ఇద్దరూ ఏమాత్రం తగ్గడం లేదుగా?

ఇరుగు పొరుగు దేశాలకు ఇబ్బందులు, చికాకులు కల్పించడం, వాటిని ఇరుకున పెట్టడం చైనా నైజం. ఏకపక్షంగా, బాధ్యతారహితంగా వ్యవహరించడం డ్రాగన్ కు అలవాటైన విద్య. దాదాపు అన్ని [more]

Update: 2020-12-26 16:30 GMT

ఇరుగు పొరుగు దేశాలకు ఇబ్బందులు, చికాకులు కల్పించడం, వాటిని ఇరుకున పెట్టడం చైనా నైజం. ఏకపక్షంగా, బాధ్యతారహితంగా వ్యవహరించడం డ్రాగన్ కు అలవాటైన విద్య. దాదాపు అన్ని సరిహద్దు దేశాలతో ఇలానే వ్యవహరిస్తోంది. భారత్ తో ఇందుకు మినహాయింపు కాదు. ఆరు దశాబ్దాలుగా బీజింగ్ తో భారత్ కు సరిహద్దు సమస్య ఉంది. అది ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఫలితంగానే గత ఆరు నెలలుగా తూర్పు లద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా 20మందికి పైగా భారతీయ సైనికులు అమరులయ్యారు. ఇప్పటికీ లద్దాఖ్ వద్ద సాధారణ పరిస్థితులు నెల కొనలేదు.

నదీ జలాల విషయంలో…..

తాజాగా నదీజలాల విషయంలోనూ చైనా దుందుడుకుగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చేపట్టింది. అక్టోబరులో ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి త్వరలో చైనా కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయనుంది. దాదాపు 60 వేల మెగావాట్ల సామర్థ్యంతో టిబెట్ లో జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తోంది. ఇది మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్రానికి కూతవేటు దూరంలోనే ఉంది. ఇది భారీ ప్రాజెక్టు. చైనాలోని త్రీ గోర్జెస్ ప్రాజెక్టు కన్నా చాలా పెద్దది. ఇప్పటికే బ్రహ్మపుత్రపై చైనా అనేక చిన్నా చితకా ప్రాజెక్టు లను నిర్మించింది. వీటి దుష్ఫలితాలను భారత్ ఇప్పటికే ఎదుర్కొంటోంది. బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టుల వల్ల దిగువనున్న భారత్ కు వచ్చే నీటి వాటాలో కోత పడుతుంది. కరవు కాటకాల్లో వచ్చే నీటికి ఇంకా ఇబ్బంది ఏర్పడుతుంది. అదే సమయంలో వరదల సమయంలో వచ్చే అధిక నీటిని కిందకు వదలడం వల్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. చైనా ప్రాజెక్టు వల్ల ఒక్క భారత్ కు మాత్రమే నష్టం కాదు. భారత్ కు దిగువనున్న బంగ్లాదేశ్ కూడా దీని దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

బంగ్లాదేశ్ కూ నష్టమే…

బ్రహ్మపుత్ర నది చైనాలోని టిబెట్ నుంచి భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవహిస్తుంది. అక్కడ నుంచి అసోంలోకి ప్రవేశిస్తోంది. అసోంలో నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ. కొన్ని చోట్ల నది వెడల్పు దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుది. ఈ నది ఆధారంగా ఈ ప్రాంతంలో పెద్దయెత్తున పంటలు పండిస్తారు. నదిపై అనేక చిన్నచితకా ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే బ్రహ్మపుత్ర నదిని ‘ఈశాన్య వరప్రదాయిని’ అని పిలుస్తుంటారు. భారత్ నుంచి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది. ఆ దేశంలోనూ ఈ నది కింద అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. విస్తారంగా పంటలు పండిస్తారు. పద్మ, వేణి, తీస్తా తదితర ఉపనదులు బ్రహ్మపుత్రలోనే సంగమిస్తాయి. చైనా ప్రాజెక్టుల వల్ల బంగ్లాదేశ్ కూ భారీ నష్టం కలుగుతుంది.

ఎటువంటి చర్చలు లేకుండానే…

ఉమ్మడి నదులు ఉన్నప్పుడు, వాటిపై ప్రాజెక్టులు నిర్మించే సమయంలో ఉభయ దేశాలూ పరస్పరం చర్చలు జరపాలి. ఏ దేశమైతే ప్రాజెక్టు నిర్మించాలనుకున్నదో ఆ దేశం ముందుగా దిగువ దేశాలతో మాట్లాడాలి. దాని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి. దాని సందేహాలను తీర్చాలి. ఆ దేశ ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగబోదని స్పష్టమైన భరోసా ఇవ్వాలి. ఆ తరవాతే పనులు చేపట్టాలి. ఇవేమీ చైనాకు పట్టడం లేదు. దానిదంతా ఏకపక్ష దోరణే. ఎప్పుడూ ఒంటెత్తు పోకడే. పెద్దదేశంగా ఎదుగుతున్నా దాని ధోరణిలో మార్పురావడం లేదు. హుందాతనాన్ని అలవరచుకోవడం లేదు.

భారత్ ఏమాత్రం తగ్గకుండా….

బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లుంగ్ జాంగ్బో అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని ఏడో అతిపెద్ద నది. పొడవైన నదుల్లో పదిహేనోది. దాదాపు 4,696 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది. బీజింగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో దానికి దీటుగా స్పందించాలని భారత్ నిర్ణయించు కుంది. బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్ లో దాదాపు పది వేల మెగావాట్ల సామర్థ్యంలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. కేంద్ర జల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి టి.ఎస్. మెహ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును నేరుగా బ్రహ్మపుత్రపై కాకుండా దాని ఉపనది అయిన ‘సియాంగ్’పై నిర్మిస్తారు. ప్రాజెక్టు వల్ల ఈశాన్య భారతంలో విద్యుత్ అవసరాలను తీర్చవచ్చు. రైతాంగం సాగునీటి అవసరాలు తీరుతాయి. యావత్ ఈశాన్య భారతం సుభిక్షమవుతుంది. అదే సమయంలో డ్రాగన్ దేశానికి దీటైన సమాధానం ఇచ్చినట్లవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News