనకు గుర్తుందా అన్నదే ఇపుడు చర్చ.

అయ్యే పనేనా…?

ఇపుడు చూస్తే రోజుకు మూడున్నరవేలకు తక్కువ కాకుండా కరోనా కేసులు వచ్చిపడుతున్నాయి. పాతిక ముప్పయి మధ్యలో ప్రతీ రోజూ కరోనా కాటుకు ప్రజలు మరణిస్తున్నారు. మరో వైపు పండుగలు, శీతాకాలం సీజన్ వంటి వాటి వల్ల కరోనా సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందట్లో సడేమియా అన్నట్లుగా టీడీపీ నేతలకు ఎన్నికలు కావాల్సివచ్చాయా అని సగటు జనమే షాక్ తింటున్నారు. నాడు ఎన్నికలు వాయిదా వేశారు అంటే ఇలాగే అంతా ఆశ్చర్యపోయారు. ఇపుడు పెట్టమంటూ డిమాండ్ చేయడమూ విడ్డూరంగానే ఉంది. అంటే కరోనా పేరుకు మాత్రమే. అసలు రాజకీయం దానికంటే కరోడాలంటిది అని తమ్ముళ్ళు ప్రతీ సారీ రుజువు చేస్తున్నారుగా.

లేస్తే మనిషిని కానూ…?

ఇది పల్లెటూరి ముతక సామెత. నేను లేచానంటే నీ అంతు చూస్తాను అంటూ కుంటి ఆసామి వెనకటికి హెచ్చరించాడట. అలాగే ఉంది టీడీపీ తీరు. ముందు ఎన్నికలు పెట్టించండి. మేము బంపర్ మెజారిటీతో గెలిచి చూపిస్తామని తమ్ముళ్ళు తొడగొడుతున్నారు. నిజానికి ఆరేడు నెలలుగా అధినేత చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటున్నారు. అసలు ఏపీలో టీడీపీ రాజకీయ కార్యక్రమాలే నిలిచిపోయాయి. పార్టీలో సడీ, సందడీ లేనేలేదు. పైగా సంక్షేమ కార్యక్రమాలతో జగన్ మంచి దూకుడు మీద ఉన్నారు. అయినా సరే ఎన్నికల డిమాండ్ టీడీపీ నుంచి ఎందుకు వస్తోంది అంటే అక్కడే ఉంది తమాషా. ఎటూ వైసీపీ ఎన్నికలు పెట్టదు. కరోనా కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో గట్టిగా అరచి గోల చేస్తే పోయేదేముంది అన్నదే తమ్ముళ్ల థియరీ.

Tags:    

Similar News