ఈ ఇద్దరూ చేరెదెటకో తెలుసా?

విశాఖ జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకుల పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. వారు అతి ఉత్సాహంతో జనసేనలో చేరిపోయారు. నిన్నటి ఎన్నికల్లో పోటీ చేసి షరా మామూలుగా [more]

Update: 2020-02-02 13:30 GMT

విశాఖ జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకుల పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. వారు అతి ఉత్సాహంతో జనసేనలో చేరిపోయారు. నిన్నటి ఎన్నికల్లో పోటీ చేసి షరా మామూలుగా పరాజయం పాలు అయ్యారు. ఈ మధ్యనే వారు పార్టీతో కూడా ఉన్న బంధాలను తెంపుకున్నారు. పవన్ కల్యాణ్ పోకడలు నచ్చడంలేదని బహిరంగంగానే చెప్పేశారు. వారి అడుగులు వైసీపీ వైపేనని అంతా అనుకున్నా ఇప్పటికి కొన్ని నెలలుగా వారు మౌన ముద్ర వీడడంలేదు. మరి వారు వైసీపీలోకి వస్తారా? లేక రాజకీయాల నుంచే తప్పుకుంటారా? అన్నది ఒక చర్చగా ఉంది.

మాజీ మంత్రిగా….

దాదాపుగా మూడున్నర దశాబ్దాల రాజకీయం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుది. ఆయన 1989లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చిన బాలరాజు 2009లో గెలవడం, నాటి సీఎం వైఎస్సార్ ఆయనను మంత్రిని చేయడం జరిగిపోయాయి. అయిదేళ్ళ పాటు మంత్రి హోదాలో ఆయన అటు గిరిజనానికి, ఇటు విశాఖ ప్రజలకు సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి కట్టుబడి పోటీ చేశారు. ఇక 2018లో ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు. ఆయన పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నాటి నుంచి మౌనంగా ఉంటున్న ఆయన పవన్ లాంగ్ మార్చ్ టైంలో తన రాజీనామా లేఖను పంపించేశారు. ఆయన వైఎస్సార్ కి వీరవిధేయుడు. దాంతో వైసీపీ వైపు వస్తారని ప్రచారం జరిగినా ఎందుకో సైలెంట్ అయిపోయారు.

అన్నకు ఇష్టుడు ……

ఇక మరో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య. ఆయన గాజువాక నుంచి ప్రజారాజ్యం తరఫున 2009లో గెలిచి చిరంజీవి మనసు కూడా గెలుచుకున్నారు. చిరంజీవి చెప్పినట్లుగానే ఆయన చేస్తూ కాంగ్రెస్ లో కూడా కొనసాగారు. విభజన తరువాత టీడీపీలోకి వచ్చినా 2014 ఎన్నికల్లో గాజువాక టికెట్ దక్కలేదు. దాంతో అక్కడ సైలెంట్ అయిన చింతలపూడి 2018లో ఏరి కోరి మరీ జనసేన పార్టీలో చేరారు. మళ్ళీ మెగా కుటుంబానికి తాను సన్నిహితమయ్యానని గొప్పగా చెప్పుకున్నారు. ఆయన గాజువాక నుంచి పోటీ చేద్దామనుకున్నారు. అక్కడ తనకు గట్టి పట్టు ఉందని కూడా భావించారు. ఆయితే ఏకంగా పవనే బరిలోకి దిగడంతో పాటు, చివరి నిముషంలో పెందుర్తికి పంపించడంతో అక్కడ చింతలపూడి ఓడిపోయారు. దాంతో ఆయన పవన్ మీద, పార్టీ మీదా కూడా విరక్తి పెంచుకున్నారు. గత ఏడాది మధ్యలో ఆయన జనసేనకు గుడ్ బై కొట్టారు. ఆ సమయంలో వైసీపీ పాలన బాగుందని కూడా కితాబు ఇచ్చారు.

రూటు అటేనా…..

ఈ ఇద్దరూ ఇపుడు వైసీపీ అధినాయకత్వం పిలుపు కోసం చూస్తున్నారని అంటున్నారు. ఇద్దరూ బలమైన సామాజికవరం నేపధ్యం కలిగినవారు కావడం వివాదరహితులు కావడం, జనంలో మంచి అభిప్రాయం ఉండడంతో వారిని వైసీపీలోకి తీసుకుంటారని అంటున్నారు. దీని మీద జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వీరి రాజకీయ రధం ముందుకు కదులుతుందని అంటున్నారు. అటు గాజువాకలో, ఇటు పాడేరులో కూడా వైసీపీకి బలమైన నాయకత్వం ఉండడంతో వీరిని కొత్తగా చేర్చుకుని గ్రూపులకు అవకాశం ఇస్తారా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా విశాఖలో పార్టీ మరింత పటిష్టం కావాలన్న ఉద్దేశ్యంతో పనిచేస్తున్న వైసీపీ పెద్దలు గట్టి నాయకులు ఎవరు వచ్చినా చేర్చుకుంటామనే అంటున్నారు. మరి ఈ ఇద్దరూ చేరేదెపుడోనని వారి అనుచరులు ఆలోచిస్తున్నారు.

Tags:    

Similar News