కిందోళ్లు కలిశారుగా.. ఇక మీరేనా?

స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమయింది. అధిష్టానం ఆలోచనో, స్థానిక నేతలు తీసుకున్న నిర్ణయమో తెలియదు కాని పంచాయతీ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు [more]

Update: 2021-02-27 00:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమయింది. అధిష్టానం ఆలోచనో, స్థానిక నేతలు తీసుకున్న నిర్ణయమో తెలియదు కాని పంచాయతీ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారి తీశాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జనసేన, బీజేపీ లు కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నిస్తున్నా ఆ పార్టీ పక్కన పెడుతుంది. జనసేనను అయినా కలుపుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి ఒంటరిగా పోటీ చేయకూడదని, జనసేనతో కలసి వెళ్లడమే బెటర్ అన్నది చంద్రబాబు అభిప్రాయం కూడా.

ఇప్పటికిప్పడు…..

కానీ జనసేన ఇప్పుడు బీజేపీతో కలసి పనిచేస్తుంది. ఆ కూటమి నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు మాత్రం లేవు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పవన్ కల్యాణ్ టీడీపీ వైపు ఇప్పట్లో మొగ్గు చూపరంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విడిగానే పోటీ చేస్తుంది. అభ్యర్థిగా పనబాక లక్ష్మిని కూడా ప్రకటించింది.

పంచాయతీ ఎన్నికలలో మాత్రం…..

అయితే పంచాయతీ ఎన్నికలు రాజకీయ సమీకరణాలను మార్చాయి. అనేక ప్రాంతాల్లో జనసేనకు టీడీపీ మద్దతిచ్చింది. అలాగే టీడీపీకి అనేక పంచాయతీల్లో జనసేన మద్దతిచ్చింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగింది. పార్టీ గుర్తు లేకుండా ఎన్నికలు జరగడంతో ఇవి పెద్దగా వెలుగు చూడలేదు. రెండు పార్టీలు కలసి పనిచేయడంతోనే జనసేనకు ఈ స్థానాలైనా దక్కాయంటున్నారు.

అనేక చోట్ల ఒప్పందాలు…..

కానీ అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే జనసేనతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. అధికార పార్టీ నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకోవడంతో రెండు పార్టీలు కలసి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ఈ ప్రయోగాన్ని చాలా చోట్ల చేసినట్లు కనపడుతుంది. జనసేనకు పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు ఏపీ రాజకీయ సమీకరణాలు మార్చేశాయనే చెప్పాలి. బీజేపీని వదిలి జనసేన టీడీపీ వైపు చేరుతుందా? లేదా కమలం పార్టీని కూడా కలుపుకుని వస్తుందా? అన్నది టీడీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News