అందరి బంధువయా

పదవుల కోసం, భోగభాగ్యాల కోసం అర్రులు చాస్తుంటారు చాలామంది నేతలు. అందుకోసం అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికే తమ సర్వశక్తులను ధారపోస్తుంటారు. వారి ప్రాపకం పొందడానికి ఎంతగానైనా దిగజారిపోతుంటారు. [more]

Update: 2019-07-29 05:00 GMT

పదవుల కోసం, భోగభాగ్యాల కోసం అర్రులు చాస్తుంటారు చాలామంది నేతలు. అందుకోసం అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికే తమ సర్వశక్తులను ధారపోస్తుంటారు. వారి ప్రాపకం పొందడానికి ఎంతగానైనా దిగజారిపోతుంటారు. పార్టీ కంటే ప్రజాస్వామ్యమే గొప్పదని మనసావాచా కర్మణా నమ్మేవారు అరుదుగా కనిపిస్తారు. దేశమౌలిక సూత్రమైన డెమొక్రసీని పరిరక్షించుకోవడానికి అధిష్టానంతోనే తలపడటం అసాధారణ విషయం. విలువల కోసం పార్టీనే పక్కన పెట్టడం విలువల వైశిష్ట్యం. అందుకే జైపాల్ రెడ్డి మహాప్రస్థానం పట్ల పార్టీలకతీతంగా రాజకీయరంగం మౌననివాళులర్పిస్తోంది. పరస్పరం ముఖాముఖాలు చూసుకోలేని రాజకీయ వాతావరణం నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో అజాతశత్రువు అన్న పదమే అంటరానిదిగా మారిపోయింది. అనర్గళ వాగ్ధాటి, అద్భుత విషయపరిజ్ణానం, అపరిమిత ప్రపంచరాజకీయం అపోసన పట్టిన జైపాల్ రెడ్డి అందరి బంధువయా అని పిలిపించుకోగలిగిన ఏకైక రాజకీయవేత్త. తాను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ మొదలు అంటీముట్టనట్లు వ్యవహరించే కమ్యూనిస్టు పార్టీ లకు చెందిన వారి వరకూ జాతీయంగా జైపాల్ రెడ్డి తో వ్యక్తిగతంగా విభేదించేవారు ఏ ఒక్కరూ కనిపించకపోవడమే జైపాల్ వ్యక్తిత్వానికి నిదర్శనం. సైద్ధాంతికంగా తూర్పారపట్టి ఎంతటి పెద్ద నాయకుడినైనా రోడ్డున నిలబెట్టగల మేధా సంపత్తి జైపాల్ రెడ్డి సొంతం. అందులో లోతైన విషయం, దేశ ప్రయోజనాలే పరమావధి కావడంతో పార్టీ పరంగా విభేదించే నాయకులు సైతం ఆయనను వ్యక్తిగతంగా మెచ్చుకుంటారు. అయిదు దశాబ్దాల పైచిలుకు ప్రజాజీవితంలో జైపాల్ రెడ్డి చూడని లోతులు లేవు. ఎదగని ఎత్తులు లేవు. పదవుల కంటే తాను నమ్మిన సిద్దాంతాలకే విలువనిచ్చే వ్యక్తి కావడం వల్ల మహోన్నత రాజ్యాంగ బాధ్యతలను అనేక సందర్భాల్లో త్యాగం చేయాల్సి వచ్చింది.

పార్టీ కంటే ప్రజాస్వామ్యమే మిన్న…

దేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించించడాన్ని జైపాల్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆయన తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీనే విడిచిపెట్టేశారు. ఇందిరాగాంధీ వంటి బలమైన నేతకే ఎదురొడ్డి నిలిచారు. తర్వాత కాలంలో ఆయన ఎదుర్కొన్న చిక్కులు అన్నీ ఇన్నీకావు. కానీ ప్రజాభిమానంతో అన్నిటినీ ఎదుర్కొంటూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే సుదీర్ఘ రాజకీయ జీవితంతో జైపాల్ రెడ్డి రికార్డు సృష్టించగలిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు లోక్ సభ సభ్యునిగా , రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసినప్పటికీ ఎక్కడా అవినీతి ముద్ర పడకపోవడం విశేషం. రెండుసార్లు కేంద్ర సమాచారమంత్రిగా, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా, పెట్రోలియం మంత్రిగా అనేక కీలకపదవులు నిర్వహించారు. రాజకీయంగా ఎవరి ప్రాపకం అవసరం లేకుండా పూర్తిగా విషయపరిజ్ణానం, అంకితభావంతో ఎదగవచ్చని నిరూపించిన నేత జైపాల్ రెడ్డి. తొలిదశలో ఎన్టీయార్ ను వ్యతిరేకించారు జైపాల్ రెడ్డి. కానీ 1984లో ప్రజాస్వామ్య విరుద్దంగా ఎన్టీయార్ ను పదవి నుంచి దింపేసిన తర్వాత ఆయనకు జైపాల్ రెడ్డి మద్దతునిచ్చారు. 1995లో టీడీపీ పార్టీ తిరుగుబాటులో ఎన్టీయార్ పదవి కోల్పోయిన సందర్భంలో సైతం నైతికంగా ఎన్టీయార్ కే మద్దతు ప్రకటించారు . నిజానికి చంద్రబాబు నాయుడితో జైపాల్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి అయినప్పటికీ తన మొగ్గు ఎన్టీయార్ వైపే అన్నారు.

