జ‌న‌సేన‌కు గెలుపు ఛాన్స్ ఉన్నా… మిస్ చేసుకుంటున్నారే?

బెజ‌వాడ రాజ‌కీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. యువ‌త ఎక్కువ‌. రాజ‌కీయాలు కూడా ఎక్కువ‌గానే చేస్తారు. పైగా వ్యాపార‌, పారిశ్రామిక వ‌ర్గాలు కూడా ఇక్కడ రాజ‌కీయంగా దూకుడు ప్రద‌ర్శిస్తాయి. [more]

Update: 2020-12-28 03:30 GMT

బెజ‌వాడ రాజ‌కీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. యువ‌త ఎక్కువ‌. రాజ‌కీయాలు కూడా ఎక్కువ‌గానే చేస్తారు. పైగా వ్యాపార‌, పారిశ్రామిక వ‌ర్గాలు కూడా ఇక్కడ రాజ‌కీయంగా దూకుడు ప్రద‌ర్శిస్తాయి. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఈ న‌గ‌రం.. త‌ర్వాత త‌ర్వాత టీడీపీ వైపు మ‌ళ్లింది. ఇక‌, గ‌త ఎన్ని‌క‌ల్లో టీడీపీ-వైసీపీ రెండు పార్టీల‌కూ ప్రజ‌లు ప‌ట్ట‌క‌ట్టారు. అదే స‌మ‌యంలో మూడో పార్టీకి కూడా ఇక్కడ ఎదిగేందుకు ఛాన్స్ ఉంది. గ‌తంలో ప్రజారాజ్యం పార్టీ త‌ర‌ఫున ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ప్ర‌స్తుత మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ గెలుపు గుర్రం ఎక్కడ‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌. అంటే.. బెజ‌వాడ‌లో మూడో పార్టీని ప్రజ‌లు ఆద‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు. పైగా న‌గ‌రంలో బ్రాహ్మణులు, క‌మ్మల‌తో పాటు కాపులు కూడా బ‌లంగా ఉన్నారు.

అవకాశం ఉన్నప్పటికీ…..

బెజ‌వాడ రాజ‌కీయాల్లో కాపుల‌దే నిర్ణయాత్మక శ‌క్తి. 2009 ఎన్నిక‌ల్లో న‌గ‌రంలో ప‌శ్చిమంతో పాటు తూర్పు సీటును కూడా గెలిచిన ప్రజారాజ్యం, సెంట్రల్ సీటును కేవ‌లం 600 ఓట్లతో కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాపులు చాలా మంది జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు. ఈ విష‌యం తెలుసో.. లేదో కానీ.. ఛాన్స్ ఉన్నా.. మూడో పార్టీ జ‌న‌సేన ఇక్కడ మాత్రం పుంజుకునేందుకు ప్రయ‌త్నించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. బెజ‌వాడ అంటేనే ప‌వ‌న్ ఫ్యాన్స్ అడ్డా. గ‌తంలో ఆయ‌న ఇక్కడ నిర్వహించిన స‌భ‌ల‌కు కూడా యువ‌కులు భారీగా త‌ర‌లి వ‌చ్చి ప‌వ‌న్ సీఎం కావాలంటూ.. నినాదాలతో హోరెత్తించేవారు.

గత ఎన్నికల్లో మాత్రం….

ఈ క్రమంలోనే ప‌వ‌న్ కాస్త క‌ష్టప‌డితే బెజ‌వాడ‌లో జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయ‌న్నది వాస్తవం. అయితే ప్రజారాజ్యం బ‌లంలో జ‌న‌సేన‌కు స‌గం కూడా లేద‌ని గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలే చెపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల విష‌యాన్ని చూస్తే.. తొలిసారి రాజ‌కీయాల్లో టికెట్ పొందిన యువ నాయ‌కులు జ‌న‌సేన త‌ర‌ఫున రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. పొత్తులో భాగంగా సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని సీపీఎంకు త్యాగం చేసిన ప‌వ‌న్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న అభ్యర్థుల‌ను నిల‌బెట్టారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోతిన వెంక‌ట మ‌హేష్‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌త్తిన రాము పోటీ చేశారు. జ‌గ‌న్ సునామీలో వీరిద్దరికి ఓట‌మి ఎదురైంది. అయితే.. మంచి ఓట్లే సాధించారు. బ‌త్తిన రాము.. 23 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇక‌, వెంక‌ట మ‌హేష్‌.. 33 వేల ఓట్ల పైచిలుకు సాధించారు.

ఎవరూ పట్టించుకోక పోవడంతో…..

ఈ ఓట్లను బ‌ట్టి చూస్తే ఎంతో కొంత కృషి చేస్తే ఇక్కడ జ‌న‌సేన పుంజుకునేందుకు అవ‌కాశం క‌నిపిస్తోంది. వెంక‌ట‌మ‌హేష్‌.. కొంత మేర‌కు ఫ‌ర్వాలేద‌నేలా వ్యవ‌హ‌రిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో స‌మ‌స్యల‌పై ఆయ‌న స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇక‌, రాము.. అస‌లు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఏదేమైనా యువ‌కుల్లో ఉత్సాహంగా ఉన్న నాయ‌కుల‌కు ఇక్కడ పార్టీ ప‌గ్గాలు అప్పగిస్తే బెజ‌వాడ రాజ‌కీయాల్లో జ‌న‌సేన స‌త్తా చాటే అవ‌కాశం ఉంది. త్వర‌లోనే బెజ‌వాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు రానున్నాయి. ఇలా ప‌ట్టున్న ప్రాంతాల్లో అయిన ప‌వ‌న్ పార్టీని పుంజుకునేలా కార్యాచార‌ణ రూపొందిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన కొన్ని చోట్ల అయినా ప్రత్యామ్నాయ శ‌క్తిగా ఎదిగే సువ‌ర్ణావ‌కాశం ఆ పార్టీకి ఉంది.

Tags:    

Similar News