‘కదిరి’ పై జగన్ వ్యూహమిదేనా?

తమ పార్టీ గుర్తుపై… తన ఫోటోతో… గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో [more]

Update: 2019-01-22 12:30 GMT

తమ పార్టీ గుర్తుపై… తన ఫోటోతో… గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలను కచ్చితంగా ఓడించాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఆయన ఆ నియోజకవర్గాలకు కొత్త నేతలను తయారుచేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేది మీరే అని జగన్ ముందే చెప్పేస్తూ వారిని సిద్ధం చేస్తున్నారు. అందునా ఎక్కువగా విద్యావంతుల వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు. మొన్న కడప జిల్లాలో తనకు కీలకమైన జమ్మలముడుగు నియోజకవర్గ అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని ప్రకటించిన ఆయన తాజాగా అనంతపురం జిల్లా కదిరి అభ్యర్థిగా డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని ఫైనల్ చేశారు. జగన్ మాటగా జిల్లా పార్టీ ఇంఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఎమ్మెల్యే వెళ్లినా క్యాడర్ ఉండటంతో…

గత ఎన్నికల్లో వైసీపీ తరపున కదిరి నియోజకవర్గంలో అత్తార్ చాంద్ పాషా… మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై విజయం సాధించారు. చాంద్ పాషా విజయానికి జగన్ ప్రభావం దోహదపడగా ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం మరో కారణం. అయితే, ఆయన పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా విప్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, చాంద్ పాషా స్థానంలో ఎవరైనా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తికి జగన్ టిక్కెట్ ఇస్తారని మొదట భావించారు. అయితే, జగన్ మాత్రం విద్యావంతుడైన పీవీ సిద్ధారెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయనను వెంటనే ఇంఛార్జిగా నియమించారు. దీంతో సిద్ధారెడ్డి పార్టీ కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. చాలారోజులుగా ఆయన నిత్యంత ప్రజల్లో ఉంటుండటంతో మంచి గుర్తింపు లభించింది. చాంద్ పాషా పార్టీ మారినా వైసీపీ క్యాడర్ మాత్రం ఎక్కువగా పార్టీలోనే ఉంది. ఇది కూడా కలిసి రావడంతో సిద్ధారెడ్డి త్వరగానే పార్టీని నియోజకవర్గంలో పరుగులు పెట్టించారు.

కదిరిని తిరిగి దక్కించుకునే వ్యూహం…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తుండటం, ఆర్థికంగానే ఖర్చుకు వెనుకాడకపోవడంతో సిద్ధారెడ్డి వైసీపీని నియోజకవర్గంలో బలంగా ఉంచగలిగారు. ఇక్కడ జగన్ పాదయాత్రకు కూడా మంచి స్పందన లభించింది. అప్పుడే సిద్ధారెడ్డి పనితీరును గుర్తించిన జగన్… ఇంచుమించు ఆయనే అభ్యర్థి అనే క్లారిటీకి వచ్చారు. పాదయాత్ర తర్వాత అభ్యర్థులపై దృష్టిపెట్టిన జగన్.. సిద్ధారెడ్డి పేరుపై టిక్ చేశారు. దీంతో మిథున్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ బలంగా ఉండటం, నియోజకవర్గంలో తనకు వ్యక్తిగతంగా మంచి పేరు రావడం, జగన్ ఇమేజ్ తో తన విజయం ఖాయమని సిద్ధారెడ్డి ధీమాతో ఉన్నారు. ఇక, టీడీపీలో చాంద్ పాషాతో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిన కందికుంట వెంకటప్రసాద్ కి విభేదాలు తనకు కలిసివస్తాయని సిద్ధారెడ్డి భావిస్తున్నారు. టీడీపీలో ఎవరికి టిక్కెట్ వచ్చినా ఇంకొకరు పూర్తిస్థాయిలో సహకరించడం అనుమానమే. ఇక, ముస్లిం ఓట్ల కోసం కూడా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. మొత్తానికి గత ఎన్నికల్లో కదిరిని దక్కించుకుని కోల్పోయిన వైసీపీ ఈసారి తిరిగి పాగా వేయాలని పట్టుదలతో ఉంది.

Tags:    

Similar News