కాంగ్రెస్ కు రాబోయేవన్నీ గుడ్ డేస్..?

పంజాబ్ లో మోదీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే తెలిసి పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది [more]

Update: 2021-02-28 17:30 GMT

పంజాబ్ లో మోదీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే తెలిసి పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లోనే జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటుంది. మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ విడిపోయినప్పటికీ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. అయితే తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

కొన్ని నెలలుగా….

ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరూ రోడ్లపైనే ఉండి నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలో ముఖ్య పాత్ర పంజాబ్ రైతులదే. పంజాబ్ లో ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో అక్కడి రైతులు ఉన్నారు. ఆర్థికంగా బలమైన వర్గం కావడంతో వీరిని దూరం చేసుకునే సాహసం ఏ పార్టీ చేయదు. అందుకే అకాలీదళ్ ఎన్డీఏ నుంచి విడిపోయి బయటకు వచ్చింది.

మున్సిపల్ ఎన్నికల్లో…..

తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఏకపక్షంగా పంజాబ్ ప్రజలు తీర్పు చెప్పారు. మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా అందులో అన్నింటా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. పఠాన్ కోట్, బాటలా, కపూర్తలా, హోషియార్ పూర్, అబోహర్, బటిండా, మెగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బటిండా మున్సిపాలిటీని దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ చేతికి రావడం విశేషం.

కాంగ్రెస్ క్లీన్ స్వీప్….

సహజంగా మున్సిపాలిటీలు అంటే పట్టణ ప్రాంతాలు. రైతుల ప్రభావం ఎక్కువగా ఉండదని భావిస్తాం. కానీ రైతులకు మద్దతుగా పంజాబ్ ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు. బటిండా లోక్ సభ నియోజకవర్గానికి శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ కేంద్ర మంత్రి హరిసిమ్రత్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్నా అక్కడ కాంగ్రెస్ గెలవడం విశేషం. మొత్తంగా చూసుకుంటే రైతు దెబ్బ మామూలుగా పడలేదు. ఇదే రిజల్ట్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ పంజాబ్ ప్రజల మనోభావాలను గుర్తించి సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News