డెసిషన్ కు వచ్చేశారా…?

శకునం చెప్పే బల్లి.. కుడితిలో పడినట్టుగా తయారైంది ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ పొలిటికల్‌ పరిస్థితి. కేంద్ర మాజీ మంత్రి, దివంగత పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా రాజకీయ [more]

Update: 2019-08-06 12:30 GMT

శకునం చెప్పే బల్లి.. కుడితిలో పడినట్టుగా తయారైంది ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ పొలిటికల్‌ పరిస్థితి. కేంద్ర మాజీ మంత్రి, దివంగత పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా రాజకీయ అరంగేట్రం చేసి, 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా విజయం సాధించిన లగడపాటి రాజగోపాల్‌.. తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆయన ధైర్యే సాహసే అన్నట్టుగా పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రేని చిలకరించి.. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అదేసమయంలో ఏపీలో దీక్ష ప్రారంభించి.. అక్కడి నుంచి తప్పించుకుని తెలంగాణకు చేరుకుని పోలీసులను నానా తిప్పలు పెట్టారు.

సరికొత్త అవతారంతో…..

ఇలా, ఎప్పటికప్పుడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్ర విభజన జరిగితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి.. విభజన తర్వాత అనుకున్నట్టుగానే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే, రాజకీయాల్లో ఆయన సరికొత్త అవతారం ఎత్తారు. అదే.. ఆర్జీ ఫ్లాష్‌ సర్వే పేరుతో సర్వేలు లగడపాటి రాజగోపాల్‌ చేయడం ప్రారంభించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం , రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును పాలకులను కూడా ముందుగానే చెప్పి ఆంధ్రా ఆక్టోపస్‌గా లగడపాటి రాజగోపాల్‌ గుర్తింపు పొందారు. అయితే, ఆయనకు వరుసగా తగిలిన రెండు దెబ్బలతో ఇప్పుడు ఈ సర్వేలకు కూడా దూరమయ్యారు.

కూటమికే ఎక్కువ….

గత ఏడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతుందని సెలవిచ్చిన ఆయన చంద్రబాబు-కాంగ్రెస్‌ల కూటమికి ఎక్కువ మార్కులు వేశారు. అయితే, ఎన్నికల్లో ఈ ఫలితం పూర్తిగా తలకిందలు అయింది. కేసీఆర్‌ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి లగడపాటి రాజగోపాల్‌ స‌ర్వేల‌పై తీవ్ర‌మైన విమ‌ర్శలు స్టార్ట్ అయ్యాయి. ఆ ఎన్నిక‌ల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన చాలా మంది లగడపాటి రాజగోపాల్‌ స‌ర్వే న‌మ్మి కోట్లాది రూపాయ‌లు బెట్టింగులు కాసి నిండా మునిగిపోయారు.

అందరికీ విరుద్ధంగా….

ఇక, ఏపీ విషయానికి వస్తే.. జాతీయ మీడియా భారీ ఎత్తున ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రమాదపు గంటలు మోగుతున్నాయని, జగన్‌ పాదయాత్ర ఫలించనుందని చెబితే.. దీనికి విరుద్ధంగా లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారని, తెలంగాణ ప్రజలు ధనవంతులు కాబట్టి కారెక్కారని, ఏపీ ప్రజలు పేద వారు కాబట్టి సైకిల్‌ ఎక్కుతున్నారని వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. దీంతో ఆయన ఇక తాను సర్వేలకు కూడా స్వస్తి చెబుతున్నానని ప్రకటించారు. ఎన్నిక‌ల‌కు ముందు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబును ప‌దే ప‌దే క‌లిసిన లగడపాటి రాజగోపాల్‌ విజ‌య‌వాడ నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్రచారం కూడా జ‌రిగింది. అయితే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా పూర్తిగా వ్యాపారాలకే పరిమితమైన లగడపాటి రాజగోపాల్‌ తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారు కూడా జోరుగానే ఉండడం గమనార్హం. ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో లగడపాటి రాజగోపాల్‌ వంటి నేతల అవసరం ఉందనేది వీరి వాదన. మరి ఆక్టోపస్‌ ఎలా నిర్ణయిస్తుందో చూడాలి.

Tags:    

Similar News