పదవి కంటే..విలువలే గొప్ప..

పీవీ నరసింహారావు వంటి నాయకులు తమ మంత్రివర్గంలోకి రమ్మని చిన్నవయసులోనే జైపాల్ రెడ్డి కి ఆహ్వానం పలికారు. అతనిలోని మేధాశక్తి, పోరాటతత్వాన్ని చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి పీవీ తన ప్రత్యర్థి వర్గానికి మద్దతుగా ఉన్నప్పటికీ 1970లలో జైపాల్ రెడ్డి ని రాష్ట్ర కేబినెట్ లోకి ఆహ్వానించారు. కానీ తాను కాసు బ్రహ్మానందరెడ్డి కి శిష్యుడిని కాబట్టి మీకు మద్దతుగా మంత్రిని కాలేనని తేల్చి చెప్పి 30 ఏళ్ల వయసులోనే తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. తనకు పదవీ లాలసత లేదని చిన్నవయసులోనే చాటిచెప్పారు. అలాగే ఎన్టీరామారావు సైతం తనమంత్రివర్గంలోకి రావాలని కోరినప్పటికీ ఆయన వ్యవహారశైలి తనకు సరిపడదని తేల్చి చెప్పేశారు జైపాల్ రెడ్డి . అటల్ బిహారీ వాజపేయి లోక్ సభ స్పీకర్ పదవికి జైపాల్ ను అభ్యర్థిగా పెట్టాలని రాయబారం నడిపారు. నిర్మొహమాటంగా, నిర్ద్వంద్వంగా అంతటి పెద్ద రాజ్యాంగపదవిని వద్దనుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా తాత్కాలికంగా ఉపశమింపచేయవచ్చని కాంగ్రెసు అధిష్ఠానం భావించింది. సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ అధిష్ఠానం తనను ఉపకరణంగా చేసుకుంటూ ప్రజల డిమాండ్ ను పక్కనపెట్టాలని భావిస్తోందని గ్రహించిన ఆయన తిరస్కరించారు. జీవితకాలపు అవకాశాన్ని అవకాశవాదంతో చేజిక్కించుకోకూడదన్న నియమమే ఆయనను నిరోధించింది.

దేశం కోసం…రాష్ట్రం కోసం…

దేశంలో అతిపెద్ద పారిశ్రామిక కార్పొరేట్ లాబీ అయిన అంబానీలకు వ్యతిరేకంగా వెళ్లడమంటే చిన్నాచితక విషయం కాదు. పెట్రోలియం రంగంలో అంబానీలకు అనుచిత లబ్ధి చేకూరకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా జైపాల్ రెడ్డి తన నిజాయతీని నిరూపించుకున్నారు. కేంద్రప్రభుత్వం ఆయనకు నచ్చ చెప్పలేక పోర్టు ఫోలియోనే మార్చేసింది. ఆ సందర్భంలో జైపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన ఆ సన్నివేశంలో తాను కేంద్ర కేబినెట్ లో ఉండటం అవసరమని భావించి కొనసాగారు. 1969 ఉద్యమ సమయంలో పక్కా సమైక్యవాదిగా ఉన్న జైపాల్ రెడ్డి 2009 తర్వాత తెలంగాణ వాదనకు బలమైన మద్దతుగా మారారు. నిజానికి ఆంధ్రప్రాంతం ప్రతినిధులు రాష్ట్ర విభజనను బలంగా వ్యతిరేకించారు. కాంగ్రెసు అధిష్ఠానంపై చివరిక్షణం వరకూ ఒత్తిడి తెచ్చారు. విభజన బిల్లు పాస్ చేయడం సాధ్యం కాదని అధిష్టానమే చేతులెత్తేసిన తరుణంలో తనకున్న రాజ్యాంగ , రాజకీయ పరిజ్ణానాన్ని, విదేశీ చట్టసభల ఉదాహరణలను వెలికితీసి స్పీకర్ కు, కాంగ్రెసుకు తరుణోపాయం బోధించింది జైపాల్ రెడ్డే. తద్వారా తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. దీర్ఘకాలంగా ప్రజల ఆకాంక్షగా మిగిలిపోయిన డిమాండ్ సాకారమయ్యేందుకు తనవంతు పాత్ర పోషించారు. అదే రాజకీయంగా జైపాల్ నిర్వర్తించిన చివరి కర్తవ్యంగా చెప్పుకోవచ్చు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News