ఈ అధికారం ఎంతకాలం?

అమెరికా ఎన్నికలకు, ఇజ్రయెల్ ఎన్నికలకు ఒక పోలిక ఉంది. అగ్రరాజ్యం ఎన్నికలను యావత్ అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంది. అయితే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా [more]

Update: 2021-06-17 16:30 GMT

అమెరికా ఎన్నికలకు, ఇజ్రయెల్ ఎన్నికలకు ఒక పోలిక ఉంది. అగ్రరాజ్యం ఎన్నికలను యావత్ అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంది. అయితే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని విదేశాంగ విధానంలో పెద్ద మార్పేమీ ఉండదు. అదేవిధంగా ఇజ్రాయెల్ ఎన్నికలను దాని చుట్టపక్కల గల అరబ్ దేశాలు అంతే నిశితంగా పరిశీలిస్తుంటాయి. ఇక్కడా ఏ పార్టీ విజయం సాధించినా పాలస్తీనాతోపాటు చుట్టుపక్కల గల అరబ్ దేశాల పట్ల దాని వైఖరిలో మార్పుండదు. గత రెండేళ్లుగా నాలుగుసార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. తాజాగా ఈ ఏడాది మార్చి 23న నాలుగోసారి ఎన్నికలు జరిగాయి. 120 సీట్లు గల పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నాయకత్వంలోని ‘లికుడ్’ పార్టీ 60 సీట్లు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వ స్థాపనకు అవసరమైన మరో ఎంపీ మద్దతు లేక అధికారానికి దూరంగా ఆగిపోయింది. దీంతో చివరి క్షణంలో విపక్షాలు విభేదాలను విస్మరించి ఏకమై ముందుకు రావడంతో సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. ఫలితంగా 13 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన నెతన్యాహూ శకం ముగిసినట్లయింది. తద్వారా దేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన నేతగా నెతన్యాహూ చరిత్రకెక్కారు.

సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో…?

యూదురాజ్యం ఇజ్రయెల్ లో కొత్త సంకీర్ణ సర్కారును చూసిన తరవాత భారత్ లో తొమ్మిదో దశకంలో కేంద్రంలో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ (యూఎఫ్) ప్రభుత్వాలు గుర్తుకు రాక మానవు. అప్పట్లో కనీస బలం లేని బలహీన నాయకులు హెచ్. డి. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్ ప్రధాని పదవి చేపట్టారు. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ బదులు రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతుతో ఈ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ లో జరిగిందీ అదే. 120 సీట్లు గల పార్లమెంటులో 60 సాధించిన ప్రధాని నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీ మద్దతు కూడగట్ట లేక వైదొలగింది. చివరికి ఎనిమిది పార్టీలతో సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. విశేషం ఏమిటంటే కేవలం ఏడుగురు సభ్యులు గల ‘యమినా’ పార్టీ నాయకుడు నాఫ్తాలీ బెన్నెట్ (49) ప్రధాని పదవి చేపట్టడం. ఈయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. తరవాత 17 మంది సభ్యులు గల సెంట్రిస్ట్ యేష్ అతిద్ పార్టీ నాయకుడు ఎయిర్ లాడ్ (51) రెండేళ్ల పాటు ప్రధాని పదవిలో కొనసాగుతారు. కేవలం నలుగురు సభ్యులు గల ఇజ్రాయెల్ అరబ్ పార్టీ ‘రామ్’ పార్టీ ప్రభుత్వంలో చేరడం కీలక పరిణామం.

అధికార పార్టీకి వ్యతిరేకంగా?

సాధారణంగా అరబ్ పార్టీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తాయి. దేశంలో దాదాపు అయిదో వంతుగల అరబ్ ల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం అవి సర్కారుపై పోరాడుతుంటాయి. రామ్ పార్టీ అధినేత మన్సూద్ అబ్బాస్ నిర్ణయంపై ఇతర అరబ్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారం కోసం అబ్బాస్ అరబ్బుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అవి తూర్పార పట్టాయి. గతంలో 90దశకంలో అప్పటి ఇట్జాక్ రాబిన్ సర్కారుకు అరబ్ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలో చేరలేదని, ఇప్పుడు అబ్బాస్ మాత్రం సంకీర్ణ సర్కారులో భాగస్వామి అవుతున్నారని అవి గుర్తు చేస్తున్నాయి. అయితే అరబ్బుల ప్రయోజనాల కోసమే సర్కారులో చేరుతున్నామని అబ్బాస్ సమర్థించుకుంటున్నారు.

ఆయన శిష్యుడే అయినా?

కొత్త ప్రధానితో పాటు ఇజ్రయెల్ కి కొత్త అధ్యక్షుడు కూడా వచ్చారు. ఇప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన రివెన్ రివ్లిన్ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మన రాష్ర్టపతి మాదిరిగా నామమాత్ర అధినేత. అసలైన అధికారాలన్నీ ప్రధానివే. ప్రస్తుత ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ ఒకప్పుడు నెతన్యాహూ శిష్యుడే. ఆయన వద్ద మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల అనంతరం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టనున్న ఎయిర్ లాపిడ్ సైతం నెతన్యాహూ సహచరుడే. నిన్నమొన్నటిదాకా ఆయన విపక్ష నేతగా పనిచేశారు. పూర్వాశ్రమంలో పాత్రికేయుడు. ఈ ఇద్దరు నేతలూ పాలస్తీనా వ్యతిరే
కులు కావడం విశేషం. కొత్త సంకీర్ణ సర్కారు పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి అయితే ప్రశ్నార్థకమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News