టీడీపీనే క‌రెక్టా…? జ‌న‌సేనలో అంత‌ర్మథ‌నం

ఏపీలో కీల‌క పార్టీగా ఉన్న జ‌న‌సేన.. ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకునే విష‌యంలో త‌డ‌బ‌డుతోందా ? ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో నేత‌ల‌తో సంబంధం [more]

Update: 2021-01-02 12:30 GMT

ఏపీలో కీల‌క పార్టీగా ఉన్న జ‌న‌సేన.. ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకునే విష‌యంలో త‌డ‌బ‌డుతోందా ? ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో నేత‌ల‌తో సంబంధం లేకుండా అధినేత ప‌వ‌న్ కల్యాణ్ వ్యవ‌హ‌రిస్తున్నారా? దీంతో పార్టీలోని కీల‌క నాయ‌కులు కినుక వ‌హించి దూరంగా ఉంటున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా ఎవ‌రిని అడిగి ప‌వ‌న్ పొత్తుల‌కు వెళ్తున్నారో.. తెలియ‌దు కానీ, ఆయ‌న తీసుకుంటున్న నిర్ణయాల‌తో మేం మొహం ఎత్తుకోలేక పోతున్నాం.. అంటూ.. ముఖ్యమైన నాయ‌కులు ఆఫ్ ది రికార్డుగా ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. 2014కు ముందు పార్టీలో ఉన్నవారు ఈ విష‌యంలో మ‌రీ ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లో పోటీ చేద్దామంటే…?

“అప్పట్లో టీడీపీ-బీజేపీతో క‌లిసి ముందుకు సాగారు. వాస్తవానికి అప్పట్లోనే పోటీకి దిగుదామ‌ని.. మేం కోరాం. కానీ.. కొత్త పార్టీ అంటూ.. మెలిక పెట్టి.. ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. ఆ త‌ర్వాత‌.. మేం వ‌ద్దని చెబుతున్నా విన‌కుండా.. ఆ రెండు పార్టీల‌తోనూ పొత్తు తెంచుకున్నారు. స‌రే.. ఒంట‌రిగి బ‌లోపేతం చేస్తామ‌ని మేం కూడా హామీ ఇచ్చాం. మాకు కొంత గైడ్‌లైన్స్ ఇవ్వాల‌ని మాత్రమే మేం కోరాం. కానీ, ఈ విష‌యంలో నాన్చుడు ధోర‌ణి అవ‌లంభించి.. తిరిగి బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. దీంతో చాలా మంది జనసేన నాయ‌కులు పార్టీకి దూర‌మ‌య్యారు. ఎవ‌రూ మ‌న‌సు విప్పి మాట్లాడ‌లేక పోతున్నారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌లేక పోతున్నారు“ అని కొంద‌రు చెప్పారు.

ఎటు జరిగినా….?

మ‌రికొంద‌రు.. “బీజేపీకి ఏం బ‌లం ఉంద‌ని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో తెలియ‌డం లేదు. ఏదైనా పార్టీ జ‌న‌సేన‌ను అడ్డు పెట్టుకుని బ‌లోపేతం కావాల్సిందే. ఇక‌, ఇప్పుడు బీజేపీ కూడా అంతే. కానీ, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో టికెట్ విష‌యంలో మొహం చాటేస్తున్న బీజేపీతో క‌లిసి ఎలా ప‌నిచేస్తాం. టికెట్ ఇవ్వక‌పోతే.. జ‌న‌సేన బ‌య‌ట‌కు వ‌చ్చినా.. అప్పుడు ఎలాంటి ప్రయోజ‌నం ఉండ‌దు. కేవ‌లం రాజ‌కీయ ప్రయోజ‌నం కోస‌మే.. మాతో జ‌ట్టుక‌ట్టారు అంటూ.. రేపు బీజేపీ నేత‌లు వ్యతిరేక ప్రచారం చేసే అవ‌కాశం ఉంది. పోనీ.. టికెట్ ఇవ్వక‌పోయినా.. క‌లిసి ప‌నిచేస్తే.. జ‌న‌సేన దిగిజారిపోయింద‌ని.. అవ‌మానించినా.. బీజేపీతోనే క‌లిసి చేతులు క‌లిపింద‌ని.. ప్రచారం జ‌రుగుతుంది“ అని మ‌రికొంద‌రు పెద‌వి విరుస్తున్నారు.

టీడీపీతో లేకుంటే..?

ఇక‌, పార్టీలో ఉంటూనే ఒకింత త‌ట‌స్థంగా ఉండే నాయ‌కులు మ‌రో వాద‌న చేస్తున్నారు. “టీడీపీతో ఉండ‌డ‌మే మాకు క‌రెక్ట్‌. ఆ పార్టీపై ప్రజ‌ల్లో విశ్వస‌నీయత ఉంది. క్యాడర్ ఉంది. హోదా కోసం.. ఆదిలో ఎలా ఉన్నా.. త‌ర్వాత .. దీని కోస‌మే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌నే సానుభూతి ఉంది. ఇక‌, రాజ‌ధాని కోసం ప‌ట్టువ‌ద‌ల కుండా పోరాడుతున్న పార్టీగా కూడా టీడీపీకి మంచి మార్కులు ప‌డ్డాయి. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్రభత్వంపై పోరాడుతున్న పార్టీగా కూడా సానుభూతి ఉంది. టీడీపీతో ఉండి.. పోరాటాలు చేస్తే.. మేం ఎదుగుతాం. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అంతో ఇంతో స్థిర‌ప‌డ‌తాం. లేక‌పోతే.. చేతులు ఎత్తేయ‌డ‌మే“ అని మొహ‌మాటం లేకుండా చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ ఇప్ప‌టికైనా ఆలోచిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News