గంతులు వేస్తే.. ఈ గతి తప్పదా?

సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉండి కూడా త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను కానీ, త‌న‌కంటూ.. ఓ రాజ‌కీయ పుస్తకాన్ని రూపొందించుకోలేక పోయిన విజ‌య‌వాడ నేత‌గా జ‌నాబ్ జ‌లీల్ ఖాన్ ఉర‌ఫ్ [more]

Update: 2020-05-10 06:30 GMT

సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉండి కూడా త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను కానీ, త‌న‌కంటూ.. ఓ రాజ‌కీయ పుస్తకాన్ని రూపొందించుకోలేక పోయిన విజ‌య‌వాడ నేత‌గా జ‌నాబ్ జ‌లీల్ ఖాన్ ఉర‌ఫ్ బీకాంలో ఫిజిక్స్ నిలిచిపోయారని అంటున్నారు విశ్లేష‌కులు. క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క ‌వ‌ర్గంలో గెలిచిన నాయ‌కుడు జ‌లీల్ ఖాన్‌. త‌ర్వాత ప్రస్తుత మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు. జ‌లీల్ ఖాన్ కాంగ్రెస్‌లో ఉండ‌గా, త‌ర్వాత వైసీపీలో ఉండ‌గా ఇక్కడ విజ‌యం సాధించారు. నిజానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కసారి గెలిచిన నాయ‌కులు కూడా త‌మ‌కంటూ చ‌రిత్రను నిల‌బెట్టుకున్నారు. వారే మరిపిళ్ల చిట్టి. ఈయ‌న పేరుతో ఏకంగా చిట్టి న‌గ‌ర్ ఏర్పడింది.

మంత్రిపదవిపై ఆశతో….

కానీ, జ‌లీల్‌ఖాన్ ప‌లుమార్లు గెలిచారు. అయినా కూడా ఆయ‌న గుర్తుండిపోయే రాజ‌కీయాలు మాత్రం చేయలేక పోయార‌ని ఇక్కడి ప్రజ‌లే అంటున్నారు. ఎంత సేపూ త‌న స్వార్థం కోస‌మే ఆయ‌న ప్రయ‌త్నిం చార‌ని త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే .. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చీలిపోయారు. ఫ‌లితంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ,తన కుమార్తె ష‌బానా ఖ‌తూన్ ను నిల‌బెట్టినా.. ప్రయోజ‌నం లేకుండా పోయింది. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన జ‌లీల్ ఖాన్‌ త‌ర్వాత మంత్రి ప‌ద‌విపై మోజుతో చంద్రబాబు చెంత‌కు చేరి.. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఈ ప‌రిణామంతో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అనుకున్నారు.

కూతురిని రంగంలోకి దించి…

మైనార్టీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్రబాబు జ‌లీల్ ఖాన్‌ను పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వకుండా ఓ నామినేటెడ్ ప‌ద‌వితో స‌రిపెట్టేశారు. కానీ, బీకాంలో ఫిజిక్స్ చ‌దివాన‌ని ఓ వెబ్ ఛానెల్‌తో ఆయ‌న చేసిన వాద‌న‌.. ఆయ‌న ప‌రువు తీసింది. ఇది అప్పట్లో ప్ర‌తిప‌క్షాల‌కు వ‌రంగా మారింది. చివ‌ర‌కు ఇది కూడా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కక‌పోవ‌డానికి ఓ కార‌ణం. ఇక‌, 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్యల‌తో అల్లాడుతూ. కుమార్తె ఖ‌తూన్‌ను రంగంలోకి దింపారు. ఆమె కూడా విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, ఇప్పుడు ఆమె అమెరికాకు చెక్కేసి వ్యాపారాలు చ‌క్కపెట్టుకుంటున్నారు.

టీడీపీకి ఛాన్స్ లేకపోవడంతో…

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వారి లోనూ ప‌ట్టులేక‌పోవ‌డం జ‌లీల్ ఖాన్‌కు శాపంగా మారింది. టీడీపీ ఎదిగే ప‌రిస్థితి లేదు. ఎదిగినా.. ప‌శ్చిమ‌లో టీడీపీ ఇప్పటి వ‌ర‌కు ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా గెలిచిన (అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 1983లో మిన‌హా ) హిస్టరీలేదు. దీంతో జ‌లీల్ ఖాన్ ఇక రాజ‌కీయాల‌కు దూర‌మ‌వ‌డం త‌ప్ప మ‌రో దారిలేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోనీ.. ఏదో సీనియ‌ర్‌గా స‌ల‌హాలు ఇద్దామ‌న్నా.. బీకాంలో ఫిజిక్స్ అనే ముద్ర ఉండ‌డంతో ఆయ‌న‌ను ఎవ‌రూ సంప్రదించ‌డం లేదు. ఆయ‌న స‌ల‌హా ఇచ్చినా.. న‌వ్వుకుంటున్నారు. ఇదీ జ‌లీల్ ఖాన్‌ ప‌రిస్థితి. ఇక ప‌శ్చిమలో ప‌ట్టుకోసం ఎంపీ కేశినేని నాని, బుద్ధా వెంక‌న్న వార్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌లీల్ ఖాన్‌ డ‌మ్మీగా ఉండ‌డం త‌ప్ప చేసేదేం లేదంటున్నారు.

Tags:    

Similar News