గూబ గుయ్యమనిపించారు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏలా ఉన్నా… ప్రాంతీయ పార్టీ జనతాదళ్ ఎస్ కు మాత్రం భవిష్యత్ కష్టాలు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఇక [more]

Update: 2019-12-09 18:29 GMT

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏలా ఉన్నా… ప్రాంతీయ పార్టీ జనతాదళ్ ఎస్ కు మాత్రం భవిష్యత్ కష్టాలు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఇక జనతాదళ్ ఎస్ కనుమరుగు కాక తప్పదన్న జోస్యం రాజకీయంగా వినపడుతోంది. పదిహేను స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ జేడీఎస్ విజయం సాధించలేకపోయింది. జేడీఎస్ ఈ ఎన్నికల్లో పన్నెండు చోట్ల పోటీ చేసింది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి, మరొక చోట కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.

కుటుంబ పార్టీగా…..

జేడీఎస్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. కుటుంబ పాలనగా ముద్రపడటం వల్లనే పూర్తిగా నష్టపోయింది. కొంతకాలం క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో సాక్షాత్తూ దేవెగౌడ తుముకూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన మనవడు నిఖిల్ గౌడ మాండ్యా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలతోనే కుమారస్వామి కుటుంబ పార్టీకి ప్రజలు జైకొట్టరని అర్థమయింది.

విడిగా పోటీ చేసి…..

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో స్వతంత్రంగా పోటీ చేయాలని జేడీఎస్ నిర్ణయించింది. అయితే తండ్రీ, కొడుకులు ఈ ఉప ఎన్నికల్లో చేసిన వ్యూహరచన వర్క్ అవుట్ కాలేదు. మొత్తం పన్నెండు చోట్ల పోటీ చేసినా ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం తండ్రీకొడుకులు దేవెగౌడ, కుమారస్వామికి నిలకడలేమితనమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు తమకు బీజేపీతో ఎలాంటి కయ్యం లేదన్నారు. బీజేపీకి అవసరమైతే తాము మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కాపాడతామని చెప్పారు.

కుమారస్వామి కుప్పిగంతులతో….

తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి తండ్రీకొడుకులు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే తిరిగి సంకీర్ణ సర్కార్ ఏర్పాటువుతుందని చెప్పారు. ఇక కుమారస్వామి అయితే అనేక సభల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి మీద వ్యామోహం లేదన్నారు. ఇలా కుమారస్వామి కుప్పిగంతుల కారణంగానే జేడీఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో జేడీఎస్ పని అయిపోయినట్లే నన్న వ్యాఖ్యలు ఆ పార్టీలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News