పెద్దాయన పంట పండినట్లేనా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరోసారి టీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీటును తిరిగి నిలుపుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, మరోసారి దుబ్బాక ఫలితాన్ని తెచ్చుకోవాలని బీజేపీ [more]

Update: 2020-12-06 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరోసారి టీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీటును తిరిగి నిలుపుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, మరోసారి దుబ్బాక ఫలితాన్ని తెచ్చుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే రెండు పార్టీలూ వ్యూహరచనను ప్రారంభించాయి. ఇప్పటి నుంచే నాగార్జున సాగర్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. బీజేపీ కూడా అక్కడ బలమైన అభ్యర్థి కోసం వెదుకులాటను ప్రారంభించింది.

మంచి పట్టుండటంతో….

నిజానికి నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మంచి పట్టుంది. ఆయన అక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి జానారెడ్డి అక్కడే తన పట్టును పెంచుకుంటూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో మాత్రం నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. జానారెడ్డి వయసు రీత్యా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని గత ఎన్నికల్లోనే నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దింపాలనుకున్నా హైకమాండ్ అంగీకరించలేదు.

టీఆర్ఎస్ ఆఫర్…?

నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీఆర్ఎస్ పార్టీ జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ నోముల నరసింహయ్య కుటుంబం నుంచి ఎవరూ పెద్దగా పోటీ పడకపోవడం, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రిపీట్ కాకూడదని ఎలాగైనా జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి తేవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది.

బీజేపీ కూడా అదే బాటలో….

అయితే అదే సమయంలో బీజేపీ కూడా రఘువీర్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టిందంటున్నారు.టీఆర్ఎస్ లోకి వెళితే వంద మందిలో ఒకరుగా ఉంటారని, బీజేపీలో అయితే ప్రధాన భూమిక పోషించవచ్చని బీజేపీ జానారెడ్డి కుమారుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక వరస ఓటములతో దిగాలుపడిన కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి కుటుంబమే దిక్కు. అందుకే ఆయనను పార్టీ నుంచి వెళ్లకుండా కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. జానారెడ్డి కుమారుడి కోసం మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఆయన ఎటు మొగ్గు చూపుతారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ప్రచారంగా కొట్టి పారేస్తుంది.

Tags:    

Similar News