టీడీపీలో మరో వికెట్ అవుట్
ఇప్పటికే పార్టీ నాయకుల జంపింగులతో తీవ్ర ఇక్కట్లలో మునిగిపోయిన కృష్ణాజిల్లా టీడీపీలో మరో పెను కలకలం చోటు చేసుకోనుంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనకంటూ పట్టు [more]
ఇప్పటికే పార్టీ నాయకుల జంపింగులతో తీవ్ర ఇక్కట్లలో మునిగిపోయిన కృష్ణాజిల్లా టీడీపీలో మరో పెను కలకలం చోటు చేసుకోనుంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనకంటూ పట్టు [more]
ఇప్పటికే పార్టీ నాయకుల జంపింగులతో తీవ్ర ఇక్కట్లలో మునిగిపోయిన కృష్ణాజిల్లా టీడీపీలో మరో పెను కలకలం చోటు చేసుకోనుంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనకంటూ పట్టు పెంచుకున్న జనాబ్ జలీల్ ఖాన్ మరోసారి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికి ఆయన రెండు సార్లు పార్టీ మారారు. ఆదిలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన జలీల్ ఖాన్ పశ్చిమ నియోజకవర్గం రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయారు. తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. స్థానికంగా ముస్లిం మైనారిటీ వర్గం ఎక్కువగా ఉన్నందున వారిని తనవైపు తిప్పుకొన్నారు.
పార్టీలు వరసగా మారుతూ….
తాను ఏ పార్టీలో ఉన్నా.. వారితో జై కొట్టించుకున్నారు. కాంగ్రెస్‌లో ఉండగా కూడా ఆయన సంచలనాలకు తెరదీశారు. అప్పటి పార్టీ అధ్యక్షుడు డీఎస్‌తో విభేదించారు. 2004 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సీటు ఇవ్వకుండా కమ్యూనిస్టులకు ఇవ్వడంతో ఆయన డీఎస్‌తో పాటు వైఎస్‌పై కూడా ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి వైఎస్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. ఈ క్రమంలోనే ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్‌కు జై కొట్టి వైసీపీ తరఫున 2014లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇక, మంత్రి పదవిపై మోజుతో చంద్రబాబుకు జై కొట్టారు. 2017లో అనూహ్యం గా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కూతురిని రంగంలోకి దింపినా…..
అయితే, అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి అన్నవిధంగా పరిస్థితి మారి.. మంత్రి పదవికి ఆయన దూరమయ్యారు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల నాటికి ఆయన అనారోగ్యంతో ఉండడంతో తన కుమార్తె షబానా ఖతూన్‌ను రంగంలోకి దింపారు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటోన్న ఖతూన్‌ను పట్టుబట్టి మరీ ఎంతమంది పోటీలో ఉన్నా బాబును ఒప్పించి సీటు జలీల్ ఖాన్ ఇప్పించుకున్నారు. ఖతూన్ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ సునామీ ముందు ఎన్నారై అయిన ఖతూన్ నిలబడలేక పోయారు. ఇక, అప్పటి నుంచి జలీల్ ఖాన్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
బాబుకు లేఖ రాసినా…..
కొన్ని రోజులు ఆరోగ్య సమస్యలని చెప్పినా.. వాస్తవానికి తన కుమార్తె ఓటమికి.. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఇద్దరు లోపాయికారీగా పనిచేశారని, సహకరించలేదని ఆయన తన అనుచరుల వద్ద ప్రస్తావించారు. అంతేకాదు, ఈ విషయాన్ని లేఖ రూపంలో ఆయన చంద్రబాబుకు కూడా వివరించారు. ఎమ్మెల్సీ వెంకన్న, నాగుల్ మీరాలే తన కుమార్తె ఓటమికి కారణాలుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే, జలీల్ ఖాన్ లేఖపై చంద్రబాబు ఇప్పటికి కూడా స్పందించలేదు. పైగా, నువ్వు ఇప్పుడు పార్టీలోకి వచ్చావు. వాళ్లు ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నారు. వారేంటో నాకు తెలియదా? అని ఎదురు ప్రశ్నించినట్టు జలీల్ ఖాన్ కు తెలిసింది.
జెండా కూడా తీసేశారే….
దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై.. అప్పటి నుంచి తన ఇంటిపై ఉండే టీడీపీ జెండాను సైతం తొలగించినట్టు ఆయన అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిలావుంటే, మళ్లీ వైసీపీలోకి వెళ్లేందుకు జలీల్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈయనను జగన్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాస్‌కు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ తో అవసరం లేదనే భావన వైసీపీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు ఇచ్చిన అనేక నిరసన పిలుపులకు ఒక్కదానికి కూడా జలీల్ స్పందించలేదు. పైగా ఇసుక దీక్ష వృధా అని తన అనుచరులతో అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మొత్తానికి జలీల్ ఖాన్ పయనం ఎటో తేలాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే.